Competition examinations
-
పోటీ పరీక్షల్లో కీలకం 'భౌగోళికం'
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రిఫీ తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో భౌగోళిక శాస్త్రం అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే జీవపరిణామ క్రమంలో ‘ఆధునిక మానవుడి’ ప్రస్థానం భూమ్మీద ప్రారంభమైనప్పట్నుంచీ (సుమారు పదివేల ఏళ్ల నుంచి) ఇప్పటివరకు, భవిష్యత్తులో కూడా మానవ జీవితాన్ని భూగోళ శాస్త్రం ప్రభావితం చేస్తుంది. రాష్ట్రాల్లో, దేశంలో ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి, ఆయా ప్రాంతాల్లోని వనరుల లభ్యత, వినియోగం, వ్యవసాయ సామర్థ్యం, పారిశ్రామికీకరణ గురించి తెలుసుకోవడానికి, ప్రణాళికలు రూపొందించడంలో భూగోళశాస్త్ర పరిజ్ఞానం అవసరం. పైన తెలిపిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ, భారత భూగోళశాస్త్రంలో ఈ అంశాలను అధ్యయనం చేస్తే సివిల్స్ ప్రిలిమ్స్‌కే కాకుండా మెయిన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉభయరాష్ట్రాల్లో ఇప్పటినుంచి జరగబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి, సరళి సివిల్స్ తరహాలో ఉండబోతుందనేది సుస్పష్టం. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రమే దీనికి ఉదాహరణ. ఇప్పటినుంచి జరగబోయే పరీక్షల్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలే కాకుండా అసెర్షన్ అండ్ రీజన్, ఆడ్ మ్యాన్ ఔట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్మెంట్ రూపంలో మిశ్రమ పద్ధతిలో ప్రశ్నపత్రాల సరళి ఉండబోతుంది. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన అవసరం. కింది ప్రశ్నలను పరిశీలిస్తే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. 1) రుతువును అనుసరించి రాత్రి, పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటానికి ప్రధాన కారణం? ఎ) భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం బి) భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం సి) ఓ ప్రాంత అక్షాంశం విలువ డి) భూఅక్షం వాలి ఉన్నందున, భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గడం వల్ల సరైన సమాధానం: డి వివరణ: అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే ‘భూచలనాలు (మోషన్స్ ఆఫ్ ద ఎర్త్)’ అనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇక్కడ భూఅక్షం నిట్టనిలువుగా ఉండకుండా 23.5 డిగ్రీల కోణంలో ఓవైపు వాలి ఉంటుంది. భూభ్రమణ సమయంలో జనించే అపకేంద్రబలాల ప్రభావం తగ్గడంతోపాటు.. భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం(భూమి చుట్టుకొలత) తగ్గడమే ఇందుకు కారణం. ఈ మొత్తం ప్రక్రియ అర్థం కావాలంటే భూఅక్షం అంటే ఏమిటి? భూకక్ష్య(ఆర్బిట్) అంటే ఏమిటి? అపకేంద్రబలాలు అంటే ఏమిటి? అనే భావనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 2) కింది వాటిని పరిశీలించండి. 1) విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్) 2) జియో థర్మల్ ఎనర్జీ 3) గురుత్వాకర్షణ బలం 4) శిలావరణ ఫలకాల కదలికలు 5) భూభ్రమణం (రొటేషనల్ ఆఫ్ ద ఎర్త్) 6) భూపరిభ్రమణం (రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్) పైన తెలిపిన వాటిలో భూమిపై గతిశీల మార్పులకు కారణమైన అంశాలేవి? ఎ) 1,2,3,4 బి) 1,3,5,6 సి) 2,4,5,6 డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ: 1) సూర్యుని నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత వికిరణాలు భూమ్మీద ఉష్ణానికి, శక్తికి, పీడన వ్యత్యాసానికి మూలం. అంతేకాకుండా భూమ్మీద ఉన్న సకల జీవరాశులకు కావలసిన శక్తి అవసరాలు దీని ద్వారానే అందుతాయి. 2) శిలావరణ పలక సరిహద్దుల వెంబడి అగ్నిపర్వత విస్ఫోటనాలకు జియో థర్మల్ ఎనర్జీ కారణం 3) పోటు, పాటులు ఏర్పడటానికి, నదీ ప్రవాహ గమనానికి భూగురుత్వాకర్షణ బలాలు కారణం. 4) ఖండాల, పర్వతాల ఆవిర్భావానికి, భూకంపాలకు శిలావరణ ఫలక కదలికలు కారణం 5) రాత్రీపగలు ఏర్పడటానికి, భూమికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రాంతాల్లో జీవ నివాసానికి, పవనాలు, సముద్రప్రవాహాలు కదలడానికి భూభ్రమణమే కారణం. 6) రాత్రి, పగలు సమయాల్లో తేడాలు ఏర్పడటానికి, రుతువులు ఏర్పడటానికి భూపరిభ్రమణం కారణం. అభ్యర్థులు పై అంశాలను పరిశీలించిన తర్వాత భౌగోళిక ప్రక్రియలను అవగాహన చేసుకుని, వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పొందాలి. 3) కింద పేర్కొన్న జతలను పరిశీలించండి. జాతీయ పార్కు పార్కు ద్వారా ప్రవహించేనదులు 1) జిమ్ కార్బెట్ గంగ 2) కజిరంగా మానస్ 3) సెలైంట్ వ్యాలీ కావేరి 4) కన్హా బెట్వా పైన తెలిపిన వాటిలో ఏ జత సరైనదో పేర్కొనండి. ఎ) 1, 2 బి) 3 సి) 1, 3 డి) 4 సరైన సమాధానం: డి వివరణ: గంగా ఉపనది అయిన రామ్‌గంగా నది జిమ్ కార్బెట్ గుండా ప్రవహిస్తోంది. కజిరంగా పార్కు గుండా ఏ నదీ ప్రవహించడం లేదు. సెలైంట్వ్యాలీ గుండా కుంతీపూజా నది వెళుతోంది. 4) ప్రపంచంలో ఏ ప్రాంతంలో మత్స్య గ్రహణ కేంద్రాలు (ఫిషింగ్ గ్రౌండ్స్) కేంద్రీకృతమై ఉన్నాయి ఎ) ఉష్ణ, శీతల వాతావరణ ప్రవాహాలు కలిసే చోట బి) నదులు మంచినీటిని అధిక పరిమాణంలో సముద్రంలోకి పంపేచోట సి) ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుగా ఉండేచోట డి) ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే చోట పైన తెలిపిన వాటిలో నిజమైన వాక్యమేది? 1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి 4) సి, డి సరైన సమాధానం: 4 వివరణ: ఖండతీరపు అంచు వెడల్పుగా ఉన్న ప్రాంతం చేపలు నివసించడానికి అనుకూలంమైంది. ఇక్కడ చేపలు గుడ్లు పెట్టి, పొదిగి ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే ప్రదేశంలో వృక్ష ప్లవకాలు సమృద్ధిగా పెరుగుతాయి. వీటిని ఆహారంగా తీసుకుని జంతు ప్లవకాలు పెరుగుతాయి. జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకొని చేపలు సమృద్ధిగా పెరుగుతాయి. ఉష్ణ, శీతల ప్రవాహాలు కలిసే ప్రాంతాలు తీరరేఖ సమీపంలో ఉన్నందున ఖండ భూభాగాల నుంచి సమృద్ధిగా పోషకాలు అందుతాయి. - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ,ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
పోటీ పరీక్షల అభ్యర్థులకు హైటెక్ శిక్షణ
* వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్లలో బోధన * జిల్లా సమీక్షలు, పర్యవేక్షణకూ ఉపయోగం * ఢిల్లీ, బెంగళూరులలో మెయిన్స్‌కు శిక్షణ సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు హైటెక్ శిక్షణ అందుబాటులోకి రానుంది. దీనికి బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. దీనివల్ల జిల్లాల్లోని అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. మెరుగైన శిక్షణను అందించడం కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో మెరుగైన శిక్షణతోపాటు, నిపుణులు, సుశిక్షితులైన బోధకులు అందుబాటులో ఉంటున్నారు. అయితే జిల్లాల్లో నిపుణులైన అధ్యాపకుల కొరత కారణంగా పోటీపరీక్షల అభ్యర్థులకు ఇబ్బం దిగా మారుతోంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్ల విద్యార్థులకు ఇది మరింత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని స్టడీ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైనవారితో శిక్షణాతరగతులను నిర్వహించి, వాటిని వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా పది జిల్లాల్లో ప్రసారం చేసే విధంగా ఈ-స్కూల్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఆయా జిల్లాల్లోని స్టడీసర్కిళ్లలో దీని నిర్వహణకు అవసరమైన పరికరాల కోసం జిల్లాకు రూ.5.5 లక్షల చొప్పున మొత్తం రూ.55 లక్షలు అవసరమవుతాయని ప్రభుత్వానికి అంచనాలను సమర్పిం చింది. హెచ్డీ కెమెరా, మైక్, స్పీకర్లు, పెద్ద స్క్రీన్ టీవీ, బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ, తదితరాలను ప్రతిపాదనల్లో పొందుపరిచారు. వెంటనే దీనిని మొదలుపెట్టాలని బీసీ శాఖ భావిస్తోంది. దీనికి బీసీ, ఎస్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తుదిరూపు ఇస్తున్నారు. తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థులు తమ సందేహాలను తీర్చుకోవడంతోపాటు, లెక్చరర్లతో నేరుగా సంభాషించేందుకు అవకాశం ఉంటుందని, వారు నేరుగా తరగతిలో ఉన్నట్లుగా విద్యార్థులకు భావన కలగడం దీని ముఖ్యోద్దేశమని అధికారులు చెబుతున్నారు.అంతేకాకుండా వచ్చే విద్యాసంవత్సరం (2016-17) నుంచి ఎస్టీ, బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో కూడా వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అమలుచేస్తే ప్రాథమిక విద్యాస్థాయిలో కూడా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టడీసెంటర్లలో ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని శాఖాపరంగా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. జిల్లా స్థాయిల్లోని బీసీ ప్రీమెట్రిక్ స్కూళ్లు, హాస్టళ్లలోని స్థితిగతులు, పాఠ్యాంశాల బోధన, శాఖాపరమైన కార్యకలాపాల సమీక్షకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది. మరింత మెరుగ్గా సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా ఢిల్లీ, బెంగళూరులలో శిక్షణను అందించేలా బీసీ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అభ్యర్థులకు అవసరమైన ఆర్థికసహాయాన్ని అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు దీని అమలు ప్రారంభమై గత ఏడాది 250 మందికి, ఈ ఏడాది 300 మందికి మెయిన్స్ శిక్షణను అందిస్తున్నారు. -
రాజ్యాంగం, చట్టాలపై పట్టు అవసరం
ఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ జీబీ రెడ్డి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కీలక సూచనలు * సవరణ బిల్లులు. సవరణ చట్టాలకు తేడా తెలుసుకోవాలి * ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ, న్యాయవ్యవస్థలపై పట్టు సాధించాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఏ పోటీ పరీక్షకు సిద్ధమైనా భారత రాజ్యాంగం, ప్రధాన చట్టాలపై అభ్యర్థులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాల్సిందే. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గెజిటెట్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ పరీక్షల్లో ఈ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎన్ని రాజ్యాంగ సవరణలు చేశారు, సవరణ బిల్లులకు-సవరణ ద్వారా చేసిన చట్టాలకు మధ్య తేడాలపైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ప్రొఫెసర్ జీబీ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ప్రధానంగా ఏయే అంశాలపై దృష్టి సారించాలన్న అంశాలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు అభ్యర్థుల కోసం... ప్రధానంగా గ్రూప్-1 జనరల్ స్టడీస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు రాజ్యాంగం, పాలిటీ అంశాలు, జెండర్ వారీగా, సామాజిక వర్గాల వారీగా వారికి దక్కని రాజ్యాంగ ఫలాలు, అందుబాటులోకి వచ్చిన రాజ్యాంగ ఫలాలకు సంబంధించిన విధానాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ రాజ్యాంగంతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని అనుబంధంగా ఉంటాయి. గ్రూప్-2 జనరల్ ఎస్సేలో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే అంశమూ ఉంది. ఇందులో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి చూడాల్సి ఉంటుంది. పేపర్-3లో భారత రాజ్యాంగంపైనే ప్రత్యేక పేపర్ ఉంది. అభ్యర్థులు రాజ్యాంగాన్ని చదువుకునేప్పుడు ఐదు భాగాలుగా విభజించుకుని చదవాలి అవి.. 1.భారత రాజ్యాంగం పరిణామ క్రమం; 2.ప్రాథమిక హక్కులు; 3.ప్రభుత్వ వ్యవస్థ; 4. న్యాయ వ్యవస్థ; 5.సమాఖ్య వ్యవస్థ. ఇలా ఐదు విభాగాలుగా అభ్యర్థులు నోట్స్ సిద్ధం చేసుకుంటే అంశాల వారీగా పరీక్షకు సిద్ధం కావడం సులభం అవుతుంది. సవరణలు కీలకం అభ్యర్థులు రాజ్యాంగ సవరణల గురించి తప్పకుండా చదువుకోవాలి. ఇప్పటివరకు 99 సవరణలు జరిగాయి. 8 షెడ్యూళ్లు 12కు పెరిగాయి. న్యాయస్థానాలు గుర్తించడం వల్ల ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. ప్రధానంగా గ్రూప్-1కు సిద్ధమయ్యే వారు వీటిని కచ్చితంగా తెలుసుకోవాలి. కీలక అంశాలపై వచ్చిన ప్రముఖ తీర్పుల గురించి తెలుసుకోవాలి. గ్రూప్-2కు నిర్దిష్టంగా.. గ్రూప్-2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా దీనికి సంబంధించి అన్ని అంశాలనూ తెలుసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. గ్రూప్-2లో భారత రాజ్యాంగం-రాజకీయ అవలోకనం పేపర్-2లో రెండో అంశంగా ఉంది. న్యాయవ్యవస్థ క్రియాశీలత, కోర్టులు ఇచ్చే తీర్పులు, వ్యాఖ్యానాలు ఎలా ప్రభావితం చేయగలుగుతాయన్న అంశంపై నిర్దిష్టంగా అవగాహన పెంచుకోవాలి. సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగ పరిణామక్రమం నుంచి రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వరకు చదువుకోవాలి. గ్రూప్-3: ఇందులో కేవలం రాజ్యాంగ అవలోకనం మాత్రమే ఉంటుంది 1. భారత రాజ్యాంగం - పరిణామక్రమం ఇందులో ప్రధానంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు. దాని తత్వం ఏమిటన్నది చూసుకోవాలి. దీనిని తిరిగి 3 అం శాలుగా చేసుకోవాలి. ఎ.రాజ్యాంగ పీఠిక ఏం చెబుతోంది. దాని ప్రాముఖ్యత ఏమిటి?; బి.12 వరకున్న రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలు తెలుసుకోవాలి. అందులో లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం ప్రధానం; సి.రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ సవరణలు తెలుసుకోవాలి. వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యాంగ రచన, రాజ్యాంగ అసెంబ్లీ, రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న విధానం, రాజ్యాంగ సవరణలో ఏయే భాగాలను సవరించవచ్చన్నది తెలుసుకోవాలి. 2. ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులపై కచ్చితంగా పట్టు ఉండాల్సిందే. సంక్షేమ రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పాత్ర కీలకం. ప్రభుత్వంలో ఉండే అధికారులు, ఉద్యోగుల అధికారాలపై ప్రాథమిక హక్కులు పరిమితిని విధిస్తాయి. ప్రాథమిక హక్కుల స్వభావం, వాటి పరిధి, అవి ఎవరికి వర్తిస్తాయి, ఎవరిపై అమలు చేయవచ్చన్న అంశాలు తెలుసుకోవాలి. సంక్షేమ రాజ్యాంగంలో అధికారులు, ఉద్యోగులు సమన్యాయ సిద్ధాంతం పాటించాలి కనుక ప్రాథమిక హక్కు అంశం వచ్చినపుడు అధికారం పరిమితం అవుతుంది. ప్రాథమిక హక్కులతోపాటు మరో ప్రధాన అంశం ఆదేశిక సూత్రాలు. వాటి తత్వం తెలుసుకోవాలి. సాధారణంగా న్యాయస్థానాలు వీటిని అమలు చేయవు. అయితే న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా ఆదేశిక సూత్రాలను కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తాయి. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కు చట్టాన్ని చెప్పవచ్చు. మొదట అది ఆదేశిక సూత్రాల్లో ఉంది. న్యాయస్థానాలు గుర్తించి పలు తీర్పుల్లో ప్రాథమికహక్కుగా ఉండాలని చెప్పడంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే ఉచిత న్యాయ సలహా. మొదట్లో ఇది ఎక్కడా లేదు. ఆ తరువాత ఆదేశిక సూత్రంగా మార్చారు. ఆర్టికల్ 48 (ఎ)లోని పర్యావరణ పరిరక్షణను ప్రధాన చట్టంగా చేశారు. రైట్ టు వర్క్ నుంచే ఉపాధి హామీ చట్టం చేశారు. అయితే కొన్నింటిని చట్టంగా చేయలేకపోతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌర స్మృతి. అన్ని మతాల వారికి సమాన చట్టం వర్తింపజేయాలన్నది రాజ్యాంగం ఉద్దేశం. కాని చట్టం రూపంలో అమలు చేయడం లేదు. 1950 నుంచి 2015 వరకు ఏయే ఆదేశిక సూత్రాలను చట్టంగా మార్పు చే సి, అమలు చేశారన్నది, న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా ఎన్నింటిని ప్రాథమిక హక్కుగా పరిగణించాయన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెచ్చారన్నది తెలుసుకోవాలి. వాటిని ఎప్పుడు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారు, ఇప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అమలు చేయవచ్చు, వాటికి చట్టం అవసరమా? అన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 (బి, సి) ప్రకారం ఉత్పత్తి మూలాలు కొందరికే కేంద్రీకృతమై ఉండొద్దు. సహజ వనరులు అందరికీ సమానంగా అందేలా విభజించాలన్నది తెలుసుకోవాలి. ఆర్టికల్ 31 (సి) ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇస్తుంది. 3. ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ, బ్రిటిష్ వారి నుంచి తీసుకున్న స్ఫూర్తి ఏమిటి? దేశ అధ్యక్షుడికి ఉండే రాజ్యాంగ హోదా, ప్రధాని, మంత్రి మండలి విధులు, అధికారాలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రపతికి ఉండే శాసనపరమైన, న్యాయపరమైన అధికారాలు, ఆయనకు ఉండే విచక్షణ అధికారాలు ఏమిటన్న అంశాలపై అవగాహన ఉండాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, ముఖ్యమం త్రి, రాష్ట్ర మంత్రి మండలి, అధికారులు, పాలకులు-అధికారుల మధ్య సంబంధాలపై తెలుసుకోవాలి. శాసన హక్కుల ప్రత్యేకతలను ఆర్టికల్ 105, 194 నుంచి తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశాలైన మంత్రి మండలి 15 శాతానికి మించవద్దన్న అంశం, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై రాజ్యాంగం ఏం చెబుతోందన్న అవగాహన ఉండాలి. 4. న్యాయ వ్యవస్థ ఇందులో హైకోర్టులు, సుప్రీంకోర్టు, అవికాకుండా పరిపాలన ట్రిబ్యునళ్లు, వాటి అధికారాలు, పరిపాలన ట్రిబ్యునళ్లకు, హైకోర్టు మధ్య సంబంధాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. న్యాయసమీక్ష అధికారాల గురించి తెలుసుకోవాలి. దాని ప్రకారం ఏ చట్టాన్నయినా సమీక్షించవచ్చా, ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చా? అన్నది తెలుసుకోవాలి. అయితే కొన్నింటిని సమీక్షించడానికి వీల్లేదు. 9వ షెడ్యూల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. - ఈ అంశంపై ఇటీవల చర్చల్లో ఉన్న న్యాయమూర్తుల నియామకాలపై ప్రక్రియపై దృష్టిపెట్టాలి. 1993 నుంచి ఇప్పటివరకు కొలీజియం ద్వారా, అంతకుముందు కార్యనిర్వాహక శాఖ ద్వారా చేపట్టిన న్యాయమూర్తుల నియామకాలు, ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ పరిణామాలు తెలుసుకోవాలి. 5. సమాఖ్య వ్యవస్థ ఇందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, వాటి మధ్య శాసన సంబంధ అంశాలే కాకుండా పరిపాలన, ఆర్థిక సంబంధాలపైనా ప్రధాన దృష్టి పెట్టాలి. రాష్ట్రాలు, స్థానిక సంస్థల మధ్య సంబంధాలను, 73, 74 రాజ్యాంగ సవరణలను విశ్లేషించాలి. వాటి ప్రభావాన్ని తెలుసుకోవాలి. 11, 12వ షెడ్యూళ్లను చదువుకోవాలి. కేంద్ర-రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే వాటి పరిష్కార మార్గాలు (ఉదాహరణకు నదీ జల వివాదాలు) ఏమిటన్నది తెలుసుకోవాలి. ఇవి దృష్టిలో పెట్టుకోండి తెలుగు మీడియం వారు గ్రాంథిక భాషలో పుస్తకాల్లో ఉన్నట్లుగా పరీక్షల్లో రాయొద్దు. అధికరణం అనేకంటే ఆర్టికల్ అని రాస్తేనే మంచిది. 99 రాజ్యాంగ సవరణలపై పూర్తిగా పట్టు సాధించాలి. సవరణ బిల్లులకు, సవరణ చట్టాలకు మధ్య తేడా తెలుసుకోవాలి. మూల అంశాలతోపాటు సమకాలీన అంశాలపై దృష్టి పెట్టి చదువుకోవాలి. అలాగే గ్రూప్-1, గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఏయే పుస్తకాలు చదవాలంటే.. రాజ్యాంగానికి సంబంధించి అనేక పుస్తకాలు ఉన్నాయి. రాజనీతి, రాజకీయాలు-రాజ్యాంగం అనే పుస్తకం ఉంది. లక్ష్మీకాంత్ రాసిన ఇండియన్ పాలిటీ ఉంది. డీడీ బసు రాసిన రాజ్యాంగ పరిణామం, ఎంవీ పైలీ రాసిన భారత రాజ్యాంగం. సుభాష్ కశ్యప్ రాసిన మన రాజ్యాంగం-మన పార్లమెంటు. పీఎం భక్షి రాసిన భారత రాజ్యాంగం పుస్తకాలను చదువుకోవచ్చు. భారత రాజ్యాంగం ఎలా పనిచేస్తుందన్న దానిపై జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ 2002లో ఇచ్చిన నివేదికను చదువుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్ నివేదికలు, ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడ మీ పుస్తకాలు చదువుకోవాలి. -
వెబ్సైట్లో తెలంగాణ పోరాట క్రమం!
ముఖ్య సమాచారాన్ని అందుబాటులోకి తెస్తాం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్‌తోపాటు ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు గ్రూప్-1 సిలబస్ సబ్‌కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాట క్రమం, ఆవిర్భావంపై ప్రామాణిక పుస్తకాలు లేనందున విద్యార్థుల్లో ఆందోళనలున్నాయన్న విషయాన్ని ఆయన దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా స్పందించారు. ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి రచనలు, ఉద్యమంపై వచ్చిన రచనలు అందుబాటులోకి తేవాలనుకున్నట్లు చె ప్పారు. మరిన్ని అంశాలు ఆయన మాట ల్లోనే.. ‘‘ముఖ్యంగా గ్రూప్-1 మెయిన్స్‌లో ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో ఆరో పేపరు ప్రవేశపెట్టాం. అందులో ‘ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్, టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విభాగాలు ఉన్నా యి. ఇందులో మూడో విభాగమైన ‘టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విషయంలో అభ్యర్థులకు మరింత సమాచారం అందించాలని భావి స్తున్నాం. ఇందుకోసం గ్లిర్గానీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదికలు, 610 జీవో ముఖ్యాం శాలు వంటి ప్రధానమైన సంఘటనల సమాచారం సైతం అందించాలనేది ఒక ఆలోచన. అలాగే శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయం మినహా మిగతా విభాగాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పేపర్ మొదటి రెండు విభాగాల్లో పేర్కొన్న నిర్దేశిత సిలబస్‌కు సరితూగే ప్రామాణిక పుస్తకాలు ఎన్నో ఉన్నా యి. అభ్యర్థులు ప్రధాన, సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధమ వ్వాలి. కొన్నేళ్లలో జరిగిన ముఖ్యఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు కాబట్టి ప్రతీ పేపర్లోనూ తెలంగాణ దృక్పథాన్ని ప్రతిబిం బించే అంశాలను పొం దుపర్చడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్న సమస్యలు, పరిస్థితుల వంటివి సిలబస్‌లో పేర్కొన్నాం. గ్రూప్-1 రెండో పేపర్‌నే తీసుకుంటే మూడో విభాగంలోని ఫ్లోరోసిస్ సమస్య, ఈప్రాంతం నుంచి వలసలు, రైతులు, చేనేత సమస్యలు ఇందుకు ఉదాహరణలు. తెలంగాణలో విధులు నిర్వర్తించే అభ్యర్థులకు ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితులపై అవగాహన ఉంటేనే విధుల్లో సమర్థత ఉంటుంది. తద్వారా అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు గల కారణాలు కూడా తెలియాలి. ఈ ఉద్దేశాలతోనే సిలబస్‌లో ఈ ప్రాంత పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.’’ -
పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్లోకి తెచ్చే ఏర్పాట్లు చేసింది. పోటీ పరీక్షల కోసం ఇన్నాళ్లు కోచింగ్‌లకు వెళ్లినా.. మార్పు చేసిన పరీక్షల విధానం, సిలబస్ కారణంగా అకాడమీ రూపొందించే పుస్తకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన పుస్తకాలను రాయించి ముద్రించింది. వాటితోపాటు జనరల్ స్టడీస్ పుస్తకాలను తెచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో మరిన్ని పుస్తకాలను ప్రొఫెసర్లతో రాయిస్తోంది. త్వరలోనే మరిన్ని పుస్తకాలను తీసుక వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల పేపర్లు, అందులో వచ్చే వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కసరత్తు చేపట్టింది. గతంలోనే తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన తెలుగు అకాడమీ.. ఇప్పుడు తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాలను రాయిస్తోంది. వీటితోపాటు భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం, భౌగోళిక విజ్ఞాన శాస్త్రం, భూసంస్కరణలపై క్వశ్చన్ బ్యాంకులు రూపొందిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 లక్ష్యంగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పోటీ పరీక్షలే ప్రధాన లక్ష్యంగా, వాటి సిలబస్ ఆధారంగా పుస్తకాల రచనకు అకాడమీ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి సిలబస్ వచ్చిన వెంటనే ఆయా అంశాలతో కొత్త పుస్తకాలను సరిచూసుకొని ముద్రించి మార్కెట్లోకి తేనుంది. ఇప్పటికే జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర తదితర పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో... తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమని సుల్తాన్లు, కుతుబ్‌షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలను పొందుపరుస్తోంది. ఉపయుక్తంగా ఇంటర్, డిగ్రీ పుస్తకాలు ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్మీడియెట్, డిగ్రీలోని పాఠ్య పుస్తకాలను పోటీ పరీక్షల కోసం సిలబస్‌కు అనుగుణంగా తీసుకొచ్చాయి. సిలబస్‌లోని అంశాలపై ప్రత్యేకంగా పాఠాలు ఉన్నాయి. దీంతో పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ పుస్తకాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వాటిని పునర్ ముద్రించే పనిలో పడింది. తెలంగాణ చరిత్ర, భూగోళం, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇంటర్ పుస్తకాల్లోని ఈ అంశాలు అభ్యర్థులకు ఉపయోగపడనున్నాయి. అలాగే, తెలంగాణకు అనుగుణంగా మార్పు చేసిన డి గ్రీ పుస్తకాల ముద్రణ పైనా తెలుగు అకాడమీ దృష్టి పెట్టింది.