- ప్రభుత్వపక్షాన సమన్వయకర్త ‘టాస్క్’
- నైపుణ్యాల పెంపే ధ్యేయం
- పైలట్ ప్రాజెక్టుగా 50 కళాశాలల్లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం సమాయత్తమైంది. పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల రూపకల్పనతోపాటు కోర్సు పూర్తి అయిన విద్యార్థులను ఉద్యోగార్హత కలిగినవారిగా తయారు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా సచివాలయంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో నాస్కామ్, జేఎన్టీయూహెచ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇదీ ప్రయోజనం: రాబోయే ఐదు, పదేళ్లలో ఉద్యోగావకాశాలు అధికంగా లభించే కోర్సులపట్ల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. బీటెక్ మూడు, చివరి సంవత్సరం విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం ద్వారా కళాశాల నుంచే నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు ఆయా కోర్సుల దోహదపడేలా కోర్సులను రూపొందిం చారు. వివిధ రంగాల్లో రాబోయే ఆపార అవకాశాలను ముందుగానే పసిగట్టి కోర్సులను డిజైన్ చేస్తారు.
ఐటీ రంగంతో మొదలు: ప్రస్తుతానికి ఐటీ రంగంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనాలసిస్, డిజైన్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా వచ్చే అవకాశమున్నందున, వచ్చే రెండేళ్లలో సుమారు 15 వేల మంది ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి 50 కళాశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కోర్సుల డిజైనింగ్, అధ్యాపకుల శిక్షణ బాధ్యత నాస్కామ్, కాలేజీల్లో కోర్సుల పరిచయం బాధ్యతను జేఎన్టీయూహెచ్ చేప ట్టనుంది. జేఎన్టీయూహెచ్, నాస్కామ్‌ల మధ్య సమన్వయకర్తగా ప్రభుత్వం తరఫున టాస్క్ పనిచేయనుంది. నైపుణ్యాల పెంపునకే ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు నిలిపేశామని కేటీఆర్ తెలిపారు.