
రూ. 100 కోట్లతో హెచ్‌ఎస్‌బీసీ స్కిల్ డెవలప్‌మెంట్
భారత్‌లో 75 వేల మందికి శిక్షణ
లండన్: బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ భారత్ కోసం ‘హెచ్‌ఎస్‌బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కోసం హెచ్‌ఎస్‌బీసీ రూ.100 కోట్లు వెచ్చించనుంది. వచ్చే ఐదేళ్లలో 75,000కు పైగా యువతీ యువకులను, మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సంయుక్తంగా గురువారం సాయంత్రం ‘హెచ్‌ఎస్‌బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించారు.
29 ఏళ్ల సగటు వయసుతో భారత్ 2020 నాటికి ప్రపంచంలోనే యుక్త వయసు జనాభా అధికంగా గల దేశంగా అవతరించనుందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. ఒక దేశం స్థిర వృద్ధిని సాధించడంలో స్కిల్ డెవలప్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తుందని, పేదరిక నిర్మూలనకు ఆయుధంగా పనిచేస్తుందని, సమాజంలో అసమానతలను తొలగిం చడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించింది. వెనకబడిన యువతీ యువకుల్లో,మహిళ్లలో నైపుణ్యాలను పెంపొందించి, వారిని ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్, సీఈవో స్టువర్ట్ పి మిల్నే విశ్వసించారు.