‘జనాభాతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది..’ఈ వాక్యం మనం తరచూ వింటున్నాం. చదువుతున్నాం. తిరిగి మన పనుల్లో మనం పడిపోతున్నాం. ప్రతిభ పులిజాల అందరిలా ఆ వాక్యాన్ని వదిలేయలేదు. నిరుద్యోగ సమస్యనే తన ఉద్యోగంగా మలుచుకుంది. ఖాళీగా ఉన్నవారు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో తగు శిక్షణ ఇస్తుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇప్పిస్తుంది. చదువులేనివారికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేనివారి దగ్గరకు వెళ్లి వాటి గురించి వివరిస్తుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకొని మెరుగైన జీవనం పొందేలా సహాయం చేస్తుంటుంది. ఇరవై ఏళ్లుగా దాదాపు డెబ్భై ఐదు వేల మందికి పైగా వారెంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచి, శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతిభ. తన మొదటి అడుగు నుంచీ ఇప్పటి వరకు సాగించిన పయనం గురించి ఇలా వివరించారు...
‘‘నిన్న ఉదయం రిసీవ్ చేసుకున్న ఓ ఫోన్ కాల్ గురించి చెబుతాను. ‘మేడమ్.. బాగున్నారా! ఏడాది క్రితం నేను మీ ఇంట్లో పనిచేసిన అనితను’ అంటూ పలకరించింది ఓ అమ్మాయి. ఇప్పుడు తను జూబ్లీ హిల్స్‌లోని ఓ పేరున్న బ్యూటీ స్పాలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తు్తన్నానని చెప్పింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనికారణంగా ఏడవ తరగతితో చదువు ఆపేసిన అనిత తన తల్లితో కలిసి ఇళ్లలో పనులు చేసేది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగామ్‌లో చేరి, బ్యుటీషియన్‌గా పనులు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇలా జీవితాన్ని మెరుగుపరుచుకున్నవారి గురించి తెలిసినప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. చదువు లేని వారే కాదు చదువున్నవారు కూడా తమ కెరియర్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు తర్వాత సాఫ్ట్‌వేర్‌లోనో.. మరేదైనా కంపెనీలోనో విద్యార్హతతో జాబ్‌లో చేరుతారు. ఆ తర్వాత సరైన నైపుణ్యం లేదని ఆ కంపెనీలు ‘రిజక్ట్’ చేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేస్తే జీవితంలో ఇంకా వెనకబాటుకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను తప్పించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో మా ఆఫీస్ ఉంది. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటాను. వారంలో అన్ని రోజులూ శిక్షణాకార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న బస్తీలు మొదలుకొని కాలేజీ క్యాంపస్‌ల వరకు నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దేశంలో చదువు ఉంది. కానీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్న దృశ్యం
ఇరవై ఏళ్లుగా..
ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేశాను. రెండేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. అప్పుడే అర్ధమైంది చదువుకు కొదవ లేదు, నైపుణ్యాలకు సంబంధించిన లోటు అంతటా ఉందని. అప్పుడే ‘కెరియర్ హైట్స్’పేరుతో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచే విద్యార్థులకు జాబ్ ప్లేస్‌మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కణ్ణుంచి ఆలోచనా విస్తృతి పెరిగింది. కొన్ని ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు వెళ్లినప్పుడు అక్కడి యాజమాన్యం పనివాళ్లను వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం గమనించాను. దాంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా గురించి వాకబు చేశాను. పనిలేకుండా ఖాళీగా ఉండేవారి సంఖ్యను బేరీజు వేసుకున్నాను. వారిని కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చాను. ఫలితంగా అక్కడి కంపెనీలలో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారికే పని అవకాశాలు పెరిగాయి. గతంలో ఇళ్లలో పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు పేరున్న కంపెనీలలో పనిచేసే స్థాయికి చేరినవారున్నారు. ఇలాగే మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాను.
ప్రభుత్వంతో కలిసికట్టుగా..
ప్రపంచంలో మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అన్ని రంగాలకు అవసరమే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగ యువతకు సరైన పని కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్డ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వమూ నిర్వహిస్తుంది. అయితే వాటి గురించిన అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సౌత్ రీజియన్ అడ్వైజర్‌గా ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీడియా, సినిమా, ఫొటోగ్రఫీ, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా 14 రంగాలలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తున్నాను.
కుటుంబ ప్రోత్సాహం
పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే. నాన్న లింగయ్య వైమానిక దళ ఉద్యోగి. అమ్మ ఫణిబాయి. ఇద్దరు అన్నయ్యలు. మా పెంపకంలో ఎక్కడా వివక్ష లేదు. తాతయ్య పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ, నాన్న ఎయిర్‌ఫోర్స్‌లోనూ పనిచేయడంతో స్వీయ క్రమశిక్షణతోపాటు సమాజం పట్ల బాధ్యత కూడా చిన్నతనం నుంచే అలవడింది. మా వారు దినేశ్ డెంటిస్ట్. అత్తింటివారూ బాగా చదువుకున్నవారు కావడంతో నా తపనకు ఎక్కడా ఆంక్షలూ, అడ్డంకులూ లేవు. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడాలన్నదే మా కుటుంబం నుంచి వచ్చిన మాట. అదే నన్ను ఎంతోమందిని కలిసేలా, ఎన్నో విషయాలు నేర్చుకునేలా, మరెన్నో విషయాలు నలుగురికి తెలియజేప్పే అవకాశాన్ని ఇచ్చింది.
స్వచ్ఛత – శుభ్రత
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మురికివాడలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిస్థితులు చాలా బాధ కలిగించాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా.. ఈ టెక్నాలజీ యుగంలోనూ కనీస వసతులు లేకుండా జీవిస్తున్న దుర్భరమైన జీవితాలను చూసినప్పుడు ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్న ఆవేదన కలిగింది. స్వచ్ఛభారత్ అంటున్న కేంద్రప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గమనించాను. పారిశుద్ధ్య కార్మికుల్లోనూ వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటు వారి సంక్షేమం గురించీ ఆలోచించాను. వారికీ శిక్షణ ఇవ్వాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ముందుగా నేను ట్రెయిన్ కావాలని ‘సఫాయి కర్మచారి’ సర్టిఫికెట్ కోర్సు చేశాను. ఫండ్స్ కోసం 5కె, 10 కె రన్స్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. అప్పుడు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ను కలిసి నా ఆలోచన చెప్పాను. వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటిగా ‘కర్తవ్య ఫౌండేషన్’ ఏర్పాటు చేసి చందానగర్ ఏరియాలో మూడువందల మందికి శిక్షణ ఇచ్చాం. వారికి నా పనితీరు, నిబద్ధత నచ్చడంతో ఆ తర్వాత ‘సాఫ్ హైదరాబాద్ – షాన్‌దాన్ హైదరాబాద్’, ‘వాటర్ లీడర్‌షిప్ కన్జర్వేషన్’లో భాగస్వామిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. దేశం మారాలంటూ పథకాలు రూపొందిస్తే ఫలితం ఉండదు ఆయా పథకాల ద్వారా దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు అనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలు కావాలి’ అని వివరించారు ప్రతిభ పులిజాల.
ఒకవైపు స్కిల్ డెవలప్‌మెంట్ దిశగా సాగుతున్న శిక్షణాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మురికివాడల్లో పరిశుభ్రమైన జీవనం కోసం, స్వచ్ఛమైన పరిసరాల కోసం కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– నిర్మలారెడ్డిఫొటోలు: అనీల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment