సాక్షి, విశాఖపట్నం: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పల్సస్ గ్రూప్ తెలియజేసింది. పల్సస్ హెల్త్‌టెక్‌కు హైదరాబాద్‌తో పాటు చెన్నై, విశాఖ, గుర్‌గావ్‌లో కేంద్రాలున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి నైపుణ్యాలను అభివృద్ధి పరిచే శిక్షణ ఇవ్వటానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ‘‘డిజిటల్ మార్కెటింగ్‌తో ఆన్‌లైన్లోనే వినియోగదారుల దగ్గరకు వస్తువులు వెళుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలో ఉన్నవారికి ఇక్కడి నుంచే మనం ఉత్పత్తిని ప్రజెంట్ చేయొచ్చు. మా సంస్థ ఇప్పటికే 50కి పైగా దేశాల్లో మెడికల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోంది.
మా ఓపెన్ యాక్సెస్ హెల్త్ జర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులకు, వర్సిటీ విద్యార్థులకు అందుతున్నాయి. వీటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం. అందుకే విశాఖ కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. శిక్షణ పొందిన వారిలో చాలామందికి మేమే ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖలో దశల వారీగా 25 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళిక వేస్తున్నాం. రాబోయే పదేళ్లలో ఐటీని మించి ఉద్యోగాలు కల్పించే స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే ఉంది’’ అని పల్సస్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు గేదెల చెప్పారు. సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలియజేశారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎం.ఫార్మా కోర్సులు చేసినవారు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రాణించడానికి అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment