యువతకు 'కార్పొరేట్‌' నైపుణ్యం | Corporate‌ Skill For the Andhra Pradesh Youth | Sakshi
Sakshi News home page

యువతకు 'కార్పొరేట్‌' నైపుణ్యం

Published Sun, Jul 11 2021 4:10 AM | Last Updated on Sun, Jul 11 2021 9:20 AM

Corporate‌ Skill For the Andhra Pradesh Youth - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం కావడానికి దేశీయ కార్పొరేట్‌ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు వీలుగా పలు సంస్థలతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎన్‌. బంగార్రాజు ‘సాక్షి’కి వివరించారు. దీంతో ఐబీఎం, ఒరాకిల్, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, అపోలో, బయోకాన్, హెచ్‌సీఎల్‌ వంటి 24 కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా మరికొన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని కోర్సులు ప్రారంభించామని, మిగిలిన వాటికి ప్రణాళికలు సిద్థంచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అంతర్జాతీయ సంస్థలు కూడా..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 
► అమెరికాకు చెందిన వాధ్వాని ఫౌండేషన్, బ్రిటన్‌కు చెందిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ యూనివర్సిటీ, సింగపూర్‌ పాలిటెక్నిక్‌ ఇంటర్నేషనల్, జీఐజెడ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు నైపుణ్య శిక్షణనివ్వడానికి ముందుకొచ్చాయి. 
► లాభాపేక్ష లేని వాధ్వాని ఫౌండేషన్‌ రాష్ట్రంలోని 100 కాలేజీల్లో విద్యార్థులు ఉద్యోగానికి ఎలా సిద్ధం కావాలి, స్పోకెన్‌ ఇంగ్లీష్, ఇంటర్వ్యూలు ఎదుర్కోవడమెలా వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. 
► లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ సైన్స్‌ ఆసుపత్రులకు చెందిన ఐసీయూ, ఆక్సిజన్‌ ప్లాంట్, జనరల్‌ డ్యూటీ అటెండెన్స్, నర్సింగ్‌ అసిస్టెంట్‌ వంటి కోర్సులు అందించనుంది. 
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో ఈ కోర్సులు నిర్వహించడానికి స్థలాలను కేటాయిస్తున్నామని, సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడుతున్న ఈ కోర్సులు చాలా వరకు ఉచితంగా అందిస్తున్నట్లు బంగార్రాజు తెలిపారు. హైఎండ్‌ సర్టిఫైడ్‌ కోర్సులకు కొన్ని సంస్థలు నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నాయని, ఈ కోర్సుల్లో చేరాలా వద్దా అన్నది పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు.  

నైపుణ్య శిక్షణకు ముందుకొచ్చిన కార్పొరేట్‌ సంస్థలు
► వాధ్వాని ఫౌండేషన్‌
► సింగపూర్‌ పాలిటెక్నిక్‌ ఇంటర్నేషనల్‌ (ఎస్‌పీఐ)
► లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌  
► జీఐజెడ్‌ 
► డెల్‌ టెక్నాలజీస్‌
► ఐబీఎం ఇండియా
► టెక్‌ మహీంద్రా ఫౌండేషన్, 
► ఓరాకిల్‌ అకాడమీ
► డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌
► టీసీఎస్‌ ఐయాన్‌
► ఎల్‌ అండ్‌ టీ ఎడ్యు స్కిల్స్‌
► అపోలో మెడి స్కిల్స్‌
► హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌
► స్నైడర్‌ ఎలక్ట్రిక్‌
► ఎల్‌వీప్రసాద్‌ ఫిల్మ్‌ అకాడమీ
► జేబీఎం ఇండియా లిమిటెడ్‌
► ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
► నేషనల్‌ సాŠట్‌క్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అకాడమీ
► సీఐఐ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌
► దాల్మియా భారత్‌ ఫౌండేషన్‌
► గ్రీన్‌కో టెక్నాలజీస్‌
► బయోకాన్‌ అకాడమీ
► సేల్స్‌ఫోర్స్‌ ఇండియా
► ఎస్‌ఎంసీ కార్పొరేషన్‌ 

చదువు పూర్తికాగానే ఉపాధి
ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తికాగానే ఉపాధి లభించే విధంగా టాప్‌ ఎండ్‌ ఐటీ సర్టిఫైడ్‌ కోర్సులను ఈ కార్పొరేట్‌ సంస్థలు అందిస్తున్నాయి. 
► వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో ఐబీఎం 150, 200 గంటల వ్యవధి ఉండే హై ఎండ్‌ కోర్సులను అందిస్తుండగా.. ఓరాకిల్‌ అకాడమీ తొలి విడత కింద 50 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ నెలలో సర్టిఫికేషన్‌ కోర్సులను అందించనుంది. 
► అలాగే, ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ రంగానికి చెందిన వివిధ కోర్సులను అందించడానికి ముందుకు వచ్చింది.
► పాత సినిమాల పునరుద్ధరణ, రీ ప్రొడక్షన్, ఫిల్మ్‌ ఎడిటింగ్‌ వంటి సినిమా సంబంధిత స్కిల్స్‌ను ఎల్‌వీ ప్రసాద్‌ ఫిల్మ్‌ అకాడమీ అందించనుంది. ఈ సంస్థ తొలుత ఆంధ్రా యూనివర్సిటీలో తన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోందని, ఆ తర్వాత వివిధ జిల్లాల్లో పదిచోట్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బంగార్రాజు తెలిపారు. 
..ఇలా వివిధ కోర్సుల డిమాండ్‌ను బట్టి ప్రతీ కోర్సు నుంచి 10వేల నుంచి 30 వేల మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement