1 నుంచి జేఈఈ దరఖాస్తులు!  | JEE applications from September 1st | Sakshi
Sakshi News home page

1 నుంచి జేఈఈ దరఖాస్తులు! 

Published Sat, Aug 18 2018 1:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

JEE applications from September 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేతృత్వంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్‌టీఏ తమ వెబ్‌సైట్‌ను ( nta.ac.in) అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ దరఖాస్తులను సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి స్వీకరించనుంది. విద్యార్థులు తమ వెబ్‌సైట్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ లింకును అందుబాటులో ఉంచింది. అయితే అది సెప్టెంబరు 1వ తేదీ నుంచే పని చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు ఈ పరీక్షను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించగా, ఇప్పటి నుంచి ఎన్‌టీఏ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

రెండో పరీక్షకు ఏప్రిల్‌లో.. 
జేఈఈ మెయిన్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనవరిలో నిర్వహించే జేఈఈ కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో రెండోసారి నిర్వహించే పరీక్ష కోసం షెడ్యూలును ప్రకటించి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పటికీ ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తేనుంది. 

జనవరిలో పరీక్షకు హాజరయ్యేది ఎందరో..? 
జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌కు ఎంత మంది విద్యార్థులు హాజరవుతారన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి జనవరి నాటికి కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను పూర్తి చేసి, రివిజన్‌ను చేపడతారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు మార్చిలో జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షలపైనే దృష్టి సారిస్తారు. దీంతో జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించే రెండో జేఈఈ మెయిన్‌కే ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు.  

జేఈఈ మెయిన్‌ తొలి పరీక్ష
- 2018 సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 
2019 జనవరి 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు 
ఫిబ్రవరి మొదటి వారంలో ఫలితాలు వెల్లడి 

జేఈఈ మెయిన్‌ రెండో పరీక్ష 
2019 ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి రెండో వారం వరకు దరఖాస్తులను స్వీకరణ 
ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు 
మే మొదటి వారంలో ఫలితాల వెల్లడి  

ఐదు పరీక్షలు.. 
ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఐదు రకాల పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తాము నిర్వహించబోయే పరీక్షల వివరాలను ఎన్‌టీఏ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్‌తోపాటు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌), సెంట్రల్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు (సీమ్యాట్‌), గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీప్యాట్‌), యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (యూజీసీ–నెట్‌) పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించింది. వాటికి సంబంధించిన షెడ్యూళ్లను జారీ చేయాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement