
అమెరికా బాటలో న్యూజిలాండ్
వెల్లింగ్టన్ : తమ దేశంలోని ఉద్యోగాలను కాపాడుకోవడానికి వలస నిబంధనలు కఠినతరం చేసిన దేశాల జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు తాజాగా న్యూజిలాండ్ చేరింది. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు దేశంలోకి తీసుకురావడంపై నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం తెలిపింది.
న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ మంత్రి మైఖేల్ వుడ్‌హౌస్ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్‌లోని చాలా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడ్డాయని తెలిపారు. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకోవడం కంపెనీలకు తలకుమించిన భారంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం న్యూజిలాండ్ జాతీయుల అభివృద్ధి, సంక్షేమానికే కట్టుబడి ఉందని వుడ్‌హౌస్ స్పష్టం చేశారు. అధిక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు వేతన పరిమితి పెంచడం వంటి చర్యలు నూతన విధానంలో భాగంగా తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.