బడ్జెట్‌లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..! | Union Budget 2023: No Relief The Middle Class Expect | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!

Published Thu, Feb 2 2023 10:33 AM | Last Updated on Thu, Feb 2 2023 10:41 AM

Union Budget 2023: No Relief The Middle Class Expect - Sakshi

( ఫైల్‌ ఫోటో )

కేంద్ర బడ్జెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్‌లో మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌     

ఉద్యోగి
కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన  జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే  నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్‌ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  

సీనియర్‌ సిటిజన్‌
సీనియర్‌ సిటిజన్లకి నిర్మలా సీతారామన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీమ్‌ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్‌ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ  రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్‌ సిటిజన్లకి 50శాతం కన్సెషన్‌ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు.  

సొంతిల్లు
సొంతిల్లు అనేది మధ్య తరగతికి  కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్‌బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్‌లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు.  

మహిళ
ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్‌ కింద రెండు లక్షల వరకు డిపాజిట్‌ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం  బడ్జెట్‌లో గల్లంతైంది. గోల్డ్‌ బార్స్‌ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్‌ తగిలినట్టైంది.

విద్యార్థి
కోవిడ్‌–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది.  బడిముఖం చూడకుండా ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. 

నిరుద్యోగి
ఇది లే ఆఫ్‌ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్‌ స్లిప్‌ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్‌ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది.  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు.  

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్‌ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్‌లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్‌ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్‌ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్‌ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే  ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్‌ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement