గేడ్‌ల కంటే.. స్కిల్స్ ముఖ్యం | Gaede .. skills more important | Sakshi
Sakshi News home page

గేడ్‌ల కంటే.. స్కిల్స్ ముఖ్యం

Published Mon, Mar 10 2014 12:00 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

గేడ్‌ల కంటే.. స్కిల్స్ ముఖ్యం - Sakshi

గేడ్‌ల కంటే.. స్కిల్స్ ముఖ్యం

 ఇటీవల కంపెనీలు విద్యార్థుల గ్రేడ్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కొలువు రావాలంటే సంస్థలు ఆశిస్తున్న స్కిల్స్ అభ్యర్థిలో ఉండాల్సిందే. కంపెనీలు చేపట్టే ప్లేస్‌మెంట్స్‌కు విద్యార్థులు ముందుగానే సన్నద్ధం కావాలి. దీనిపై తగిన ప్రణాళిక లేకపోతే అవకాశం చేజారుతుంది. ఏదైనా అంశంపై శిక్షణ పొందగానే సరిపోదు, ఆచరణలో పెట్టినప్పుడే దానికి సార్థకత. ఆచరణలోకి రాని శిక్షణ నిరర్థకం.
 
 ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీలో అసైన్‌మెంట్లలో భాగంగా ఇచ్చే కోడింగ్‌ను పూర్తి చేసి చేతులు దులుపుకుంటారు. దీన్ని పరీక్షల్లో గ్రేడ్లు, పర్సంటేజీల దృష్టితోనే చూస్తుంటారు. ఇది చాలా పొరపాటు. కోడింగ్‌పై తగిన పరిజ్ఞానం లేకపోతే ఇంటర్వ్యూల్లో విఫలమవుతారు! కోడింగ్‌ను కేవలం కోడింగ్ దృష్టితో చూడొద్దు. ఉపయోగకరమైన ఒక అప్లికేషన్‌ను రూపొందించడమే కోడింగ్. పరీక్షల్లో సాధించిన గ్రేడ్లు, పర్సంటేజీలు కంపెనీలు నిర్వహించే పరీక్షలు రాసేందుకు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఉపయోగపడతాయి. కానీ ఉద్యోగం సాధించిపెట్టవు. కోడింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే కంపెనీలు నిర్వహించే టెస్టులు, ఇంటర్వ్యూల్లో సాధారణంగా నాలుగు రకాలైన అభ్యర్థులు ఎదురవుతుంటారు. వారు..
 
 కేటగిరీ 1
 

ఒక కోడ్‌ను కాగితంపై రాయండి అంటే వీరు తెల్లమొహం వేస్తారు. వారు ఇంజనీరింగ్‌లో సి-ప్రోగ్రామింగ్ కోర్సు చేసిన వారైనప్పటికీ ఒక కోడ్‌ను రాయడం రాదు. ఎందుకంటే వారు కోడింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. కాలేజీలో ప్రొఫెసర్లు ఇచ్చిన అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులను నామమాత్రంగా పూర్తిచేశారు. ఇలాంటి వారి భవిష్యత్తేంటో మనకు తెలిసిందే. స్కిల్స్‌ను పెంచుకుంటేనే వీరి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది.
 
 కేటగిరీ 2

 వీరికి కోడింగ్‌లో స్వల్ప పరిజ్ఞానమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోడ్‌ను రాయడం కంటే అప్పటికే అమల్లో ఉన్న కోడ్‌ను చదివి, అర్థం చేసుకోవడమే ముఖ్యం. విద్యార్థులు కోడ్‌ను ఎలా చదువుతున్నారు? ఎలా అర్థం చేసుకుంటున్నారు? అనే విషయాలను ఇంటర్వ్యూల్లో పరీక్షిస్తారు. కాబట్టి కోడ్‌ను చదవడంపై సాధన చేయాలి.
 
 కేటగిరీ 3
 

వీరికి కోడ్ చేయడం తెలుసు, కానీ, ఒక సమస్యకు సరైన కోడ్ ను రాసి, సరైన డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించి చక్కటి పరిష్కారం చూపమంటే తికమకపడతారు. సమస్య ను అర్థం చేసుకొని, పరిష్కరించలేకపోవడమే వీరి సమస్య.
 
 కేటగిరీ 4
 

ఈ విభాగం అభ్యర్థులకు కోడింగ్, దానిలో తర్కం, సూత్రం గురించి తెలుసు. కానీ, దాన్ని ప్రాక్టికల్‌గా ఆచరణలోకి తీసుకొచ్చే విషయంలో విఫలమవుతుంటారు. అందుకు తగిన పరిజ్ఞానం వారిలో ఉండదు. ప్రొడక్ట్ డవలప్‌మెంట్ సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కోడింగ్, రీడింగ్ కోడ్, రైటింగ్ కోడ్, డేటా స్ట్రక్చర్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల స్కిల్స్‌ను మాత్రం తప్పనిసరిగా పరీక్షిస్తారు. అంతిమంగా అభ్యర్థిలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు.

 కోడింగ్ ప్రాధాన్యతను తెలుసుకోండి
 

విద్యార్థులు కోడింగ్ సాధనను సీరియస్‌గా తీసుకోవాలి. ఇలా చేయకపోవడం వల్లే ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతుంటారు. కోడింగ్‌ను నేర్చుకొనే విషయంలో మెథడాలజీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థుల్లో కోడింగ్‌పై నిజమైన ఆసక్తి, ఇష్టం లేకపోతే.. ఇంటర్వ్యూల్లో నెగ్గడం కష్టమే. కాలేజీల్లో ఇచ్చిన అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్ వర్కుల ప్రాధాన్యత విస్మరించరానిది. కొందరు వీటిని ప్రారంభిస్తారు కానీ పూర్తిచేయరు. కోడింగ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తిచేయాలి. వీటివల్ల ఎంతో నైపుణ్యం సొంతమవుతుంది. ఇవి ఉద్యోగ సాధనకు ఉపయోగపడతాయి.
 
 కోడింగ్ కాంపిటీషన్లలో పాల్గొనాలి

 ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా కోడింగ్ కాంపిటీషన్లను నిర్వహిస్తుంటాయి. వీటిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తాయి. కొన్నిసార్లు ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా ఉద్యోగంలో చేర్చుకుంటాయి. ఇలాంటి పోటీల్లో విజేతలుగా నిలవాలంటే కోడింగ్ సమస్యలను బాగా సాధన చేయాలి. పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దేశంలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు, డవలపర్ల కొరత ఎక్కువగానే ఉంది.
 
 మిగిలిన బ్రాంచ్‌లకు..
 

కోడింగ్, ప్రోగ్రామింగ్ అనేవి కేవలం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే అవసరమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ, ఇతర బ్రాంచ్‌లైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం వీటిని నేర్చుకోవడం కచ్చితంగా అవసరం. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ సంస్థలు అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఆయా స్కిల్స్ ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థుల్లో కోడింగ్ స్కిల్స్ ఉంటే చక్కటి సాధనతో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్  కూడా క్రమంగా మెరుగవుతాయి.
 కోడింగ్ స్కిల్స్ ప్రాధాన్యతను ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు కోడింగ్ స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు. వీరిలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతోపాటు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల విద్యార్థులు కూడా ఉండడం విశేషం. ఇంజనీరింగ్‌లో మీ బ్రాంచ్ ఏదైనప్పటికీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, సివిల్ తదితర రంగాల్లో ఎదురయ్యే సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం చూపగలగాలి. మొదట అది మీకు సంతృప్తిని కలిగించేదిగా ఉండాలి.
 
 గుడ్ కోడింగ్ స్కిల్స్
 
 ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే కోడి ంగ్ స్కిల్స్ పొంద డానికి కృషి చేయాలి. విద్యార్థులు కాలేజీలో కోడింగ్ కల్చర్‌ను అభివృద్ధి చేసుకోవాలి. కోడింగ్ కాన్సెప్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రియల్‌టైమ్ ప్రాజెక్ట్‌ల ద్వారా కాన్సెప్ట్‌లను నేర్చుకోవచ్చు. సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న 10 శాతం మందికి జాబ్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఇతరులతో పోలిస్తే వీరికి భారీ వేతనాలు అందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement