సీఎస్ సోమేశ్‌తో మాట్లాడుతున్న అనిల్ శాస్త్రి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్‌బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్‌బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం బీఆర్‌కే భవన్‌లో భేటీ అయ్యారు. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ..
రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment