బెస్ట్ స్కూల్ ఎంపికలో!
కిండర్ గార్టెన్ చదువుల నుంచే కాసులు కుమ్మరించాల్సిన పరిస్థితులు.. ఎల్‌కేజీ చదువుల నుంచే లక్షల్లో ఖర్చవుతున్న రోజులు.. పాఠశాల దశ పూర్తి చేసుకునే క్రమంలో అడుగడుగునా కాసుల వర్షం కురిపించాల్సిందే..!
* ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్ ఇలా ఎన్నో వ్యవస్థలు..
* కరిక్యులం, బోధన పద్ధతుల్లోనూ ఎంతో వైవిధ్యం..
అందుకే తమ పిల్లలకు ఏది మంచిదో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం!!
లక్షలు వెచ్చించినా.. సరైన చదువు అందుతుందా.. బిడ్డల భవిష్యత్‌కు భరోసా లభిస్తుందా..! అనే ప్రశ్న!! అందుకే కిండర్ గార్టెన్ నుంచే స్కూల్ ఎంపికలో ఎంతో కసరత్తు చేయాలి. ఎన్నో అంశాలను పరిశీలించి మంచి స్కూల్‌ను ఎంపిక చేసుకోవాలి. బెస్ట్ స్కూల్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలపై తల్లిదండ్రుల కోసం సాక్షి అందిస్తున్న కథనం...
పిల్లల మానసిక పరిస్థితి
పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో ముందుగా తల్లిదండ్రులు హోం వర్క్ చేయాలి. తమ పిల్లల మానసిక పరిస్థితి, పరిపక్వత స్థాయిలను అంచనా వేయాలి. కొంతమంది పిల్లలు ఒక విషయాన్ని ఇట్టే గ్రహించగలరు. అదే విధంగా కొంతమంది పిల్లలు ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు గమనించాలి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత అనుకూలించినా.. పిల్లల మానసిక పరిపక్వతకు ప్రాధాన్యమివ్వడం ఎంతో అవసరం.
కరిక్యులంపై దృష్టి
ప్రస్తుతం మన దేశంలో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఐజీసీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ బాక్యులరేట్, స్టేట్ బోర్డ్ విధానాలు అమలవుతున్నాయి. ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈల్లో సిలబస్, కరిక్యులం పరంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. స్టేట్ బోర్డ్‌ల సిలబస్‌లోనూ ఇటీవల కాలంలో ఈ తరహా విధానానికి రూపకల్పన చేసినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో అమలవడం లేదు. తమ పిల్లలకు ఏ కరిక్యులం బాగుంటుందో గుర్తించి.. ఆ మేరకు బోర్డ్ ఎంపిక చేసుకోవాలి.
స్టూడెంట్ - టీచర్ నిష్పత్తి
పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో అత్యంత ప్రాధాన్యత గల అంశం.. సదరు పాఠశాలలో స్టూడెంట్-టీచర్ నిష్పత్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం- ప్రతి క్లాస్ రూంలో 30మంది విద్యార్థులకు మించకూడదు. అప్పుడే ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టే అవకాశం టీచర్లకు లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు సైతం టీచర్ బోధించే అంశాన్ని ఏకాగ్రతతో వినడానికి ఆస్కారం లభిస్తుంది.
యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్
పాఠశాల ఎంపికలో పరిగణించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు సదరు స్కూల్ ఇస్తున్న ప్రాధాన్యం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఏదైనా ఒక అంశాన్ని బోర్డ్‌పై చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా మరింత నైపుణ్యం అందించడం. ఉదాహరణకు కిండర్ గార్టెన్ స్థాయిలో బర్డ్స్, ట్రీస్ వంటి వాటి గురించి చెప్పేటప్పుడు వాటికి సంబంధించిన డ్రాయింగ్స్‌ను వేయించడం, పై తరగతుల్లో చిన్నపాటి ప్రయోగాలు చేయించడాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌గా పేర్కొనొచ్చు.
ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
విద్యార్థి జీవితంలో చదువుతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్ తదితర)కు ప్రాధాన్యం ఉంటుంది. కారణం.. వీటివల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసం లభిస్తుంది. అందుకే సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్‌లు ఈ మేరకు నిర్దిష్ట నిబంధనలు సైతం అమలు చేస్తున్నాయి. ప్రతి స్కూల్‌లో ప్లే గ్రౌండ్, ఇతర సదుపాయాలు ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.
‘ఫీడ్ బ్యాక్’.. ఫ్రం స్కూల్స్
పాఠశాల ఎంపిక క్రమంలో తల్లిదండ్రులు పరిగణించాల్సిన మరో ప్రధాన అంశం.. ఫీడ్ బ్యాక్ ఫ్రం స్కూల్స్. అంటే.. తమ పిల్లలు తరగతి గదిలో వ్యవహరిస్తున్న శైలి గురించి పాఠశాలల యాజమాన్యాలు లేదా టీచర్లు తమకు సమాచారం అందిస్తారా? లేదా? అని తెలుసుకోవాలి. కొన్ని స్కూల్స్ కేవలం పరీక్షలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డ్‌లు ఇవ్వడానికే పరిమితం అవుతున్నాయి. పేరెంట్ - టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తూ టీచర్స్‌తో పేరెంట్స్ సైతం ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్న స్కూళ్లను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తమ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన ఏర్పడుతుంది.
స్పెషల్ కేర్ సదుపాయాలు
కొందరు చిన్నారులకు సహజంగానే కొన్ని లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి చిన్నారుల విషయంలో సదరు స్కూల్‌లో ఉన్న సదుపాయాలు, స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వంటి వాటి గురించి తెలుసుకోవాలి.
స్వీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ
తల్లిదండ్రులు తమ స్వీయ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్ అనుసరించే పాఠశాలల్లో మల్టీ కల్చర్ ఎన్విరాన్‌మెంట్ ఉంటుంది. దానికి తమ పిల్లలు సరితూగగలరా లేదా అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
- ఎ.సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్
దీర్ఘకాలిక ప్రణాళిక
కిండర్ గార్టెన్ స్థాయి నుంచి టెన్త్, 10+2 వరకు ఒకే పాఠశాలలో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. లేదంటే కనీసం తదుపరి అయిదారేళ్లు ఆ స్కూల్‌లో ఉండే విధంగా స్కూల్ ఎంపిక చేసుకోవాలి.
- సీతా కిరణ్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్