రాష్ట్రంలో ‘నైపుణ్యం’ పెరగాలి | skill to develop our state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘నైపుణ్యం’ పెరగాలి

Published Tue, Oct 17 2017 1:54 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

skill to develop our state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నైపుణ్య కొలువుల శాతం తగ్గిపోతోంది. ఐటీ, మేనేజ్‌మెంట్, బీపీవో, కేపీవో వంటి రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగాల సాధన కత్తిమీద సాములానే మారుతోంది. రాష్ట్రంలో ఈ తరహా ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని యాస్పైరింగ్‌ మైండ్స్‌ సంస్థ సర్వేలో తేలింది. నైపుణ్యం గల ఉద్యోగాల కల్పన, డిమాండ్‌లో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కళాశాలల్లో నాసిరకం బోధన, ఆంగ్ల భాషపై పట్టులేకపోవడం, నైపుణ్య అంశాల్లో తగిన శిక్షణ లభించకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణమని యాస్పైరింగ్‌ మైండ్స్‌ సర్వే నివేదికలో వెల్లడించింది. 

మహారాష్ట్ర టాప్‌: యాస్పైరింగ్‌ మైండ్స్‌ సంస్థ నైపుణ్య ఉద్యోగాల అంశంపై ఇటీవల దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌–2017’పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో (ఓపెన్‌ జాబ్‌ ఆపర్చునిటీస్‌) దేశంలో మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచింది. ఆ రాష్ట్రంలో 19.72 శాతం నైపుణ్య కొలువుల అవకాశాలున్నట్లు నివేదికలో వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో నిలవగా.. తెలంగాణ కేవలం 3.47 శాతం నైపుణ్య కొలువులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 
 

‘సాఫ్ట్‌వేర్‌’లో బోలెడు అవకాశాలు 
నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో ఆయా రంగాల వారీగా పరిశీలిస్తే.. నైపుణ్యం గల సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ కొలువులకు పలు రాష్ట్రాల్లో భారీగా డిమాండ్‌ ఉన్నట్లు సర్వే తేల్చింది. తర్వాతి స్థానంలో అమ్మకాల పరిస్థితిని గమనించే (సేల్స్‌ సిచ్యువేషన్‌) రంగం నిలిచింది. కస్టమర్‌ సర్వీస (సేవా రంగం) మూడో స్థానంలో నిలవగా.. హార్డ్‌వేర్‌ రంగం నాలుగో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమైందని పేర్కొంది. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కల్పనలో టాప్‌ ఐదు రాష్ట్రాలు 
రాష్ట్రం         ర్యాంకు      సాఫ్ట్‌వేర్‌ కొలువుల శాతం 
కర్నాటక        1            17.47     
మహారాష్ట్ర       2             17.23 
తమిళనాడు    3            12.12 
ఢిల్లీ               4            11.11 
గుజరాత్‌        5             8.08 
(మొత్తం నైపుణ్య ఉద్యోగాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల శాతం) 

ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ 
ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో అధిక జనాభాకు అనుగుణంగా నైపుణ్య ఉద్యోగాల కల్పన జరగడం లేదని సర్వే తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్‌లలో మాత్రం ప్రతి లక్ష మందికి ఉద్యోగాల కల్పన విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులు మాత్రం అత్యధిక ఉద్యోగాల కల్పనతో అగ్రభాగాన నిలిచినట్లు తెలిపింది. 

రాష్ట్రంలో నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణాలివే.. 
– ఆంగ్లభాషపై పట్టు సాధించకపోవడం: ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, వివిధ రకాల డాక్యుమెంట్లు రాయడంలో అనుభవం లేకపోవడం 
– డిడక్టివ్‌ రీజనింగ్‌ లోపం: వివిధ రకాల డేటాను విశ్లేషించి సులభతరంగా మార్చే నైపుణ్యం కొరవడడం 
– ఇండక్టివ్‌ రీజనింగ్‌లో లోపం: వివిధ రకాల అప్లికేషన్స్‌ను విశదీకరించి క్రోడీకరించే సామర్థ్యం లేకపోవడం 
– ఇన్ఫర్మేషన్‌ గ్యాదరింగ్‌ అండ్‌ సింథసిస్‌ లోపం: సమాచార సేకరణ, దానిని విశ్లేషించే సామర్థ్య లోపం 

– క్వాంటిటేటివ్‌ ఏబిలిటీ: అర్థ గణాంకాల విశ్లేషణ, సమస్యా పరిష్కారం విషయంలో వెనుకబడడం 
– మౌఖిక పరీక్షలు, బృంద చర్చల్లో విఫలం కావడం 
– కళాశాలల్లో విద్యార్థులకు మల్టీ టాస్కింగ్, నైపుణ్య అంశాల్లో సరైన శిక్షణ లభించకపోవడం వంటివి రాష్ట్రంలో నిరుద్యోగులకు నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణమని యాస్పైరింగ్‌ మైండ్స్‌ నివేదికలో వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement