కోర్‌ బ్రాంచ్‌లు..మినిమమ్‌ గ్యారెంటీ! | Engineering Special | Sakshi
Sakshi News home page

కోర్‌ బ్రాంచ్‌లు..మినిమమ్‌ గ్యారెంటీ!

Published Tue, May 2 2017 3:52 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

కోర్‌ బ్రాంచ్‌లు..మినిమమ్‌ గ్యారెంటీ!

కోర్‌ బ్రాంచ్‌లు..మినిమమ్‌ గ్యారెంటీ!

ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాల సమయం.. ఎంట్రన్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. ఇదే సమయంలో నాలుగు దశాబ్దాలపాటు కొనసాగాల్సిన కెరీర్‌ పరంగా.. ఏ బ్రాంచ్‌ తీసుకుంటే బాగుంటుంది? అనే సందేహం. ఎన్నో వినూత్న బ్రాంచ్‌లు, అప్‌కమింగ్‌ బ్రాంచ్‌లు తెరపైకి వస్తున్నా.. నేటికీ కోర్‌ బ్రాంచ్‌లకు వన్నెతగ్గడంలేదు. భవిష్యత్‌లోనూ అవకాశాల పరంగా కోర్‌ బ్రాంచ్‌లు మినిమమ్‌ గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కోర్‌ బ్రాంచ్‌ల ప్రాముఖ్యత, వాటికి ఆధునిక కాలంలో సైతం ఆదరణ పెరుగుతుండటానికి కారణాలపై విశ్లేషణ..

ఎన్ని ఆధునిక బ్రాంచ్‌లు రూపొందుతున్నా.. కొత్త కోర్సులు ఆవిష్కృతమవుతున్నా.. అవన్నీ కోర్‌ బ్రాంచ్‌ల పునాదుల నుంచే పుట్టుకొస్తున్నాయి. అందుకే కోర్‌ బ్రాంచ్‌లు  భవిష్యత్‌లోనూ ఎవర్‌గ్రీన్‌గా నిలవనున్నాయి.

సివిల్‌ ఇంజనీరింగ్‌
కట్టడాలు, నిర్మాణాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించడం సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ముఖ్య స్వరూపం. ప్రస్తుతం సివిల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు డిమాండ్‌ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా పట్టణీకరణ, రియల్టీ, మౌలిక సదుపాయాల రంగాల విస్తరణ జరుగుతోంది. కాబట్టి సివిల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులకు భవిష్యత్‌ అవకాశాల పరంగా ఆందోళన అనవసరం అనేది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ పరమైన అంశాలు నేర్పించే సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులకు తమ నైపుణ్యాల ద్వారా ఉజ్వల కెరీర్‌ను సొంతమవడం ఖాయం.

 ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగంలోనూ సివిల్‌ ఇంజనీర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలు సైతం నిర్మాణ రంగంలో అడుగుపెట్టాయి. మెట్రో నగరాల్లో గృహ సముదాయాలు నిర్మిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా వచ్చే నాలుగైదేళ్లలో సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ బ్రాంచ్‌ ద్వారా చక్కటి భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులు అకడమిక్‌గా ఫిజిక్స్, మ్యాథమెటికల్, డిజైన్‌ స్కిల్స్‌ సొంతం చేసుకుంటే తిరుగుండదు. అంతేకాకుండా ఆధునిక అవసరాలకు తగ్గట్లు కంప్యూటర్‌ స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. క్యాడ్, క్యామ్‌ వంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి.

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
ఇంట్లో  నిత్యం అవసరమయ్యే బల్బ్‌ల నుంచి సమాజానికి విస్తృతస్థాయిలో ఉపయోగడే ఎలక్ట్రికల్‌ ట్రైన్స్‌ వరకూ.. ప్రతిదీ ఎలక్ట్రికల్‌ ఆధారమే. ఎన్నో ఏళ్లుగా వెలుగులీనుతున్న బ్రాంచ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ఈఈఈ). అకడమిక్‌ కోణంలో ఎలక్ట్రికల్‌ రంగంలో రాణించాలనే అభ్యర్థులకు మైక్రో అనాలిసిస్‌ అప్రోచ్‌ చాలా అవసరం. మ్యాథ్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి అవసరం. ఈ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక ఉత్పత్తి మార్కెట్లో విడుదలైతేæ.. దాని పనితీరు, అందుకు అనుసరించిన విధానాల గురించి తెలుసుకునే ఆసక్తి ఉండాలి. అప్పుడే ఈ రంగంలో రాణించేందుకు వీలవుతుంది.

 అంతేకాకుండా ఈ బ్రాంచ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా భరోసా కల్పిస్తున్న అంశం.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలే. 2020 నాటికి లక్ష మెగావాట్ల సామర్థ్యం  గల విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదే విధంగా ఉజ్వల్, గ్రామజ్యోతి యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలను సైతం రానున్న అయిదేళ్లలో విద్యుత్‌ కాంతులతో నింపాలనే యోచనలో               అడుగులుపడుతున్నాయి.

 ఫలితంగా రానున్న అయిదేళ్ల కాలంలో దేశంలో దాదాపు 1.5 లక్షల మంది ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ల అవసరం ఉంటుందని అంచనా. ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి పరంగా 2020 నాటికి 40 నుంచి 50 శాతం మేర స్వదేశీ ఉత్పత్తుల సంఖ్య పెంచాలనే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. మరోవైపు ఈ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడం కూడా భవిష్యత్తు అవకాశాలను మెరుగుపరిచేందుకు దోహదం   చేయనుంది.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌
ఆటో రిక్షా నుంచి బోయింగ్‌ విమానాల ఉత్పత్తి వరకు ప్రతి విభాగంలోనూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడుతోంది. మెకానికల్‌ బ్రాంచ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఫిజిక్స్‌పై ఆసక్తి ఉండటం కలిసొస్తుంది. అలాగే  ఈ బ్రాంచ్‌లో రాణించి, భవిష్యత్తు అవకాశాలు సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులకు బేసిక్‌ నైపుణ్యాలైన డిజైన్, డ్రాయింగ్‌ వంటి వాటిపై పరిపూర్ణత అవసరం. వీటికితోడు  క్యాడ్, క్యామ్, 3–డి డిజైన్‌ టెక్నాలజీస్, రోబోటిక్స్, ఆటోమేషన్‌ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఆధారిత నైపుణ్యాలు తప్పనిసరి. ఇలా కోర్‌ + లేటెస్ట్‌ స్కిల్స్‌ పొందిన అభ్యర్థులకు  సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకునే సరికి అవకాశాల పరంగా ఢోకా ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి పథకాల నేపథ్యంలో 2020 నాటికి దాదాపు లక్ష మంది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుల అవసరం ఏర్పడనుందని పలు వర్గాల అంచనా.

ఈసీఈ
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ రంగంలో జెట్‌ స్పీడ్‌లో కార్యకాలాపాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్, స్మార్ట్‌ టెక్నాలజీస్, ఐటీసీ అమలు, వినియోగదారుల సంఖ్య పరంగా మిలియన్ల మంది పలు ఎలక్ట్రానిక్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సాధనాలను వినియోగిస్తున్నారు. ఈ సేవలు విస్తరించేందుకు, అదే సమయంలో ఈ సేవలకు అవసరమైన ఉత్పత్తుల రూపకల్పనను పెంచేందుకు సంస్థలు పలు విస్తరణ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ స్థాయిలోనూ డిజిటల్‌ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్‌ లిటరసీ మిషన్‌ వంటి పలు పథకాలకు నాంది పడింది.  ఫలితంగా రానున్న రోజుల్లో వేల మందికి అవకాశం కల్పించే రంగంగా మారనుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్లతో బయటికొచ్చే నాటికి ప్రైవేటు, ప్రభుత్వ రంగ కొలువులు స్వాగతం పలకడం గ్యారెంటీ అనేది నిపుణుల అభిప్రాయం. ఈసీఈ
   బ్రాంచ్‌ ఔత్సాహికులకు మ్యాథ్స్‌పై ఆసక్తి ఉండాలి.

సీఎస్‌ఈ
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ను ఒక రకంగా కోర్‌ బ్రాంచ్‌గా మరో రకంగా ఇంటర్‌ డిసిప్లినరీ విభాగంగానూ పేర్కొంటారు.  మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్‌ స్కిల్స్‌ తప్పనిసరి. ఈ రంగంలో అవకాశాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే సమయంలో సవాళ్లు అనేకం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ జరుగుతోంది... దాన్ని అందరికంటే ముందుగా అందిపుచ్చుకుంటేనే మనగలిగేది. ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్న ఆటోమేషన్, ఐఓటీ వంటి విధానాల నేపథ్యంలో ఈ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత ద్వారా సాఫ్ట్‌వేర్‌ కొలువులు సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. అకడమిక్స్‌తోపాటు ఆటోమేషన్‌ టూల్స్‌గా పిలుస్తున్న రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి అంశాల్లోనూ నైపుణ్యం పొందితేనే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement