న్యూఢిల్లీ: ఐటీఐల కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల సీబీ ఎస్‌ఈ వంటి బోర్డుల తరహాలోనే ఐటీఐ విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు, సర్టిఫికెట్లు అందజేసేందుకు వీలేర్పడుతుంది. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు సీబీఎస్‌ఈ వంటి రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పది, పన్నెండు తరగతుల సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుంది. తాజా ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏటా 13 వేల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్(ఐటీఐల)లలో విద్య నభ్యసిస్తున్న 20 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.
అంతేగాక ఐటీఐ కోర్సుల విద్యార్థులు ఇతర స్కూళ్లు, కళాశాలల్లోని రెగ్యులర్ కోర్సులు చేసేందుకూ వీలేర్పడుతుంది. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతిపాదిత ఐటీఐ బోర్డు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పదోతరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుందన్నారు.
ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు!
Published Thu, Mar 30 2017 2:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement