కేంద్ర బడ్జెట్‌: చదివింపులు 1.12 లక్షల కోట్లు  | Union Budget 2023: Major Impetus To Education Sector | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌: విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు

Published Thu, Feb 2 2023 10:48 AM | Last Updated on Thu, Feb 2 2023 11:37 AM

Union Budget 2023: Major Impetus To Education Sector - Sakshi

న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి.

మేక్‌ ఏఐ ఇన్‌ ఇండియా, మేక్‌ ఏఐ వర్క్‌ ఫర్‌ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్‌లు ఏర్పాటవుతాయి. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  

జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్‌ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్‌ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్‌ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. 

మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ
వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్‌లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్‌’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్‌ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు.
ఏకలవ్య రెసిడెన్సియల్‌ స్కూళ్లకు బడ్జెట్‌లో రూ.5,943 కోట్లు కేటాయించారు.  

వజ్రాల తయారీ రీసెర్చ్‌కు గ్రాంట్‌  
ల్యాబ్‌ల్లో వజ్రాల తయారీ (ఎల్‌జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్‌ గ్రాంట్‌ అందచేస్తామని ప్రకటించారు.  

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0
విద్యా రంగంలో డిజిటల్‌ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేయటాన్ని ఎడ్‌టెక్‌ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్‌ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివర్ణిస్తున్నాయి. డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు ఎడ్‌టెక్‌ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్‌ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్‌ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాధాన్యతకు బడ్జెట్‌లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్‌టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్‌ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సహ వ్యవస్థాపకుడు అమోద్‌ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు కృషి చేస్తాయని ఫిజిక్స్‌వాలా కో ఫౌండర్‌ ప్రతీక్‌ మహేశ్వరి పేర్కొన్నారు. 

మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయం 
న్యూఢిల్లీ: కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్‌లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన–నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు.  

మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి  
పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్‌ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్‌ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ(సీఏఆర్‌ఏ), నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌), నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం.  

పెట్టుబడి పరిమితి రెట్టింపు  
సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ పథకం(ఎస్సీఎస్‌ఎస్‌)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ సింగిల్‌ అకౌంట్‌లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్‌ అకౌంట్‌లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ లేకుండా వడ్డీ అందించే పథకాలు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement