అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి
-
మధురపూడి సభలో సీఎం చంద్రబాబు
-
సీఎం రాక ఆలస్యం
-
విద్యార్థినులతో సభలో నృత్యాలు
సాక్షి, రాజమహేంద్రవరం :
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా మధురపూడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఉన్న 1,750 మీటర్ల రన్‌వేను 3,165 మీటర్లకు విస్తరించేందుకు సోమవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కాకినాడలో మరో పోర్టు నిర్మిస్తామని తెలిపారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలు కేరళ రాష్ట్రాన్ని మించిపోతాయన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పూర్తవడం సాధ్యం కాదన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ రాజమహేద్రవరం నగరాన్ని ప్రఖ్యాత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు.
ప్రాంగణమంతా కళాశాల విద్యార్థులే...
సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులను నేతలు తరలించారు. సీఎం పర్యటన 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2:50 గంటలకు మధురపూడికి చేరుకోవాల్సిన ముఖ్యమంత్రి 3:35 నిమిషాలకు చేరుకున్నారు. దీంతో సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచేందుకు వేదికపై కళాశాల విద్యార్థులచే నృత్యాలు చేయించారు. సీఎం పర్యటనతో ఎయిర్‌పోర్టు రోడ్డులో దాదాపు మూడు గంటలసేపు ఆంక్షలు విధించారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. విమానా్రÔ¶ యానికి వచ్చే ప్రయాణికుల వాహనాలను అనుమతించలేదు. తమ వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారినీ బయటే ఉంచేశారు.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోని భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధురపూడి విమానాశ్రయం విస్తరణకు భూమి పూజ చేసి అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించడంతో ఏమవుతుందోనని పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం సభకు భారీగా జనసమీకరణ చేయడంతో విమానా్రÔ¶ యానికి భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం కష్టసాధ్యమైంది. సీఎం వచ్చి వెళ్లే వరకు పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సభ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.