హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ కెరీర్ ఔత్సాహికులకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ఎడ్‌టెక్ సంస్థ బైట్‌ఎక్స్‌ఎల్ .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం 90 పైచిలుకు కాలేజీలతో టై–అప్‌లు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కరుణ్ తాడేపల్లి తెలిపారు.
అలాగే 163 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు ఉండగా.. వచ్చే 6–9 నెలల్లో 350 వరకు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆదాయాన్ని 4 రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్తగా నిర్మించిన కార్యాలయంలోకి కార్యకలాపాలు మార్చిన సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఇప్పటివరకూ ఏడు రాష్ట్రాల్లో 1,20,000 మంది విద్యార్థులకు క్లౌడ్, ఏఐ, ఎంఎల్ వంటి కొత్త టెక్నాలజీలపై తమ లెర్నింగ్ ప్లాట్‌ఫాం, ఎక్సలరేట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణనిచ్చినట్లు కరుణ్ వివరించారు.
కరోనా తర్వాత దాదాపు అందరూ కాలేజీలు, ఆఫీసుల బాటపట్టిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎడ్‌టెక్ కంపెనీలపై కొంత ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, కొత్త పరిస్థితులకు అనుగుణంగా వినూత్న సర్వీసులు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు కరుణ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment