రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తోన్న ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ బిహార్‌లోని ఎంతోమంది గ్రామీణ యువతులకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తోంది. వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేలా చేస్తోంది...
బిహార్‌లోని ఠాకురంజీ గ్రామానికి చెందిన రవీనా మెహ్తో ఒకప్పుడు వంటల్లో, ఇంటిపనుల్లో తల్లికి సహాయపడుతూ ఉండేది. ప్రస్తుతం రవీనా బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో పనిచేయనుంది. బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ప్రారంభించిన ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ లో కోడింగ్ నేర్చుకోవడానికి... ఉన్న ఊరు వదిలి కిషన్‌గంజ్‌కు వచ్చిన 67 మంది యువతులలో రవీనా ఒకరు. 21 నెలల పాటు సాగే ఈ కోర్సులో అరారియా నుంచి గయ వరకు బిహార్ నలుమూలల నుంచి అమ్మాయిలు చేరారు.
తరగతులలో ప్రతి ఒక్కరూ తమ ల్యాప్‌టాప్‌లలో పైథాన్, జావాలతో తలపడుతుంటారు. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ‘ఇక్కడికి రావడానికి ముందు ల్యాప్‌టాప్ కూడా వాడని వారు వీరిలో ఉన్నారు. జీరో నుంచి శిక్షణ ప్రారంభించాం. తక్కువ టైమ్‌లోనే చాలా చక్కగా నేర్చుకుంటున్నారు’ అంటుంది ట్రైనర్‌లలో ఒకరైన ప్రియాంక దంగ్వాల్.
గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన మహిళలు మన దేశంలోని ఐటీ పరిశ్రమలలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేయడానికి నవగురుకుల్, ప్రాజెక్ట్ పొటెన్షియల్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ను ప్రారంభించాయి.
కాణీ ఖర్చు లేకుండా సంస్థలో ఉచితంగా కోర్సు నేర్చుకోవడానికి అవకాశం వచ్చినా రవీనాలాంటి వాళ్లకు ఇంటి పెద్దల నుంచి అనుమతి అంత తేలికగా దొరకలేదు. ‘తల్లిదండ్రుల నుంచి అనుమతి కోసం దాదాపు యుద్ధంలాంటిది చేశాను. మొదట అమ్మను, ఆ తరువాత అమ్మమ్మను చివరకు ఇరుగు పొరుగు వారిని కూడా ఒప్పించాల్సి వచ్చింది. నా జీవితాన్ని మార్చే అవకా«శం కోసం పోరాడాను’ అంటుంది రవీన.
‘బిహార్‌లో కేవలం 9.4 శాతం మంది మహిళలు మాత్రమే శ్రామిక శక్తి(వర్క్ ఫోర్స్)లో ఉన్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ రేటు ఇది. గ్రామీణ మహిళలకు ఉన్నతోద్యోగాలు చేయడానికి సహాయ సహకారాలు అందించడం, శ్రామిక శక్తిలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం మా ప్రధాన లక్ష్యం’ అంటున్నాడు ‘ప్రాజెక్ట్ పొటెన్షియల్’ వ్యవస్థాపకుడు జుబిన్ శర్మ.
కిషన్‌గంజ్‌లో ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. రాయ్‌పూర్, దంతెవాడ, ధర్మశాలలో ఇలాంటి మరో ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి. ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా కూలి పనులు చేసుకునే శ్రామికుల అమ్మాయిలు, ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా మారి నెలకు పాతిక వేలకు పైగా సంపాదిస్తున్నారు.
‘స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు మహిళల సంపాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పితృస్వామిక భావజాలాన్ని దూరం పెట్టడంలో సహాయపడతాయి. మహిళలలో ఆశయాల అంకురార్పణకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి దోహద పడతాయి. కార్పొరేట్ ఇండియా తమ సీఎస్‌ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి కార్యక్రమాలు పెంచితే, మహిళా సాధికారతలో తమ వంతు పాత్ర పోషించడానికి వీలవుతుంది’ అంటుంది ‘గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్’ ప్రొఫెసర్ విద్యా మహాబరే.
రోజూ తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లే అమ్మాయిలు, తల్లితో పాటు ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు, తోచక కుట్లు, అల్లికలతో కాలం వెళ్లదీస్తున్న పల్లెటూరి అమ్మాయిలు... ఐటీ సెక్టార్‌లో పని చేయడం సాధ్యమా? ‘అక్షరాలా సాధ్యమే’ అని నిరూపిస్తోంది స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్.
మొదట్లో కష్టం... ఇప్పుడు ఎంతో ఇష్టం
విద్యార్థులకు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు. వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘మొదట్లో కోడింగ్ నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు కోడ్‌లతో గేమింగ్‌ను కూడా క్రియేట్ చేస్తున్నాం’ అంటారు విద్యార్థులు. కోడింగ్ నేర్పించడం మాత్రమే కాదు విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడేలా ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’లో శిక్షణ ఇస్తున్నారు.
అనగనగా ఒకరోజు...
నేను ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు కిషన్‌గంజ్‌లో ఫ్రీ కోడింగ్ స్కూల్ లేదు. బెంగళూరులోని ‘నవగురుకుల్’కు వెళ్లాలనుకున్నాను. అయితే మా పేరెంట్స్ బెంగళూరుకు వెళ్లడానికి ససేమిరా అన్నారు. అయినా సరే వారితో వాదన చేసి రైలు ఎక్కాను. మా కుటుంబం నుంచే కాదు మా ఊరు నుంచి కూడా ఎవరూ బెంగళూరుకు వెళ్లలేదు.
నేను బెంగళూరుకు వచ్చిన రోజు భారీ వర్షం కురిసింది. నాకు కన్నడ రాదు. అప్పటికి ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చు. చాలా భయం వేసింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేదు. ఇప్పుడు ఫారిన్ క్లయింట్స్‌తో టకటకా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాను. మూడేళ్ల క్రితం కోడింగ్ కోర్సు పూర్తి చేసిన కవిత ప్రస్తుతం కోల్‌కత్తాలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తోంది.
– కవితా మెహ్తో
(చదవండి: కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!)
Comments
Please login to add a commentAdd a comment