Union Budget of India 2023-24
-
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
కేంద్ర బడ్జెట్: చదివింపులు 1.12 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్‌లు ఏర్పాటవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్‌లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు. ఏకలవ్య రెసిడెన్సియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.5,943 కోట్లు కేటాయించారు. వజ్రాల తయారీ రీసెర్చ్‌కు గ్రాంట్ ల్యాబ్‌ల్లో వజ్రాల తయారీ (ఎల్జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ అందచేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 విద్యా రంగంలో డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేయటాన్ని ఎడ్టెక్ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివర్ణిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఎడ్టెక్ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతకు బడ్జెట్లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు అమోద్ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు కృషి చేస్తాయని ఫిజిక్స్‌వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయం న్యూఢిల్లీ: కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు. మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం. పెట్టుబడి పరిమితి రెట్టింపు సీనియర్ సిటిజెన్ సేవింగ్ పథకం(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సింగిల్ అకౌంట్లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ అందించే పథకాలు. -
సోషల్ మీడియాను ముంచెత్తిన బడ్జెట్ మీమ్స్
2023–24 బడ్జెట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టు చేసిన మీమ్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి, సిగరెట్లపై వా రు చేసిన మీమ్స్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌గా ని లిచాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే ముందే మొదలైన మీమ్స్ హడావుడి... మధ్యతరగతికి ఆదాయపరిమితి పెంపు ప్రతిపాదనతో పతాక స్థాయికి చేరాయి. అలాగే సిగరెట్లపై 16% పన్ను పెంపు ప్రతిపాదనతో నిరాశ చెందిన పొగరాయుళ్లు పెట్టి న మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఐటీ పరిమితి పెంపు కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని నిర్మల ప్రకటించడంపై చాలా మంది నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ పన్ను విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూ మీమ్స్ పెట్టగా మరికొందరు మాత్రం తమకు ఏమీ అర్థం కాలేదన్న సంకేతాన్ని మీమ్స్ రూపంలో పోస్టు చేశారు. -
బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!
కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఉద్యోగి కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు. సొంతిల్లు సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు. మహిళ ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది. విద్యార్థి కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. నిరుద్యోగి ఇది లే ఆఫ్‌ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్‌లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది. -
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్‌లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్‌లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
Union Budget 2023: మురిసి ‘పడిన’ మార్కెట్!
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను అంతా స్వాగతించారు. కానీ, ఊహించని పరిణామాలతో మార్కెట్ లాభాలన్నీ ఆవిరైపోయాయి. అదానీ షేర్లు బేర్ గుప్పిట్లో చిక్కుకోవడంతో మార్కెట్ రోలర్ కోస్టర్‌ను తలపించింది. ముంబై: వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్ లాభాలను నిలుపుకోవడంలో స్టాక్ మార్కెట్ విఫలమైంది. కేంద్రమంత్రి ప్రసంగం ఆసాంతం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్‌లో 1,958 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 158 పాయింట్లు లాభంతో 59,708 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 619 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. ఆఖరికి 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద నిలిచింది. ద్వితీయార్థంలో నెలకొన్న అమ్మకాల సునామీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ప్రథమార్థంలో భారీ లాభాలు బడ్జెట్‌పై ఆశలతో ఉదయం సూచీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 451 పాయింట్ల లాభంతో 60001 వద్ద, నిఫ్టీ 17,812 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు, మూలధన వ్యయం భారీ పెంపు, ఎల్టీసీజీ పన్ను జోలికెళ్లకపోవడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ప్రథమార్థంలో సెన్సెక్స్ 1,223 పాయింట్లు ఎగసి 60,773 వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు దూసుకెళ్లి 17,662 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ కేంద్ర మంత్రి ప్రసంగం ఆసాంతం అనూహ్యమైన ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు ఆ జోరును నిలుపుకోలేకపోయాయి. ట్రేడింగ్ ద్వితీయార్థంలో అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు తలెత్తాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత చోటు చేసుకుంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,773) నుంచి 1,958 పాయింట్లు పతనమై 58,817 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గరిష్టం(17,972)నుంచి 619 పాయింట్లు క్షీణించి 17,353 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగొచ్చింది. అదానీ గ్రూప్ షేర్లు విలవిల... అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి నేపథ్యంలో క్రెడిట్ సూయిజ్ షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ గ్రూప్‌నకు చెందిన పది కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 26%, అదానీ పోర్ట్స్ 18%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అంబుజా సిమెంట్స్ 17%, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 6% క్షీణించాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% లోయర్ సర్క్యూట్ తాకాయి. బుధవారం ఒక్కరోజే ఈ గ్రూప్ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకుపైన జీవిత బీమా పాలసీలపై పన్ను విధింపుతో బీమా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్ఐసీ 4%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 7%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6%, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రూ.10 లక్షల కోట్ల నిధుల కేటాయింపు మౌలిక సదుపాయాల కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగానికి చెందిన సైమన్స్ 4%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 3%, ఎల్అండ్టీ 1.50%, అశోక బిల్డ్‌కాన్ 1.21% చొప్పున లాభపడ్డాయి. ► సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో గోడ్ఫ్రే ఫిలిప్స్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, వీటీఎస్ ఇండస్ట్రీస్ షేర్లు 6%, 3.50%, మూడుశాతం నష్టపోయాయి. మరోవైపు గోల్డెన్ టొబాకో 4.58%, ఐటీసీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రియల్టీ, రైల్వే రంగ షేర్లు ప్రథమార్థంలో భారీగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్ పతనంలో భాగంగా ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతం, రైల్వే షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి తాజా బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో సిమెంట్ రంగ షేర్లు బలపడ్డాయి. ఇండియా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, శ్రీరాం సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 4–1% చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ బడ్జెట్‌పై లేవు. వినియోగ ప్రాధాన్యత, మూలధన వ్యయం పెంపుతో తొలి దశలో ఆశావాదంతో ట్రేడయ్యాయి. బుల్స్ మెచ్చిన బడ్జెట్ ఇది. అయితే అదానీ గ్రూప్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడికి అప్రమత్తత సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. – ఎస్ రంగనాథన్, ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ -
Union Budget 2023-24: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 5 కి తగ్గింపు 0-3 లక్షల వరకు పన్నులేదు రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఊరట కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ
సాక్షి, ఢిల్లీ: దేశ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది కేంద్రం. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. అమృత కాల బడ్జెట్లో భాగంగా.. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్‌ను తీసుకొస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్ఎంసీ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్‌తో అనుసంధానం చేయడం ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏమేర ఉండబోనుందనేది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. PM Vishwa Karma Kaushal Samman For the first time package of assistance for traditional artisans and craftspeople has been conceptualized, which will enable them to improve the quality, scale, and reach of their products, integrating with the MSME value chain#AmritKaalBudget pic.twitter.com/u2m4k6wAls — PIB India (@PIB_India) February 1, 2023 -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్.. ముగిసిన తొలిరోజు సెషన్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెషన్ ముగిసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అమృతకాలంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు రూపాయి రాక.. ►2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు ►మొత్తం టాక్స్‌ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు ►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు ►ఇన్‌కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు ►GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57లక్షల కోట్లు రూపాయి పోక.. ►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు ►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు ►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు ►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు వేతన జీవులకు ఊరట ►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు ►ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను ►0-3 లక్షల వరకు నిల్ ► 3 - 6 లక్షల వరకు 5% పన్ను ►6 - 9 లక్షల వరకు 10% పన్ను ►9 -12 లక్షల వరకు 15% పన్ను ►12- 15 లక్షల వరకు 20% పన్ను ►రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను ►రూ.9లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు ►రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలు ►2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి ►దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి ►ఎంఎస్ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు ►బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి ►మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీ ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు ►సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు ►ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం ►వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు ►2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం ►గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్‌లో తయారయ్యాయి.. ►భారత్‌లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు ►లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు ►తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ►టీవీ ప్యానల్స్‌పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు: నిర్మల ►రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు ►మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీ ప్యాడ్లు ► నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు ►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు ►లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు ►గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు ►సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు ►తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత ►మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి ►వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు.. ►యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ►రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు ►50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్ధరణ ►ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యత ►నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ ►ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ.10వేల కోట్లు ►మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం ►ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు ►5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్‌ల ఏర్పాటు ►2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం ►త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట ►కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం ►రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు ►పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం ►మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు ►సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.. ►నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం ►వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్‌కార్డ్, డిజీలాక్ ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ ►సమ్మిళిత అభివృద్ధి ►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు ►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట ►పర్యావరణ అనుకూల అభివృద్ధి ►యువ శక్తి ►పటిష్టమైన ఆర్థిక రంగం ► మిల్లెట్లతో ఆరోగ్య జీవితం.. శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్ హబ్‌గా భారత్‌ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు. ► ఆరోగ్యమే మహాభాగ్యం.. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ► 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ► భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు. ► పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ►75 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్ ►కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ►ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ►ప్రపంచ వేదికపై భారత్ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి ►ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ ►ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది. ►11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం ►భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు ►2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగింపు ►మా ప్రాధాన్యత అంశాలు యువతకు ప్రాధాన్యత, అభివృద్ధి-ఉద్యోగాల కల్పన, సుస్థిరత మా లక్ష్యం ►మహిళల ఆర్థిక స్వావలంబన మా ప్రాధాన్యత అంశం ►రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ►వృత్తి కళాకారులకు మరింత చేయూత ►11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం ►గ్రీన్ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత ►జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ►యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ►క్లీన్‌ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు ►చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ►ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత ►చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు ►ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి ►సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్ ►2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక ►50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు ►రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు ►మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ►మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు ►18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం ►చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ ►ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం ►దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్ కో ఆపరేటివ్ డాటాబేస్ ►సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు ►ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం ►ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ ►740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన ►ఏకలవ్య స్కూల్స్‌లో 38,800 టీచర్ల నియామకం ►2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►ప్రారంభమైన పార్లమెంట్ ► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్ ద్వారా భారీగా ఊరట ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు జనం. ► బడ్జెట్ 2023కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► బడ్జెట్ 2023-24.. బడ్జెట్‌కు ఆమోదం దృష్ట్యా కేంద్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు ► పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ►రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి ► కాసేపట్లో పార్టమెంట్‌కు ఆర్థికమంత్రి కేంద్ర పద్దుపై కోటి ఆశలతో జనం.. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి.. గత ఐదేళ్లుగా ఊరట దక్కని వర్గాలు.. ఈసారి బడ్జెట్‌పై అంచనాలు పెంచుకున్నాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. రాష్ట్రపతితో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంట్‌కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి నిర్మల. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతికి బడ్జెట్ సమాచారం ఇస్తారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)