
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆదిభట్ల ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే వెంకటేశ్వర్‌రావు అదనపు ఆదాయం కోసం వ్యాపార మార్గం పట్టాడు. అన్నిరంగాల వారికి అవసరమయ్యే పని అయితే ఆదరణ ఉంటుందని గుర్తించి.. రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన తోటి నలుగురు సహచరులకూ చెప్పాడు. జీతానికి తోడుగా మరింత ఆదాయం సంపాదించవచ్చనే వారూ ముందుకు వచ్చారు. తలా రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ ప్రారంభించారు. ఇలా కేవలం వెంకటేశ్వర్‌రావు, అతడి స్నేహితులు మాత్రమేకాదు.. హైదరాబాద్‌లో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బిజినెస్
అడుగులు వేస్తున్నారు.
అందులో కొందరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటే.. మరికొందరు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి ప్రారంభిస్తున్నారు. ఇలా ‘అదనపు’ మార్గం పడుతున్నవారిలో సగం మంది వరకు కేవలం తమ వాటా పెట్టుబడి పెట్టి, లాభాలు పంచుకుంటుండగా... మిగతావారు నేరుగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇక బ్యాంకు రుణాలతో ఇళ్లు కొనుగోలు చేసి, అద్దెకివ్వడం.. ఈ అద్దె సొమ్ముతోనే రుణ వాయిదాలు కట్టేసి ఇళ్లు సొంతం చేసుకోవడం వంటివి చేస్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
సగం మందికిపైగా..
హైదరాబాద్‌లోని ఐటీ సంస్థల్లో సుమారు 6 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ఇందులో సగం మందికిపైగా తమ ఉద్యోగానికి తోడు అదనపు సంపాదన మార్గంపై దృష్టి సారించారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇందులో చాలా మంది తమ ఆదాయాన్ని మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడులకు, భూములు, ఇళ్ల కొనుగోళ్లకు మళ్లిస్తుండగా.. కొందరు నేరుగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఐదారుగురు టెకీలు కలసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా టెకీల్లో సగం మంది వరకు స్టాక్ మార్కెట్‌లో, పెద్దగా రిస్కు లేని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. మరో 20 శాతం మంది వరకు రియల్ ఎస్టేట్, ఫ్లాట్లు, ఇళ్ల, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఐస్‌క్రీం పార్లర్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు.
నలుగురు కలసి..
వరంగల్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు అనే టెకీ.. ముగ్గురు సహచరులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. నలుగురు కలసి తలా పది లక్షలు వేసుకుని, బ్యాంకుల నుంచి మరో రూ.24 లక్షలు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టారు. రూ.60 లక్షలతో శామీర్‌పేట ప్రాంతంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి.. విల్లాల కోసం డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. ఏడాది తిరిగేలోపు అక్కడ భూమి విలువ పెరగడంతోపాటు విల్లాల నిర్మాణం కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. దానిని విక్రయించడంతో వారికి పెట్టుబడి పోను ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున లాభం వచ్చింది. ఇలా చాలా మంది టెకీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు సొంతంగా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు. కొందరు తమ వద్ద ఉన్న సొమ్ముతో, బ్యాంకు రుణాలతో ఇళ్లను కొనుగోలు చేసి.. అద్దెకు ఇస్తున్నారు. ఆ అద్దెలనే రుణ వాయిదాలుగా చెల్లిస్తూ.. ఇళ్లను సొంతం చేసేసుకుంటున్నారు. ఇంకొందరు బిల్డర్లకు పెట్టుబడిగా డబ్బులు సమకూర్చి.. లాభాల్లో 10 శాతం వరకు వాటాగా తీసుకుంటున్నారు.
‘ఫుడ్’ వ్యాపారాలే ఎక్కువ..
చాలా మంది టెకీలు.. పెట్టుబడి తక్కువగా ఉండటం, సులభంగా వ్యాపారం చేయగలగడం, నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల వంటి వ్యాపారాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఆదిభట్ల, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో.. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, కెఫేల వంటివాటిని ప్రారంభించారు. నలుగురైదుగురు కలసి ఒక్కొక్కరు రూ.రెండు మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి.. ఈ వ్యాపారాలు పెడుతున్నారు. ఎవరైనా తెలిసినవారిని పెట్టుకుని వాటిని నడిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి వాటిని చూసుకుంటున్నారు. కొందరు టెకీలు బార్లు, పబ్బుల వంటివాటిల్లోనూ పెట్టుబడులు పెట్టి.. వాటాలు తీసుకుంటున్నారు.
ఐస్‌క్రీమ్‌లు.. మిల్క్ షేక్‌లు..
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెకీగా పనిచేసిన శివప్రసాద్ కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారంలోకి దిగారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో మిల్క్‌షేక్, షేకెన్ స్లైస్ పేరుతో ఔట్‌లెట్లు ప్రారంభించారు. ఒక్కోదానికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రోజుకు రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అందులో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం ఉంటోందని శివప్రసాద్ చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ రెండు ఔట్‌లెట్లు పెట్టేందుకు శివప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఇక బాగా క్రేజ్ ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్లవైపు కూడా టెకీలు దృష్టి సారించారు. ఖమ్మంకు చెందిన రమేశ్ రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ ఐస్‌క్రీం పార్లర్‌లో 20శాతం వాటా తీసుకున్నారు. హోం డెలివరీ చేయడానికి ఓ ప్రత్యేకమైన యాప్ సైతం తయారు చేయించారు. ఆయన పదో తరగతి స్నేహితులు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.
వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటంతోనూ..
ఐటీ ఉద్యోగాల్లో భారీగా వేతనాలు అందడం వాస్తవమే అయినా.. కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉంటోందని కొందరు టెకీలు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల కింద ఏటేటా వేతనాల పెరుగుదల భారీగా ఉండేదని.. ఇప్పుడు ఏటా ఐదు నుంచి పది శాతం మేర మాత్రమే వేతనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దీనికితోడు తమ ఆదాయాన్ని మంచి పెట్టుబడిగా పెట్టి.. మరింత ఆదాయం పొందాలన్న ఆలోచన కారణంగా వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment