సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై ‘అనంత’ వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక ప్రగతితో పాటు ‘అనంత’ను అభివృద్ధి చేసే బాధ్యత తనది అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది ఈ బడ్జెట్‌లో తేలనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో పొందుపరిచే లెక్కలపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉంది? మరి ‘అనంత’ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో నేడు తేలనుంది.
దేశంలోని దుర్భిక్షప్రాంతాల్లో ‘అనంత’ది రెండోస్థానం. దీని అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. కానీ కొన్నేళ్లుగా పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా తాగు, సాగునీటి వనరుల కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి జిల్లా నోచుకోలేదు. తాగు, సాగు నీటి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడంతో పాటు పారిశ్రామిక, విద్యారంగ ం అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన బాధ్యత కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. సీఎం పీఠం అధిరోహించిన తర్వాత ‘‘అనంత’ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే!’ అంటూ హామీల వర్షం కురింపించిన బాబు అడుగులు ఎలా వేస్తారని అనంత వాసులు ఆసక్తిగా చూస్తున్నారు.
హంద్రీనీవాను ఏడాదిలోగా పూర్తిచేస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు రెండుసార్లు హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశారు. బాబు సీఎంగా తన తొమ్మిదేళ్ల కాలంలో కేవలం 13కోట్లు మాత్రమే కేటాయించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.5,600 కోట్ల నిధులు కేటాయించారు. ప్రస్తుతం హంద్రీ-నీవా పనులు 85-90శాతం మేరకు పూర్తయ్యాయి. ఈ ఏడాది 16.5 టీఎంసీల జలాలు కూడా వచ్చాయి. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను అభివృద్ధి చేయకపోవడంతో నీళ్లు సాగుకు ఉపయోగపడలేదు. ఈ క్రమంలో నేటి బడ్జెట్‌లో హంద్రీ-నీవా ను పూర్తి చేసేందుకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని జిల్లా వాసులు ఆశపడుతున్నారు.
అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలు బోలెడు:
రాష్ట్రనూతన రాజధానిగా విజయవాడను ప్రకటించే సమయంలో జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు. అనంతను స్మార్ట్‌సిటీ చేస్తామన్నారు. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక కూడా అధికారులు సిద్ధం చేయలేదు. సెంట్రల్ యూనివర్శిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, టైక్స్‌టైల్‌పార్క్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు.
వీటికి సంబంధించి కూడా ఇప్పటి వరకూ భూసేకరణకు కూడా అధికారులు ఉపక్రమించలేదు. మరి వీటి భవిష్యత్తు ఏమిటనేది నేడు తేలనుంది. అలాగే వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మాజీ రాష్ట్రప్రతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా కళ్యాణదుర్గంలో వ్యవసాయమిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన హామీలు ఇచ్చారు.
జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతీ ఎకరాకు వందశాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తామని ప్రకటించారు. కనగానపల్లి మండలంలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని మాజీ రాష్ట్రప్రతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా ప్రారంభించారు. నంబూలపూలకుంట మండలంలో వేరుశనగ పరిశోధన కేంద్రం, బుక్కరాయసముద్రం మండలంలో నూనెగింజల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. వీటి పురోగతికి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకోనుందో నేడు తేలనుంది.
రామకృష్ణుని లెక్కలపై లెక్కలేనన్ని ఆశలు
Published Thu, Mar 12 2015 2:27 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement