రాజ్యాంగం, చట్టాలపై పట్టు అవసరం | Constitution, Laws On Grip | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం, చట్టాలపై పట్టు అవసరం

Published Wed, Sep 16 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

రాజ్యాంగం, చట్టాలపై పట్టు అవసరం

రాజ్యాంగం, చట్టాలపై పట్టు అవసరం

ఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ జీబీ రెడ్డి
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కీలక సూచనలు
* సవరణ బిల్లులు. సవరణ చట్టాలకు తేడా తెలుసుకోవాలి
* ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ, న్యాయవ్యవస్థలపై పట్టు సాధించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఏ పోటీ పరీక్షకు సిద్ధమైనా భారత రాజ్యాంగం, ప్రధాన చట్టాలపై అభ్యర్థులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాల్సిందే. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గెజిటెట్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ పరీక్షల్లో ఈ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే ఎన్ని రాజ్యాంగ సవరణలు చేశారు, సవరణ బిల్లులకు-సవరణ ద్వారా చేసిన చట్టాలకు మధ్య తేడాలపైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ప్రొఫెసర్ జీబీ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ప్రధానంగా ఏయే అంశాలపై దృష్టి సారించాలన్న అంశాలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు అభ్యర్థుల కోసం...
 
ప్రధానంగా గ్రూప్-1 జనరల్ స్టడీస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు రాజ్యాంగం, పాలిటీ అంశాలు, జెండర్ వారీగా, సామాజిక వర్గాల వారీగా వారికి దక్కని రాజ్యాంగ ఫలాలు, అందుబాటులోకి వచ్చిన రాజ్యాంగ ఫలాలకు సంబంధించిన విధానాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ రాజ్యాంగంతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని అనుబంధంగా ఉంటాయి. గ్రూప్-2 జనరల్ ఎస్సేలో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే అంశమూ ఉంది.

ఇందులో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి చూడాల్సి ఉంటుంది. పేపర్-3లో భారత రాజ్యాంగంపైనే ప్రత్యేక పేపర్ ఉంది. అభ్యర్థులు రాజ్యాంగాన్ని చదువుకునేప్పుడు ఐదు భాగాలుగా విభజించుకుని చదవాలి అవి..
 1.భారత రాజ్యాంగం పరిణామ క్రమం;
 2.ప్రాథమిక హక్కులు; 3.ప్రభుత్వ వ్యవస్థ;
 4. న్యాయ వ్యవస్థ; 5.సమాఖ్య వ్యవస్థ.
ఇలా ఐదు విభాగాలుగా అభ్యర్థులు నోట్స్ సిద్ధం చేసుకుంటే అంశాల వారీగా పరీక్షకు సిద్ధం కావడం సులభం అవుతుంది.
 
సవరణలు కీలకం
అభ్యర్థులు రాజ్యాంగ సవరణల గురించి తప్పకుండా చదువుకోవాలి. ఇప్పటివరకు 99 సవరణలు జరిగాయి. 8 షెడ్యూళ్లు 12కు పెరిగాయి. న్యాయస్థానాలు గుర్తించడం వల్ల ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. ప్రధానంగా గ్రూప్-1కు సిద్ధమయ్యే వారు వీటిని కచ్చితంగా తెలుసుకోవాలి. కీలక అంశాలపై వచ్చిన ప్రముఖ తీర్పుల గురించి తెలుసుకోవాలి.
 
గ్రూప్-2కు నిర్దిష్టంగా..
గ్రూప్-2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా దీనికి సంబంధించి అన్ని అంశాలనూ తెలుసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. గ్రూప్-2లో భారత రాజ్యాంగం-రాజకీయ అవలోకనం పేపర్-2లో రెండో అంశంగా ఉంది. న్యాయవ్యవస్థ క్రియాశీలత, కోర్టులు ఇచ్చే తీర్పులు, వ్యాఖ్యానాలు ఎలా ప్రభావితం చేయగలుగుతాయన్న అంశంపై నిర్దిష్టంగా అవగాహన పెంచుకోవాలి. సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగ పరిణామక్రమం నుంచి రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వరకు చదువుకోవాలి.
గ్రూప్-3: ఇందులో కేవలం రాజ్యాంగ అవలోకనం మాత్రమే ఉంటుంది
 
1. భారత రాజ్యాంగం - పరిణామక్రమం
ఇందులో ప్రధానంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు. దాని తత్వం ఏమిటన్నది చూసుకోవాలి. దీనిని తిరిగి 3 అం శాలుగా చేసుకోవాలి. ఎ.రాజ్యాంగ పీఠిక ఏం చెబుతోంది. దాని ప్రాముఖ్యత ఏమిటి?; బి.12 వరకున్న రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలు తెలుసుకోవాలి. అందులో లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం ప్రధానం; సి.రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ సవరణలు తెలుసుకోవాలి. వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యాంగ రచన, రాజ్యాంగ అసెంబ్లీ, రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న విధానం, రాజ్యాంగ సవరణలో ఏయే భాగాలను సవరించవచ్చన్నది తెలుసుకోవాలి.
 
2. ప్రాథమిక హక్కులు
ప్రాథమిక హక్కులపై కచ్చితంగా పట్టు ఉండాల్సిందే. సంక్షేమ రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పాత్ర కీలకం. ప్రభుత్వంలో ఉండే అధికారులు, ఉద్యోగుల అధికారాలపై ప్రాథమిక హక్కులు పరిమితిని విధిస్తాయి. ప్రాథమిక హక్కుల స్వభావం, వాటి పరిధి, అవి ఎవరికి వర్తిస్తాయి, ఎవరిపై అమలు చేయవచ్చన్న అంశాలు తెలుసుకోవాలి. సంక్షేమ రాజ్యాంగంలో అధికారులు, ఉద్యోగులు సమన్యాయ సిద్ధాంతం పాటించాలి కనుక ప్రాథమిక హక్కు అంశం వచ్చినపుడు అధికారం పరిమితం అవుతుంది.
 
ప్రాథమిక హక్కులతోపాటు మరో ప్రధాన అంశం ఆదేశిక సూత్రాలు. వాటి తత్వం తెలుసుకోవాలి. సాధారణంగా న్యాయస్థానాలు వీటిని అమలు చేయవు. అయితే న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా ఆదేశిక సూత్రాలను కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తాయి. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కు చట్టాన్ని చెప్పవచ్చు. మొదట అది ఆదేశిక సూత్రాల్లో ఉంది. న్యాయస్థానాలు గుర్తించి పలు తీర్పుల్లో ప్రాథమికహక్కుగా ఉండాలని చెప్పడంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే ఉచిత న్యాయ సలహా. మొదట్లో ఇది ఎక్కడా లేదు. ఆ తరువాత ఆదేశిక సూత్రంగా మార్చారు.

ఆర్టికల్ 48 (ఎ)లోని పర్యావరణ పరిరక్షణను ప్రధాన చట్టంగా చేశారు. రైట్ టు వర్క్ నుంచే ఉపాధి హామీ చట్టం చేశారు. అయితే కొన్నింటిని చట్టంగా చేయలేకపోతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌర స్మృతి. అన్ని మతాల వారికి సమాన చట్టం వర్తింపజేయాలన్నది రాజ్యాంగం ఉద్దేశం. కాని చట్టం రూపంలో అమలు చేయడం లేదు. 1950 నుంచి 2015 వరకు ఏయే ఆదేశిక సూత్రాలను చట్టంగా మార్పు చే సి, అమలు చేశారన్నది, న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా ఎన్నింటిని ప్రాథమిక హక్కుగా పరిగణించాయన్నది కచ్చితంగా తెలుసుకోవాలి.
 
ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెచ్చారన్నది తెలుసుకోవాలి. వాటిని ఎప్పుడు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారు, ఇప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అమలు చేయవచ్చు, వాటికి చట్టం అవసరమా? అన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 (బి, సి) ప్రకారం ఉత్పత్తి మూలాలు కొందరికే కేంద్రీకృతమై ఉండొద్దు. సహజ వనరులు అందరికీ సమానంగా అందేలా విభజించాలన్నది తెలుసుకోవాలి. ఆర్టికల్ 31 (సి) ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇస్తుంది.
 
3. ప్రభుత్వ వ్యవస్థ
ప్రభుత్వ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ, బ్రిటిష్ వారి నుంచి తీసుకున్న స్ఫూర్తి ఏమిటి? దేశ అధ్యక్షుడికి ఉండే రాజ్యాంగ హోదా, ప్రధాని, మంత్రి మండలి విధులు, అధికారాలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రపతికి ఉండే శాసనపరమైన, న్యాయపరమైన అధికారాలు, ఆయనకు ఉండే విచక్షణ అధికారాలు ఏమిటన్న అంశాలపై అవగాహన ఉండాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, ముఖ్యమం త్రి, రాష్ట్ర మంత్రి మండలి, అధికారులు, పాలకులు-అధికారుల మధ్య సంబంధాలపై తెలుసుకోవాలి. శాసన హక్కుల ప్రత్యేకతలను ఆర్టికల్ 105, 194 నుంచి తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశాలైన మంత్రి మండలి 15 శాతానికి మించవద్దన్న అంశం, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై రాజ్యాంగం ఏం చెబుతోందన్న అవగాహన ఉండాలి.
 
4. న్యాయ వ్యవస్థ
ఇందులో హైకోర్టులు, సుప్రీంకోర్టు, అవికాకుండా పరిపాలన ట్రిబ్యునళ్లు, వాటి అధికారాలు, పరిపాలన ట్రిబ్యునళ్లకు, హైకోర్టు మధ్య సంబంధాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. న్యాయసమీక్ష అధికారాల గురించి తెలుసుకోవాలి. దాని ప్రకారం ఏ చట్టాన్నయినా సమీక్షించవచ్చా, ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చా? అన్నది తెలుసుకోవాలి. అయితే కొన్నింటిని సమీక్షించడానికి వీల్లేదు. 9వ షెడ్యూల్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

- ఈ అంశంపై ఇటీవల చర్చల్లో ఉన్న న్యాయమూర్తుల నియామకాలపై ప్రక్రియపై దృష్టిపెట్టాలి. 1993 నుంచి ఇప్పటివరకు కొలీజియం ద్వారా, అంతకుముందు కార్యనిర్వాహక శాఖ ద్వారా చేపట్టిన న్యాయమూర్తుల నియామకాలు, ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ పరిణామాలు తెలుసుకోవాలి.
 
5. సమాఖ్య వ్యవస్థ
ఇందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, వాటి మధ్య శాసన సంబంధ అంశాలే కాకుండా పరిపాలన, ఆర్థిక సంబంధాలపైనా ప్రధాన దృష్టి పెట్టాలి. రాష్ట్రాలు, స్థానిక సంస్థల మధ్య సంబంధాలను, 73, 74 రాజ్యాంగ సవరణలను విశ్లేషించాలి. వాటి ప్రభావాన్ని తెలుసుకోవాలి. 11, 12వ షెడ్యూళ్లను చదువుకోవాలి. కేంద్ర-రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే వాటి పరిష్కార మార్గాలు (ఉదాహరణకు నదీ జల వివాదాలు) ఏమిటన్నది తెలుసుకోవాలి.
 
ఇవి దృష్టిలో పెట్టుకోండి
తెలుగు మీడియం వారు గ్రాంథిక భాషలో పుస్తకాల్లో ఉన్నట్లుగా పరీక్షల్లో రాయొద్దు. అధికరణం అనేకంటే ఆర్టికల్ అని రాస్తేనే మంచిది. 99 రాజ్యాంగ సవరణలపై పూర్తిగా పట్టు సాధించాలి. సవరణ బిల్లులకు, సవరణ చట్టాలకు మధ్య తేడా తెలుసుకోవాలి. మూల అంశాలతోపాటు సమకాలీన అంశాలపై దృష్టి పెట్టి చదువుకోవాలి. అలాగే గ్రూప్-1, గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి.
 
ఏయే పుస్తకాలు చదవాలంటే..
రాజ్యాంగానికి సంబంధించి అనేక పుస్తకాలు ఉన్నాయి. రాజనీతి, రాజకీయాలు-రాజ్యాంగం అనే పుస్తకం ఉంది. లక్ష్మీకాంత్ రాసిన ఇండియన్ పాలిటీ ఉంది. డీడీ బసు రాసిన రాజ్యాంగ పరిణామం, ఎంవీ పైలీ రాసిన భారత రాజ్యాంగం. సుభాష్ కశ్యప్ రాసిన మన రాజ్యాంగం-మన పార్లమెంటు. పీఎం భక్షి రాసిన భారత రాజ్యాంగం పుస్తకాలను చదువుకోవచ్చు. భారత రాజ్యాంగం ఎలా పనిచేస్తుందన్న దానిపై జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ 2002లో ఇచ్చిన నివేదికను చదువుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్ నివేదికలు, ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడ మీ పుస్తకాలు చదువుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement