రోశయ్యకు నాయిని క్షమాపణ
- తప్పుడు సమాచారం వల్లే మల్లేపల్లి భూమిపై ప్రకటన చేసినట్లు వివరణ
సాక్షి, హైదరాబాద్: అధికారులు ఇచ్చిన సమాచార లోపంతో తమిళనాడు గవర్నర్ రోశయ్య అల్లుడికి కేటాయించిన భూమి విషయంలో తప్పుడు ప్రకటన చేశానంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో రోశయ్యకు క్షమాపణ చెప్పారు. మల్లేపల్లి ఐటీఐకి చెందిన భూమిలో ఒక ఎకరాన్ని తక్కువ ధరకే రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను చేసిన ప్రకటన తప్పు అని స్పష్టంచేశారు.
శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లేపల్లి ఐటీఐ స్థలాన్ని నైస్ ఆసుపత్రికి కేటాయించడంపై విచారణ జరిపి పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో చర్చిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో మల్లేపల్లి ఐటీఐని ఆధునీకరిస్తామని, రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలనూ అభివృద్ధిపరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రంలో ‘స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని’ మంజూరు చేయిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారని, స్థలం కేటాయింపునకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా హామీ ఇచ్చారని నాయిని చెప్పారు.
నాయిని సమక్షంలో చేరికలు
వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం నాయిని సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గ పరిధిలోని గణపురం మండలానికి చెందిన సింగిల్‌విండో వైస్ చైర్మన్, డెరైక్టర్లు, టీడీపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి నాయిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.