Students Confusion In Campus Placements - Sakshi
Sakshi News home page

ఐటీ కోర్సుల విద్యార్థుల్ని కలవరపెడుతున్న క్యాంపస్‌ నియామకాలు.. ఆఫర్‌ లెటర్లు ఇచ్చాక కూడా!

Published Wed, May 10 2023 3:43 AM | Last Updated on Wed, May 10 2023 9:20 AM

Confusion in campus placements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కొత్తగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాల అంశం కలవరపెడుతోంది. క్యాంపస్‌ నియామకాల్లో ఎంపికై ఆఫర్‌ లెటర్లు వచ్చినా.. ఉద్యోగాల్లో చేరడానికి ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న సంస్థల నుంచి ఐటీ దిగ్గజాల దాకా ఇలాగే వ్యవహరిస్తుండటం.. ఆఫర్‌ లెటర్లు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడం తీవ్ర ఆందోళన రేపుతోంది.

పారిశ్రామిక వర్గాల లెక్కల ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో తెలంగాణలో బహుళజాతి సంస్థలు, అంకుర సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు కలిపి 24,500 మందిని క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇందులో ఇప్పటివరకు 2,300 మందికి మాత్రమే నియామక ఉత్తర్వులు వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలోని టాప్‌ టెన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జరిగిన నియామకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులు.. క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. గత ఏడాది ఆగస్టులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాలు చేపట్టాయని.. పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్‌ లెటర్లు కూడా ఇచ్చాయని, ఆ తర్వాత మరే స్పందనా లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. 

అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు నన్ను బీటెక్‌ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే ఓ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపిక చేసింది. రెండో సెమిస్టర్‌ కాగానే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వస్తుందని.. అప్పట్నుంచే శిక్షణ మొదలవుతుందని, వేతనం కూడా ఇస్తామని చెప్పారు. కానీ 10 నెలలు గడిచింది. ఇంతవరకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.  – ప్రవీణ్‌ వర్మ, హైదరాబాద్, క్యాంపస్‌ రిక్రూటీ 

చిన్న కంపెనీలు తీసుకుంటున్నా.. 
అంకుర సంస్థలు, చిన్న కంపెనీలు మాత్రం క్యాంపస్‌ నియామకాల్లో ఎంపిక చేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి ఆహా్వనిస్తున్నాయి. కానీ అవసరమైన మేర తక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటున్నాయి. కోవిడ్‌ తర్వాత ఆశించిన మేర ప్రాజెక్టులు రావడం లేదని.. అందుకే ఆఫర్‌ లెటర్‌ ఇచ్చినా ఉద్యోగాల్లోకి పిలవలేక పోతున్నామని కొన్ని కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపేయడమేగాక.. ఉన్న ఉద్యోగుల వేతనాలు తగ్గించుకుంటున్నాయని అంటున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్‌ ఎఫ్‌వైఐ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. 


మాంద్యం ప్రభావంతోనే! 
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంద గమనం కొనసాగుతోంది. దీనితో ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో వెనుకాడుతున్నాయి. అమెరికాలో అత్యధిక ద్రవోల్బణం, స్థిరాస్తి, బ్యాంకింగ్‌ సంక్షోభం నేపథ్యంలో.. అక్కడ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కనీసం రెండేళ్లు పడుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూరప్‌ దేశాలు, జపాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త నియామకాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. 

ఏం చేయాలో అర్థం కావట్లే. 
మాది వరంగల్‌. ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్‌ చేశాను. చివరి సెమిస్టర్‌లో ఉండగా.. మల్టీ నేషనల్‌ కంపెనీ ఉద్యోగానికి ఆఫర్‌ లెటర్‌ ఇచ్చింది. ఇప్పటికీ అపాయింట్‌మెంట్‌ రాలేదు. ఎన్ని మెయిల్స్‌ చేసినా స్పందన లేదు. బంధువులకు ముఖం చూపించలేక.. హైదరాబాద్‌లోనే ఉండి కోర్సులు నేర్చుకుంటున్నాను. 
– అఖిలేశ్‌ గౌడ్, క్యాంపస్‌ రిక్రూటీ, హైదరాబాద్‌ 

స్పెషల్‌ స్కిల్స్‌ ముఖ్యం 
ఇంకో ఏడాది పాటు ఇంజనీరింగ్‌ విద్యార్థులు క్యాంపస్‌ నియామకాలపై ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన వారికే నియామకాలు జరగలేదు. ఏఐ, ఎంబెడ్డెడ్‌ సిస్టమ్స్, మెషీన్‌ లెరి్నంగ్, డేటా అనలిటిక్స్‌ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న వారికి మాత్రం మార్కెట్‌ బాగానే ఉంటోంది. 
– మిత్రాసేథ్, ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement