కంపెనీ బోర్డుల్లో కానరాని యువశక్తి!
ఉరకలెత్తే యువ జనాభాతో అలరారుతున్న భారత్‌గా ప్రపంచదేశాల్లో మనకు గొప్పపేరే ఉంది. అయితే, ఒక రంగంలో మాత్రం యువశక్తి అంతకంతకూ ఆవిరైపోతోంది. తాజా గణంకాల ప్రకారం భారత్ కార్పొరేట్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో యువత సంఖ్య అట్టడుగుకు పడిపోయింది. బోర్డుల్లోకి కొత్తగా యువ డెరైక్టర్ల నియామకాలు కూడా అత్యంత ఘోరంగా తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
2006 నుంచి చూస్తే... మన కంపెనీల్లో 25 ఏళ్లు అంతకంటే చిన్న వయసున్న డెరైక్టర్లుగా నియామకం పొందినవాళ్ల సంఖ్య అప్పట్లో 522 మందిగా ఉండేదని ఇండియన్‌బోర్డ్స్ డాట్ కామ్ పేర్కొంది. ఇప్పుడు ఈ సంఖ్య ఎనిమిదికి మించిలేకపోవడం గమనార్హం. అంటే ఏకంగా 98 శాతం మంది తగ్గిపోయినట్లు లెక్క. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లోని లిస్టెడ్ కంపెనీల డేటా ఆధారంగా ఇండియాబోర్డ్స్ ఈ గణాంకాలను రూపొందిస్తోంది. ‘కొంతమంది బోర్డు సభ్యుల వయసు 25 ఏళ్లు దాటిపోయి ఉండొచ్చు. మరికొందరు పదవి నుంచి వైదొలగవచ్చు. అయితే, 25 ఏళ్లలోపు వయసున్న కొత్త డెరైక్టర్ల నియామకం మాత్రం అడుగంటిపోయిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్(ఇండియన్‌బోర్డ్స్ డాట్ కామ్‌ను నిర్వహించే సంస్థ ఇది) ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు.
అంతా సీనియర్ సిటిజన్లే...
కంపెనీల బోర్డుల్లో యువ డెరైక్టర్ల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టేస్థాయికి చేరింది. ప్రస్తుతం డెరైక్టర్ల సగటు వయసు 60 ఏళ్లుగా అంచనా. అంటే దాదాపు సీనియర్ సిటిజన్ కిందే లెక్క. మరో ముఖ్యవిషయం ఏంటంటే... బోర్డుల్లో అత్యధికంగా(38.5 శాతం) డెరైక్టర్ల వయసు 46-60 ఏళ్ల మధ్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక 61-69 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు 20.3 శాతం. 36-45 ఏళ్లు; 26-35 ఏళ్లు; 70-80 ఏళ్ల వయసున్న డెరైక్టర్లు 2-13 శాతం వరకూ ఉన్నారు.
ఇప్పుడున్న కంపెనీ బోర్డుల్లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ డెరైక్టర్ శాష్వత్ గోయెంకా అత్యంత పిన్నవయస్కుడిగా నిలుస్తున్నారని ఇండిన్‌బోర్డ్స్ డాట్‌కామ్ పేర్కొంది. ఆయన వయసు 23 ఏళ్లే. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, వార్టన్ స్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ చేసిన శాష్వత్.. నెస్లే, కేపీఎంజీల్లోనూ పనిచేశారు.
నైపుణ్యమే అడ్డంకి...
డెరైక్టర్‌గా ఎంపికయ్యే వ్యక్తుల నైపుణ్యాలు, అర్హతలు, సామర్థ్యం విషయంలో కంపెనీలు మరీ చాలా పక్కాగా వ్యవహరిస్తుండటమే యువకులకు అవకాశాలు తగ్గిపోయేందుకు దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బోర్డు సీటుకు వయసు కంటే సామర్థ్యానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులు చెబుతున్నారు. ‘25 ఏళ్ల లోపు వయసున్నవాళ్లకు డెరైక్టర్ బాధ్యతలకు తగ్గ అనుభవం ఉండటం కష్టమే. ఏదైనా ఇంటర్నెట్ లేదా టెక్నాలజీ కంపెనీకి చెందిన వ్యక్తి తప్ప ఇంత తక్కువ వయస్కులు డెరైక్టర్ల పోస్టులను దక్కించుకోలేకపోతున్నారు.
అదే ప్రమోటర్ సంబంధిత వ్యక్తులైతే సామర్థ్యంతో పెద్దగా పనిలేకుండానే బోర్డుల్లోకి వచ్చేసే అవకాశాలున్నాయి’ అని ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వయిజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఎండీ అమిత్ టాండన్ అభిప్రాయపడ్డారు. అర్హత ఉంటే ప్రమోటర్ల కుటుంబీకులను బోర్డులోకి తీసుకోవడం పెద్ద సమస్యకాదని, అయితే, కేవలం ప్రమోటర్‌కు చెందిన వ్యక్తి అన్న కారణంతో డెరైక్టర్‌గా తీసుకోవడం మంచిపరిణామం కాదని స్టేక్‌హోల్డర్స్ ఎంపవర్‌మెంట్ సర్వీసెస్ ఎండీ, వ్యవస్థాపకుడు జేఎన్ గుప్తా పేర్కొన్నారు. చాలామంది ప్రమోటర్లు తమకు బోర్డులో ఆదిపత్యం కోసం తమవాళ్లను నియమించుకుంటున్నారని... వాళ్లకిచ్చే జీతాలు కూడా చాలా భారీగానే ఉంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.