నిరుద్యోగులందరికీ వివిధ వృత్తి విద్య, కంపెనీ పుణ్యాల్లో శిక్షణ ఇస్తాం... ఉద్యోత సాధనలో తోడ్పాటునందిస్తాం... అందరికీ ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దుతామంటూ గత బడ్జెట్‌లో ప్రకటించారు. అరచేతిలో స్వర్గం చూపారు. మళ్లీ బడ్జెట్ సమయం ఆసన్నమైనా శిక్షణ ఆరంభం కాలేదు. ఉపాధి చూపలేదు. ఫలితం.. నిరుద్యోగ అభ్యర్థుల్లో నైరాశ్యం నెలకొంది. టీడీపీ సర్కారు మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు.
ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు రూ.25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఎచ్చెర్ల సమీపంలోని 21 వ శతాబ్ధి గురుకులంలో శిక్షణ తరగతులు ఆరంభిస్తామని వెల్లడించింది. ఇది జరిగి ఏడాది పూర్తయినా శిక్షణలు మాత్రం ప్రారంభించ లేదు. ఒక్క నిరుద్యోగికీ ఉపాధి కల్పించలేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో సైతం నైపుణ్య కేంద్రాలు ప్రారంభిస్తామంటూ అట్టహాసం చేసిన టీడీపీ సర్కారు ఆచరణలో విఫలమైందని, నిరుద్యోగ అభ్యర్థులకు మొండిచేయి చూపిందని వాపోతున్నారు. గతంలో రాజీవ్ యువకిరణాలు, రీమ్యాప్ ఆధ్వర్యంలో 21 వ తశాబ్ధి గురుకులంలో నైపుణ్య కేంద్రం నిర్వహించారు. 2014 ఏప్రిల్ నుంచి శిక్షణలు నిలిపి వేశారు. దీంతో గురుకులం భవనాలు సైతం నిరుపయోగంగా మారాయి.
ఇదీ పరిస్థితి..
శిక్షణలు ఇచ్చేందుకు ప్రారంభంలో విదేశీ కంపెనీ అయిన సీమ్యాన్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ శిక్షణ ప్రారంభించ కుండానే తప్పుకుంది. ప్రస్తుతం మరో కంపెనీ టాటా ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కూడా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. శిక్షణ అనంతరం కనీసం 80 శాతం మందికి ప్లేస్ మెంట్ కల్పించక పోతే ఆశయం దెబ్బతింటుంది. కొన్ని సంస్థలు శిక్షణలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చినా, ప్లేస్‌మెంట్‌కు మాత్రం ముందుకు రాలేక పోతున్నాయి. గతంలో సైతం ఇక్కడ శిక్షణలు ఇచ్చిన సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్, సాహితీ సిస్టమ్స్, సింక్రోసర్వ్ గ్లోబస్ సొల్యూషన్స్, టీంలీజ్ సర్వీ సెస్, నేషనల్ అకాడమీ కనస్ట్రక్షన్స్ సంస్థలు శిక్షణలు ఇచ్చినా ఉపాధి చూపడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ సాయం లేకపోతే ఇలాంటివి నిర్వహించలేమని కంపెనీ ప్రతినిధులే పేర్కొంటున్నారు.
ఎదురుచూపే మిగులుతోంది...
పుణ్య శిక్షణలు కోసం యువత ఎదురు చూస్తున్నారు. మరో పక్క మార్చి వచ్చేస్తుంది. మరో బడ్జెట్ అమలు కానుంది. మొదటి బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇంత వరకు శిక్షణలు ప్రారంభించ లేదు. ఇక్కడ రాజధాని నిర్వాసిత యువతకు కొన్నాళ్లు పాటు నైపుణ్య శిక్షణలు ఇచ్చారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వీరు అర్థాంతరంగా శిక్షణ కేంద్రం విడిచి పెట్టి వెళ్లిపోయారు. జిల్లా అభ్యర్థులకు ఆ పాటి శిక్షణ కూడా కరువైంది. శిక్షణల కోసం రిలీవ్ అయిన ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు ఎదురుచూస్తున్నా నిరాశే ఎదురవుతోంది.
ప్రకటనలకే శిక్షణ..!
Published Wed, Mar 2 2016 12:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
Advertisement
Advertisement