నేటి నుంచి ఇంజనీరింగ్‌ సెట్‌ | Engineering set from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంజనీరింగ్‌ సెట్‌

Published Thu, May 9 2024 4:33 AM | Last Updated on Thu, May 9 2024 4:33 AM

Engineering set from today

ముగిసిన అగ్రి, ఫార్మా సెట్‌

వర్షంతో విద్యుత్‌ అంతరాయం

ఇబ్బందులు పడ్డ విద్యార్థులు

అనేక చోట్ల కొద్ది సేపు మొరాయించిన సర్వర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఈఏపీ సెట్‌) బుధవారం ప్రశాంతంగానే ముగిసింది. అయితే, మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. పరీక్ష కేంద్రాల్లో అనేక చోట్ల విద్యుత్‌ లేకపోవడం, ఇంటర్నెట్‌ సదుపాయం గంటల తరబడి అందుబాటులోకి రాకపోవడంతో సెట్‌కు సమస్యలు తలెత్తాయి.

హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. కానీ తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అదనంగా జనరేటర్లను సిద్ధం చేశారు.  నెట్‌వర్క్‌ సమస్యలను కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం మొదలైన ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగానికి చెందిన సెట్‌ రెండో రోజు కూడా జరిగింది. ఈ రెండు రోజులకు కలిపి 1,00,254 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 90 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

ఇంజనీరింగ్‌ సెట్‌కు పక్కా ఏర్పాట్లు
రాష్ట్రంలోని దాదాపు 175 కాలేజీల్లో ఉన్న 1.06 లక్షల ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించే సెట్‌ గురువారం మొదలవుతుంది. ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి 2,54,532 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

 సగం మందికిపైగా విద్యార్థులు హైదరాబాద్‌ కేంద్రం నుంచే పరీక్ష రాస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో 4 జోన్లు ఏర్పాటు చేశారు. వర్షం, గాలి దుమారం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ జనరేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెట్‌వర్క్‌ సమస్య రాకుండా కూడా అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement