ఉపాధికి పాలి‘టెక్నిక్’
ఉపాధికి పాలి‘టెక్నిక్’
Published Mon, Apr 10 2017 9:54 PM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
- ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
- ఈ నెల13 వరకు అవకాశం
- జిల్లాలో 14 కాలేజీలు, 2800 సీట్లు
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్.. పదో తరగతి పాసైన తరువాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేందుకు చక్కని మార్గం. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల13వ తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.
ఇంజినీరింగ్‌లో డిప్లమా సర్టిఫికెట్ పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అనువైనవి. మధ్య తరగతి, దిగువ మధ్య తరతగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ కోర్సులు ప్రవేశ పెట్టారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియేట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేని వాళ్లు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతల విద్యార్థులు పదో తరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లమా పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మూడేళ్ల కోర్సు పూర్తయిన వారు.. ఈ–సెట్ రాసి నేరుగా బీటెక్ సెకెండ్ ఇయర్‌లో ప్రవేశించవచ్చు. జిల్లాలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, రెండు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఆరు ఇంజినీరింగ్ కాలేజీలు తరగతులు అయిన తరువాత మధ్యాహ్నం నుంచి పాలిటెక్నిక్ కోర్సును బోధిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగ అవకాశాలు ఇవీ..
ప్రభుత్వ ఉద్యోగిగా మారేందుకు పాలిటెక్నిక్ కోర్సు వనరుగా మారుతోంది. ఎలక్ట్రికల్ కోర్సులు పూర్తి చేస్తే ఒ.ఎన్.జి.సిలోను, రైల్వే, విద్యుత్ విభాగంలోను, విద్యుత్ ఉపకేంద్రాల్లోను, వివిధ పరిశ్రమల్లోను ఉద్యోగాలు సాధించవచ్చు. మెకానికల్ కోర్సులు పూర్తి చేస్తే రైల్వే, ఆర్టీసీ, ఉక్కు పరిశ్రమల్లోను, గడియారం పరిశ్రమల్లో ఉపాధి సులువుగానే లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి.. రైల్వే, బి.ఎస్.ఎన్.ఎల్, ఇతర సెల్‌ఫోన్ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. సివిల్ కోర్సు పూర్తి చేస్తే రోడ్డు, భవనాల శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఒ.ఎన్.జి.సిలో ఉద్యోగాలు లభిస్తాయి. కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఈ–సెట్ రాసి ఇంజినీరింగ్‌లో చేరితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించవచ్చు.
బ్రిడ్జి కోర్సు
పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారు.. సాధారణ డిగ్రీలో రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేలా (బ్రిడ్జి కోర్సు) గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. ఇంటర్ పూర్తి అయితే బ్రిడ్జి కోర్సు ద్వారా ఒకేషనల్ కోర్సులో రెండో సంవత్సరంలో చేరవచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సులో మొదటి రెండేళ్లు పూర్తయ్యాక.. గతంలో ఆరు నెలలు పరిశ్రమల్లో నైపుణ్యశిక్షణకు (అప్రెంటిస్) వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆరు నెలల పరిమితిని నెల రోజులకు కుదించారు.
ధరఖాస్తు ఇలా చేసుకోవాలి..
ప్రవేశ పరీక్ష రాయలనుకునే విద్యార్థులు ఈ నెల13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా కేంద్రాల్లో రూ.350 చెల్లించి పదో తరగతి హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫొటో జత చేసి దరఖాస్తు చేయాలి. ఈ నెల 28వ లేదీన ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షలో మొత్తం 120 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో గణితం నుంచి 60, భౌతిక శాస్త్రం నుంచి 30, రసాయన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయం నిర్ణయించారు.
ఉద్యోగాలు సులువుగా వస్తాయి
– విజయ భాస్కర్, పాలిటెక్నిక్ కాలేజీల కన్వీనర్
పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారికి టెక్నీషియన్ ఉద్యోగాలు సులువుగా వస్తాయి. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నీషియన్లదే కీలక పాత్ర. ఒక్క ఇంజినీర్‌కి ఆరుగురు టెక్నీషియన్లు తోడుగా ఉంటారు. నేరుగా ఇంజినీరింగ్ చేసిన వారి కంటే పాలిటెక్నిక్ డిప్లమా ద్వారా వచ్చిన వారికి మంచి నైపుణ్యం ఉంటుంది. డిప్లమా చేసిన వారు.. వృత్తి నైపుణ్యంతో రాణించవచ్చు.
Advertisement
Advertisement