రైతుకు మిగిలింది పుర్రెలు, ఎముకలే
- చంద్రబాబు సర్కారుపై రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆగ్రహం
- కలెక్టరేట్ వద్ద పుర్రెలు, ఎముకలతో నిరసన ప్రదర్శన
కల్లూరు (రూరల్) : సీఎం చంద్రబాబు వ్యవసాయాభివృద్ధిపై చేసిన నిర్లక్ష్యం కారణంగా రైతులకు పుర్రెలు, ఎముకలే మిగిలాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం అన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు కనీస ఉపశమన చర్యలు కూడా చేపట్టకుండా రైతులను అప్పుల ఊబిలోకి తోసేశారన్నారు. అప్పుల బాధ భరించలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారి పుర్రెలు మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఉల్లి, టమాట, మిర్చి, కందులు, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కరువు ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల్లో ప్రతి రైతుకూ ఐదెకరాలకు సరిపడా విత్తనాలను 90 శాతం సబ్సిడీ పంపిణీ చేయాలని, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి పంట నష్టపరిహారం డబ్బులు వరుసగా రూ.73 కోట్లు, రూ.45 కోట్లు, రూ.325 కోట్లు మంజూరు చేసినా రైతు ఖాతాలకు జమ చేయలేదని, వెంటనే ఆ ప్రక్రియ పూర్త చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, వీహెచ్‌పీఎస్ కన్వీనర్ మహేష్, ఏఐవైఎఫ్ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబయ్య, రైతులు రంగన్న, పుల్లన్న, పెద్దయ్య, రంగన్న, ఫాతిమా, అమీనమ్మ పాల్గొన్నారు.