Best School
-
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
AP: 7 ప్రభుత్వ స్కూళ్లకు బెస్ట్ స్కూల్ అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఆగస్టు 15వ తేదీన బెస్ట్ స్కూళ్లుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కూళ్లకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మెమొంటోలను అందజేయనున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు జెడ్పీ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా కింతలి జెడ్పీ హైస్కూలు, విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్సియల్ హైస్కూలు, విజయనగరం జిల్లా భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ స్కూలు, విజయనగరం జిల్లా పెరుమాలి ఏపీ మోడల్ స్కూలు, ప్రకాశం జిల్లా రాయవరం బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూలు, కర్నూలు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలామ్ మెమోరియల్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా వంగర కేజీబీ విద్యాలయం బెస్ట్ స్కూళ్లుగా ఎంపికయ్యాయి. చదవండి: (మీటర్లతో మిగులుతున్న విద్యుత్) -
ఆదర్శ పాఠశాలలకు అదనపు సీట్లు
శ్రీకాకుళం: వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేసేందుకు 2012–13 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి, తరగతులు నిర్వహిస్తున్నారు. 6,7 తరగతులతోనే మొదలైన ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ వరకు విద్య అందిస్తున్నారు. ఏపీ మోడల్ స్కూళ్లు వచ్చి న రెండు, మూడేళ్ల వరకు కూడా సరైన ప్రచారం లేకపోవడంతో ఎలా చేర్పించాలో తెలిసేది కాదు. వరుసగా అధిక ఫలితాలు సాధిస్తుండడంతో ఎలా గైనా చేర్పించాలనే ఆసక్తితో రాజకీ య నాయకులను సైతం కలుస్తున్నారు. గత ఏడాది నుంచి 6వ తరగతిలో చేరేందుకు భారీగా దరఖాస్తులు రావడం, ఈ ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు రావడంతో విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న సీట్లకు 25 శాతం అదనంగా పెంచారు. దీనికి సంబంధించి రెండు రోజుల కిందట జిల్లాకు ఉత్తర్వులు చేరాయి. దీంతో ఇప్పటివరకు ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉండగా అవికాస్తా 100కు చేరాయి. జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకు పదో తరగతి వరకు మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ వరకు మోడల్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ తరహాలో మోడల్ స్కూళ్లను నిర్వహించాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. ఏ కారణంగానో గత ఏడాది వరకు వసతి గృహాలు ప్రారంభం కాలేదు. గత ఏడాది ఆరు మోడల్ స్కూళ్లలో బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. ఈ ఏడాది మిగిలి ఉన్న 8 వసతి గృహాల్లో బాలికల వసతి గృహాలను ప్రారంభిస్తున్నారు. ప్రతి వసతి గృహంలోను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వంద మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. బాలురకు మాత్రం వసతి సౌకర్యం కల్పించలేదు. అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడం వల్ల మోడల్ స్కూళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 25 శాతం సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడో కొత్త మెలికను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. సీట్లు పెంచినా బడ్జెట్‌ను గానీ, ఫర్నిచర్, బోధన సిబ్బంది సంఖ్యను పెంచేది లేదని పేర్కొన్నారు. అర్హత మార్కులు తగ్గించే ఆలోచన.. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం, ప్రశ్నపత్రం కాస్త కఠినంగా రావడంతోనే ఎక్కువ మంది అర్హత సాధించలేదు. దీంతో అర్హత మార్కులను తగ్గించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు 7, 8 తరగతుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి సైతం అడ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రవేశ పరీక్ష నిర్వహించాలా, వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించాలా అనేది ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లకే అప్పగించారు. ప్రచారం కరువు జిల్లాలో మోడల్ స్కూళ్లకు విశేష ఆదరణ ఉన్నా సీట్లు పెంచిన విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఈ విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. మోడల్ స్కూళ్లకు ఇన్చార్జిగా ఉన్న అధికారి స్థానికంగా కాకుండా నిత్యం దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అధికారి డీఈఓ కార్యాలయ ఏడీగా కూడా పనిచేస్తుండడంతో మోడల్ స్కూళ్లను అదనపు భారంగానే భావిస్తున్నట్లుగా అవగతమవుతోంది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలపై ఇప్పటివరకు స్పష్టతను ఇచ్చే ప్రకటన చేయలేదు. డీఈఓ కూడా దీనిపై దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయింది. ఉప విద్యాశాఖాధికారులను తొలగించడంతో అన్ని వ్యవహారాలు డీఈఓ చూసుకోవాల్సి వస్తోంది. ఉన్న ముగ్గురు ఏడీల్లో ఇద్దరు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం, మూడో ఏడీకి పాలనాపరమైన అనుభవం కాస్త తక్కువగా ఉండడంతో వారి సహకారం కూడా డీఈఓకు లేకుండా పోయింది. ఆదేశాలు అందాయి ఏపీ ఆదర్శ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే మంచి స్పందన వస్తోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో స్కూల్‌కు 25 శాతం అదనంగా సీట్లు కేటాయించేందుకు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్మీడియెట్ వరకు అదనపు సీట్ల పెంపు వర్తిస్తుంది. మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంపుపై ప్రచారం చేశాం. సోమవారం నుంచి మరింత ప్రచారం చేసి పెరిగిన సీట్లన్నీ భర్తీ అయ్యేలా చూస్తాం.– ఎం. సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి -
వినుడు..వినుడు విజయగాథ
ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత వనరులతో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగేవారు చరితార్థులే. వారు అందరికీ ఆదర్శప్రాయులే అవుతారు. ప్రస్తుతం అందరూ కార్పొరేటు విద్యా సంస్థలపై మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం .. ఈ పాఠశాలల మూసివేతకు ప్రయత్నిస్తోంది. కాజు లూరు శివారు గ్రామంలో.. సమస్యల్లో కూరుకుపోయిన మండల పరిషత్ పాఠశాల.. ఇప్పుడు జిల్లాలోనే ఉత్తమంగా నిలిచింది. గ్రామంలోని విద్యార్థులందరూ ఆ పాఠశాల బాట పట్టారు. ఈ పాఠశాల హెచ్ఎం.. అందరినీ కూడకట్టుకుని, దాతల సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ప్రచారంలో ప్రైవేటు విద్యా సంస్థల కంటే మిన్నగా ఈ పాఠశాల దూసుకుపోతోంది. ఈ పాఠశాల అభివృద్ధి కథా కమామిషు ఇలా ఉంది. కాజులూరు (రామచంద్రపురం): ప్రభుత్వ పాఠశాలలు ఉనికిని కోల్పోతున్నాయి. వీటిని అభివృద్ధి చేస్తామంటూ పాలకుల ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని సాకుగా తీసుకునే ప్రభుత్వం వాటి మూసివేతకు ప్రయత్నిస్తోంది. దీంతో ఉపాధ్యాయులే నడుం బిగించి ఈ పాఠశాలలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో గ్రామాల్లో సైతం విద్యార్థులను కాన్వెంట్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాజులూరు శివారు శ్రీరామ్‌నగర్‌లో మండల పరిషత్ పాఠశాల హెచ్ఎం ఎస్ఎస్వీ చలపతి పలువురి దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధిపథంలోకి నడిపించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈయన శ్రమ ఫలించడంతో ఈ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా పేరుగడించింది. ఇప్పుడు ఈ పాఠశాల వల్ల ఆ గ్రామం ప్రఖ్యాతి గాంచింది. వినూత్న కార్యక్రమాలు ఈ పాఠశాలలో వినూత్న రీతిలో పలు కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ఆకర్షించే హెచ్ఎం ప్రయత్నాలు ఫలించాయి. క్యాలెండర్ వారీగా వచ్చే జాతీయ పండుగలతోపాటు విద్యార్థులను ఉత్తేజపరిచేలా కార్యక్రమాలు, చిన్నారుల ఆటపాటల కోసం ఊయల, జారుడు బల్ల ఏర్పాటు, తాబేళ్ల పెంపకానికి వీలుగా పాఠశాల ఎదుట కొలను నిర్మాణం, తరగతి గదులలో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. పలువురు దాతల సహకారాలతో పాఠశాలలో కంపూటర్లు సమకూర్చి ప్రొజెక్టర్‌తో విద్యార్థులకు ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇస్తున్నారు. పాఠశాలలో మినరల్ వాటర్ ఏర్పాటుతోపాటు బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్డి నిర్మించారు. విరాళాలతో పాఠశాల అభివృద్ధి గ్రామస్తుల సహకారంతో రూ.8 లక్షల విరాళం సేకరించి పాఠశాలను అభివృద్ధి చేయడం ద్వారా శ్రీరామ్‌నగర్ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా నిలిచింది. పాఠశాల భవనానికి ప్రహరీ కట్టించి దానిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేయించటంతోపాటు పాఠశాల ఆవరణ మొక్కలు నాటి పచ్చని వాతావరణాన్ని కల్పించారు. దాతల సహకారంతో విలువైన వస్తువులు సమకూర్చటంతోపాటు హెచ్ఎం తన పేరిట ‘చలపతి శిష్టాస్ చారిటీస్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి పాఠశాలకు చిన్న అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు శ్రీరామ్‌నగర్ పాఠశాలకు వచ్చి స్థానికులను, ఉపాధ్యాయులను అభినందించిన సందర్భాలు అనేక ఉన్నాయి. పెరిగిన విద్యార్థుల సంఖ్య 2013లో చలపతి మాస్టారు పాఠశాలకు వచ్చేనాటికి 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండేవారు. పాఠశాలను దశల వారీగా హెచ్ఎం అభివృద్ధి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 70కి పెరిగింది. ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను వివరిస్తూ ఇటీవల ‘ఆ గట్టునుంటావా విద్యార్థి.. ఈ గట్టుకొస్తావా’ అంటూ పాఠశాల విద్యార్థులతో చలపతి మాస్టారు చేపట్టిన వినూత్న ప్రదర్శన గ్రామస్తులను ఆకట్టుకుంటుంది. అందరి సహకారంతోనే.. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదివితే అయ్యే ఖర్చు, ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ఉపయోగాలను వివరిస్తూ ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభగల ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. సహచర ఉపాధ్యాయులు, స్థానిక యువజన సంఘాలు, పలువురి దాతల సహకారాలతోనే పాఠశాలను అభివృద్ధి చేయగలిగా. మెరుగైన విద్య అందిస్తుండటంతో గ్రామస్తుల పిల్లలను ప్రైవేటు పాఠశాలలో మాన్పించి మా పాఠశాలలో చేర్పిస్తున్నారు.– హెచ్ఎం ఎస్ఎస్వీ చలపతి -
బెస్ట్ స్కూల్ ఎంపికలో!
కిండర్ గార్టెన్ చదువుల నుంచే కాసులు కుమ్మరించాల్సిన పరిస్థితులు.. ఎల్కేజీ చదువుల నుంచే లక్షల్లో ఖర్చవుతున్న రోజులు.. పాఠశాల దశ పూర్తి చేసుకునే క్రమంలో అడుగడుగునా కాసుల వర్షం కురిపించాల్సిందే..! * ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్ ఇలా ఎన్నో వ్యవస్థలు.. * కరిక్యులం, బోధన పద్ధతుల్లోనూ ఎంతో వైవిధ్యం.. అందుకే తమ పిల్లలకు ఏది మంచిదో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం!! లక్షలు వెచ్చించినా.. సరైన చదువు అందుతుందా.. బిడ్డల భవిష్యత్‌కు భరోసా లభిస్తుందా..! అనే ప్రశ్న!! అందుకే కిండర్ గార్టెన్ నుంచే స్కూల్ ఎంపికలో ఎంతో కసరత్తు చేయాలి. ఎన్నో అంశాలను పరిశీలించి మంచి స్కూల్‌ను ఎంపిక చేసుకోవాలి. బెస్ట్ స్కూల్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలపై తల్లిదండ్రుల కోసం సాక్షి అందిస్తున్న కథనం... పిల్లల మానసిక పరిస్థితి పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో ముందుగా తల్లిదండ్రులు హోం వర్క్ చేయాలి. తమ పిల్లల మానసిక పరిస్థితి, పరిపక్వత స్థాయిలను అంచనా వేయాలి. కొంతమంది పిల్లలు ఒక విషయాన్ని ఇట్టే గ్రహించగలరు. అదే విధంగా కొంతమంది పిల్లలు ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు గమనించాలి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత అనుకూలించినా.. పిల్లల మానసిక పరిపక్వతకు ప్రాధాన్యమివ్వడం ఎంతో అవసరం. కరిక్యులంపై దృష్టి ప్రస్తుతం మన దేశంలో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఐజీసీఎస్ఈ, ఇంటర్నేషనల్ బాక్యులరేట్, స్టేట్ బోర్డ్ విధానాలు అమలవుతున్నాయి. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈల్లో సిలబస్, కరిక్యులం పరంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. స్టేట్ బోర్డ్‌ల సిలబస్‌లోనూ ఇటీవల కాలంలో ఈ తరహా విధానానికి రూపకల్పన చేసినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో అమలవడం లేదు. తమ పిల్లలకు ఏ కరిక్యులం బాగుంటుందో గుర్తించి.. ఆ మేరకు బోర్డ్ ఎంపిక చేసుకోవాలి. స్టూడెంట్ - టీచర్ నిష్పత్తి పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో అత్యంత ప్రాధాన్యత గల అంశం.. సదరు పాఠశాలలో స్టూడెంట్-టీచర్ నిష్పత్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం- ప్రతి క్లాస్ రూంలో 30మంది విద్యార్థులకు మించకూడదు. అప్పుడే ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టే అవకాశం టీచర్లకు లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు సైతం టీచర్ బోధించే అంశాన్ని ఏకాగ్రతతో వినడానికి ఆస్కారం లభిస్తుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పాఠశాల ఎంపికలో పరిగణించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు సదరు స్కూల్ ఇస్తున్న ప్రాధాన్యం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఏదైనా ఒక అంశాన్ని బోర్డ్‌పై చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా మరింత నైపుణ్యం అందించడం. ఉదాహరణకు కిండర్ గార్టెన్ స్థాయిలో బర్డ్స్, ట్రీస్ వంటి వాటి గురించి చెప్పేటప్పుడు వాటికి సంబంధించిన డ్రాయింగ్స్‌ను వేయించడం, పై తరగతుల్లో చిన్నపాటి ప్రయోగాలు చేయించడాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌గా పేర్కొనొచ్చు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థి జీవితంలో చదువుతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్ తదితర)కు ప్రాధాన్యం ఉంటుంది. కారణం.. వీటివల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసం లభిస్తుంది. అందుకే సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్‌లు ఈ మేరకు నిర్దిష్ట నిబంధనలు సైతం అమలు చేస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్, ఇతర సదుపాయాలు ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. ‘ఫీడ్ బ్యాక్’.. ఫ్రం స్కూల్స్ పాఠశాల ఎంపిక క్రమంలో తల్లిదండ్రులు పరిగణించాల్సిన మరో ప్రధాన అంశం.. ఫీడ్ బ్యాక్ ఫ్రం స్కూల్స్. అంటే.. తమ పిల్లలు తరగతి గదిలో వ్యవహరిస్తున్న శైలి గురించి పాఠశాలల యాజమాన్యాలు లేదా టీచర్లు తమకు సమాచారం అందిస్తారా? లేదా? అని తెలుసుకోవాలి. కొన్ని స్కూల్స్ కేవలం పరీక్షలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డ్‌లు ఇవ్వడానికే పరిమితం అవుతున్నాయి. పేరెంట్ - టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తూ టీచర్స్‌తో పేరెంట్స్ సైతం ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్న స్కూళ్లను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తమ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన ఏర్పడుతుంది. స్పెషల్ కేర్ సదుపాయాలు కొందరు చిన్నారులకు సహజంగానే కొన్ని లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి చిన్నారుల విషయంలో సదరు స్కూల్లో ఉన్న సదుపాయాలు, స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. స్వీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తల్లిదండ్రులు తమ స్వీయ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అనుసరించే పాఠశాలల్లో మల్టీ కల్చర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దానికి తమ పిల్లలు సరితూగగలరా లేదా అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. - ఎ.సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక కిండర్ గార్టెన్ స్థాయి నుంచి టెన్త్, 10+2 వరకు ఒకే పాఠశాలలో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. లేదంటే కనీసం తదుపరి అయిదారేళ్లు ఆ స్కూల్లో ఉండే విధంగా స్కూల్ ఎంపిక చేసుకోవాలి. - సీతా కిరణ్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్ -
ఫీజు సరే.. సరైన స్కూల్లోనే చేర్పిస్తున్నారా..!
కేజీ టు పీజీ.. హౌ టు సెలక్ట్ బెస్ట్ స్కూల్? ఇప్పుడు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది తల్లిదండ్రులు, విద్యార్థులకు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతున్న అంశం. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ బోర్డు మొదలు స్టేట్ బోర్డుల వరకు అనుబంధంగా లక్షల సంఖ్యలో స్కూళ్లు. వాటి పేర్లకు టెక్నో, గ్లోబల్, ఒలింపియాడ్ వంటి సఫిక్స్‌లు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. నగరాలు దాటి ఇప్పుడు ప్రయివేటు స్కూళ్లు చిన్నచిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రయివేటు స్కూళ్ల మోజులో , తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే ఆతృతతో.. అప్పులు చేసైనా వేలల్లో ఫీజులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు.. ఆయా పాఠశాలల ప్రమాణాలపై దృష్టిపెట్టడంలేదు. ఈ నేపథ్యంలో.. ఏది మంచి స్కూలో, పిల్లలను ఎలాంటి స్కూల్లో చేర్పిస్తే.. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందో తెలుపుతూ సాక్షి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. ప్రస్తుతం మంచి స్కూల్ ఎంపిక విషయంలో తల్లిదండ్రుల కసరత్తు కేజీ (కిండర్ గార్టెన్) స్థాయి నుంచే మొదలవుతోంది. మెట్రోసిటీలు, ఇతర నగరాల్లో అప్పటికే పేరు గడించిన పాఠశాలల్లో ప్రవేశాల కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో కిండర్‌గార్టెన్‌లో అడ్మిషన్ కోసం 1,473 దరఖాస్తులు వచ్చాయి. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పటికే ప్రమాణాలు, నాణ్యమైన విద్య పరంగా పేరున్న పాఠశాలలను మినహాయిస్తే.. వేల సంఖ్యలో ఉన్న ఇతర పాఠశాలల విషయంలోనే తల్లిదండ్రుల ఆందోళన. ఈ క్రమంలో వారు పాఠశాలను ఎంపిక చేసుకునేముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా సుదీర్ఘ కాలం చదవాల్సిన పాఠశాల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలనేది నిపుణుల సూచన. గుర్తింపు.. అత్యంత ప్రధానం స్కూళ్ల ఎంపికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఆ సంస్థకు ఉన్న గుర్తింపు. సీబీఎస్ఈ/స్టేట్ బోర్డ్.. ఆయా స్కూల్ బోర్డ్‌ల ప్రామాణిక గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. ఇందుకోసం నియంత్రణ సంస్థల వెబ్సైట్ల నుంచి సమాచారం పొందొచ్చు. బోర్డ గుర్తింపులేని స్కూల్లో చేరితే విద్యార్థి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రత్యక్ష పరిశీలన పాఠశాలల గుర్తింపు విషయంలో స్పష్టత వచ్చాక తర్వాత చేయాల్సిన పని ఎంపిక చేసుకున్న స్కూల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించడం. అక్కడి పరిసరాలను గమనించడం. అంతేకాకుండా పాఠశాలలను ఎంపిక చేసుకునే ముందు అప్పటికే ఆయా స్కూల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతోపాటు పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధుల ద్వారా సమాచారం సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. మెథడాలజీ ఏంటి? స్కూల్‌ను ఎంపిక చేసుకుని ఒక నిర్దిష్ట అంచనాకు వచ్చాక.. ఆ పాఠశాలలో అనుసరిస్తున్న టీచింగ్ మెథడాలజీ గురించి అన్వేషించాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉన్న స్కూల్ అయితే మంచిది. వాస్తవానికి 2011 నుంచి సీబీఎస్ఈ స్కూళ్లలో, 2014 నుంచి స్టేట్ బోర్డ్‌ల అనుబంధ స్కూళ్లలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిచ్చేలా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనే విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే దీన్ని అమలు చేయడంలో 70 శాతంపైగా పాఠశాలలు వెనుకంజలో ఉన్నాయి. కాబట్టి సీసీఈ కోణంలో అనుసరిస్తున్న విధానాలు తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఉపాధ్యాయుల అర్హతలు చాలా ప్రయివేటు స్కూళ్లలో అర్హులైన ఉపాధ్యాయులు ఉండటం లేదు. దాంతో విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. కాబట్టి తమ పిల్లలను ఒక పాఠశాలలో చేర్చే ముందు తల్లిదండ్రులు ప్రధానంగా చూడాల్సిన అంశం.. ఆ పాఠశాల ఉపాధ్యాయుల అర్హతలు. కిండర్ గార్టెన్ నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవాలి. స్కూల్స్‌లో డీఈడీ, బీఈడీ వంటి అర్హతలు ఉన్న వారినే టీచర్లుగా నియమించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ వాస్తవానికి అధిక శాతం పాఠశాలలు వీటిని విస్మరిస్తున్నాయి. ప్రధానంగా ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే ఉపాధ్యాయుల తోడ్పాటు పిల్లలకు ఎంతో అవసరం. భవిష్యత్తు నిర్మాణానికి ఈ రెండు స్థాయిలు పునాదులు. వీటిలో సరైన గెడైన్స్ లేకపోతే తర్వాతి దశలో చదువు పరంగా, అభ్యసన నెపుణ్యాల పరంగా విద్యార్థిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. టీచర్లు అప్డేట్ అవుతున్నారా.. డీఈడీ, బీఈడీ, ఇతర టీచర్ ట్రైనింగ్ కోర్సుల అర్హతతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన దేశంలో సీబీఎస్ఈ క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల కోసం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఇలాంటి వర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు స్కూల్ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇస్తున్న అవకాశం గురించి తెలుసుకోవాలి. బోధన పరంగా ఎలా తరగతి గదిలో విభిన్న నేపథ్యాల విద్యార్థులు ఉంటారు. ఇందులో కొందరు టీచర్ చెప్పిన వెంటనే నేర్చుకోగలుగుతారు. మరికొందరు ఒకటికి రెండుసార్లు చెబితే కానీ అర్థం చేసుకోరు. ఈ నేపథ్యంలో బోధన విషయంలో అనుసరించే విధానం గురించి తెలుసుకోవాలి. ప్రత్యేకంగా స్లో లెర్నర్స్‌కు బోధించే విధానాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టాప్ పెర్ఫార్మర్స్ను ప్రత్యేకంగా ఒక గ్రూప్‌గా ఏర్పరచి బోధించడం, గ్రేడ్లు, స్కూల్ పబ్లిసిటీ వంటి కోణాల్లో వారిపైనే ఎక్కువ శ్రద్ధ చూపించడం సాధారణ అంశంగా మారింది. కానీ ఇలాంటి ధోరణి ఇతర విద్యార్థుల్లో ఆత్మన్యూనతకు దారితీస్తుంది. బోధనపరంగా తరగతిలోనే కాకుండా.. తరగతి గది వెలుపల బోధన పరంగా తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించాలి. అంటే.. తరగతిలో బోధించిన ఒక అంశాన్ని ప్రాక్టికల్‌గా వాస్తవ ప్రపంచంతో అన్వయించే నైపుణ్యాలు అందించే విధంగా అవుటాఫ్ ది క్లాస్ రూం మెథడాలజీ గురించి తెలుసుకోవాలి. మీడియం మార్పు ప్రస్తుతం ఇంగ్లిష్ మాధ్యమానికున్న క్రేజ్ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మాతృభాష నుంచి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చేర్పించడం సర్వసాధారణమైంది. దీంతో అప్పటికే ఇంగ్లిష్ మీడియంలో నిలదొక్కుకున్న ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి మీడియం మారిన విద్యార్థుల విషయంలో పాఠశాల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి తెలుసుకోవాలి. సిలబస్‌పై పరిశీలన పాఠశాల బోర్డ్ సిలబస్‌కు అనుగుణంగానే సాగుతోందా.. లేదా సొంత విధానాలేమైనా అమలు చేస్తోందా? అలాంటి వాటి సమర్థ అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా సిలబస్, పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు అదనపు సమాచారాన్ని అందించేందుకు ఉన్న సౌకర్యాలు(లైబ్రరీ, ఇంటర్నెట్, ఐసీటీ) గురించి తెలుసుకోవాలి. ఇది హైస్కూల్ స్థాయిలో పాఠశాలల విషయంలో ఎంతో ఆవశ్యకం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలకు పరిణితి లభించే విషయంలో పాఠశాల స్థాయిలో అకడమిక్ నైపుణ్యాలతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, టాలెంట్ ఎగ్జిబిషన్స్ వంటివి) కూడా కీలక పాత్ర పోసిస్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సదుపాయాల గురించి పరిశీలించాలి. ఫీజులు విషయంలోనూ పాఠశాలల ఎంపిక విషయంలో అన్ని అంశాల్లో స్పష్టత లభించాక.. ఫీజుల విషయంలోనూ దృష్టిసారించాలి. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కిండర్ గార్టెన్కే రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులుంటున్నాయి. హైస్కూల్ స్థాయిలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థ నిర్దేశించిన ఫీజులకు తగ్గ స్థాయిలో బోధన, మౌలికపరమైన సదుపాయాలు ఉన్నాయా? లేదా? గమనించాలి. పాఠశాల పనితీరు పాఠశాల అకడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఆరా తీయాలి. నిబంధనల ప్రకారం- ఒక పాఠశాల గత మూడేళ్ల అకడమిక్ ఉత్తీర్ణతల సగటు ఆయా బోర్డ్‌ల ఉత్తీర్ణతల సగటుతో పోల్చితే ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ పాఠశాల అకడమిక్ పరంగా నైపుణ్యాలు పాటిస్తుందని అర్థం. అదేవిధంగా సదరు పాఠశాలలో పని చేస్తున్న టీచర్ల నియామక విషయాలు తెలుసుకోవాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం- ప్రైవేటు పాఠశాలలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా శాశ్వత ప్రాతిపదికగా ఉపాధ్యాయులను నియమించుకోవాలి. హయ్యర్ సెకండరీ (+2/ఇంటర్మీడియెట్) మన విద్యా విధానంలో హయ్యర్ సెకండరీగా పిలిచే +2 లేదా ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల కళాశాలల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు సంబంధించి లేబొరేటరీలు, బోధనప్పుడు వాటిలో గడిపే సమయాలను పరిశీలించాలి. అదేవిధంగా సీబీఎస్ఈలో ప్రస్తుతం ఎలక్టివ్స్ అనే విధానం అమలవుతోంది. ఒక సీబీఎస్ఈ పాఠశాలలో కనిష్టంగా ఐదుగురు విద్యార్థులు ఒక ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటే.. ఆ ఎలక్టివ్ కోర్సును నిర్వహించేందుకు పాఠశాలకు అనుమతి లభిస్తుంది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సదరు ఎలక్టివ్స్‌లో ఎంతమంది ఉన్నారు? అందుకు తగిన బోధన సదుపాయాలు ఉన్నాయా? లేదా పరిశీలించి సంతృప్తి చెందితేనే ప్రవేశం తీసుకోవాలి. యూజీ, పీజీ కోర్సుల కళాశాలల ఎంపిక విషయంలోనూ ప్రమాణాలకే పెద్దపీట వేయాలి. నిపుణుల మాట టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి తల్లిదండ్రులు కేవలం పాఠశాలలను ఎంపిక చేసుకోవడానికే పరిమితం కాకుండా.. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. సీబీఎస్ఈ ఉపాధ్యాయుల అకడమిక్ డెవలప్మెంట్ కోసం పలు రిఫ్రెష్మెంట్ వర్క్‌షాప్స్, సెమినార్స్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నైపుణ్యాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి వాటికి హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలలో బోధన అంత బాగుంటుంది. - డి.టి.ఎస్.రావు, రీజినల్ ఆఫీసర్, సీబీఎస్ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పాఠశాలను ఎంపిక చేసుకునే విషయంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలి. అప్పుడే పిల్లలు చిన్నప్పటి నుంచే వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. - కె.శరత్ చంద్ర, బటర్ ఫ్లై ఫీల్డ్స్ కో ఫౌండర్ సదుపాయాల మేరకు ఫీజులు ప్రైవేటు పాఠశాలల్లో కేజీ స్థాయిలోనే వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఆ మేరకు అవి సదుపాయాలు కల్పిస్తున్నాయా? లేదా? అనేది తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పరిశీలించాలి. ఉన్నత ప్రమాణాలు, సౌకర్యాలు కల్పిస్తున్న పాఠశాలల ఫీజులతో పోల్చుకుంటూ ఇతర పాఠశాలలు కూడా అదే మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ సదుపాయాలు కల్పించడం లేదు. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. - ఎం.పద్మజ, వైస్ ప్రిన్సిపాల్, చిరెక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మానసిక దృక్పథం ఆధారంగా పాఠశాలల ఎంపిక విషయంలో తల్లిదండ్రులు నిబంధనలు, ప్రమాణాలు, ఉపాధ్యాయుల అర్హతలు వంటి వాటన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది తమ పిల్లల మానసిక దృక్పథం. వారి అభ్యసన స్థాయి, గ్రాహక శక్తులను గుర్తించి ఆ మేరకు పాఠశాలలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇతరులతో సమానంగా రాణించలేక మానసిక ఆందోళన చెందుతారు. - ఎ. సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ తల్లిదండ్రులు ప్రశ్నించొచ్చు పాఠశాలలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను సదరు పాఠశాలలు అమలు చేస్తున్నాయా? లేదా? అని తల్లిదండ్రులు నిరంభ్యంతరంగా ప్రశ్నించొచ్చు. టాయిలెట్స్ నుంచి లేబొరేటరీల వరకు సదరు పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవచ్చు. ఆర్టీఈ ఈ అవకాశం కల్పిస్తోంది. పాఠశాలల యాజమాన్యాలు కూడా వారు అనుసరిస్తున్న బోధన పద్ధతులు, ఏ చాప్టర్‌ను ఎంత సమయంలో పూర్తిచేస్తారు వంటి వివరాల నుంచి ఉపాధ్యాయుల విద్యార్హతలు, వారికి అందిస్తున్న వేతనాలు, వారికోసం నిర్వహించే శిక్షణ తరగతుల వివరాలను నోటీస్‌బోర్డ్‌లో పెట్టాలి. ఇది తప్పనిసరి నిబంధన. అలాంటి సమాచారం ఇవ్వకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. - జి.గోపాల్‌రెడ్డి, డెరైక్టర్, ఎస్సీఈఆర్టీ