నైపుణ్యం ఉంటే ఉపాధికి కొదవే లేదు
-
అంతర్జాతీయ బిగ్ డేటా విశ్లేషకులు సునీల్ ములగాడ
వెలుగుబంద (రాజానగరం) :
ఐటీ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడానికి నైపుణ్యం, ప్రతిభ మినహా దేశ, విదేశాలతో సంబంధం లేదని అంతర్జాతీయ బిగ్ డేటా విశ్లేషకులు సునీల్ ములగాడ తెలిపారు. తాను దశాబ్దకాలం పాటు అమెరికాలో పొందిన అనుభవాన్ని మన దేశానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తానన్నారు. స్థానిక గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో టెక్ ఏ క్ట్స్రీమ్ పేరిట బిగ్ డేటా, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్‌పై నిర్వహిస్తున్న వర్క్‌షాపును చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్‌ఎన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి త్వరితగతిన ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్పర్ గ్యాన్ దుద్దిపూడి మాట్లాడుతూ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కఠోర శ్రమ ద్వారానే కమర్షియల్ అప్లికేషన్స్ విరివిగా చేయగలుగుతున్నామని చెప్పారు. వీటిలో ఉన్న ప్రత్యేకతను విద్యార్థులకు నేర్పడాన్ని ఒక హాబీగా పెట్టుకున్నామన్నారు. తాను చదివిన కళాశాలలో నిర్వహించే సదస్సుకు ఈ విధంగా హాజరుకావడం ఎంతో గర్వంగా ఉందని పూర్వ విద్యార్థి, డ్రీమ్ స్టెప్ సాఫ్ట్‌వేర్ అధినేత అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. సంక్లిష్ట విశ్లేషణపై సరైన తర్ఫీదు ఇవ్వాలనే ఉద్ధేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు తెలిపారు. సదస్సుకు రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, టెక్నికల్ క్విజ్, స్టార్టప్ ఐడియాస్‌పై పోటీలు నిర్వహిస్తామన్నారు. సీఎస్‌ఈ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వై.వెంకట్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.