
తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ
కేంద్రమంత్రి రూడీ వెల్లడి
* జాబితాలో ఏపీ, బిహార్ కూడా
* విద్యార్థుల్లో నైపుణ్యాలుపెంచడమే లక్ష్యం
* ఒకే గొడుగు కిందకు ఐటీఐ, ఏటీఐలు
* వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెడతామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) యూనివర్సిటీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలసి నగరంలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఏటీఐ)ను రూఢీ సందర్శించారు. దేశంలోని 12 వేల ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, 7 ఏటీఐలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఉత్పత్తి రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతో పాటు నిరుద్యోగాన్ని దూరం చేసేందుకు ఈ వర్సిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
మొదటివిడతలోనే తెలంగాణ, ఏపీ, బిహార్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ‘నేషనల్ స్కిల్ మిషన్’ను జూలై 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల్లోని విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ వర్సిటీలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్నామని, ఇంజనీరింగ్ సహా ప్రాథమిక స్థాయి విద్యలో నైపుణ్యాలు పెంపొందేలా సిలబస్ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భవిష్యత్తులో నల్లధనమే ఉండదు
విదేశాల్లో ఉన్న నల్లదనం విషయంలో కేంద్రం ఓ విధానానికి వచ్చిందని, భవిష్యత్తులో నల్లధనమే ఉండదని రూడీ పేర్కొన్నారు. అవినీతిని నిరోధించేందుకే బొగ్గు, సహజవనరుల్లో రాష్ట్రాలకే అధికారాలు అప్పగించినట్టుగా వివరించారు. ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వం భూసేకరణ చేయబోదని, ప్రభుత్వ అవసరాలకే భూసేకరణ ఉంటుందని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం భారీగా పెంచినట్టుగా చెప్పారు. ఎంతమంది కలిసినా బిహార్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తొలివిడతలోనే తెలంగాణకు స్కిల్ డెవలప్‌మెంటు యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.