Devananda: ఇలాంటి కూతురు ఉండాలి! | Devananda:17-year-old from Kerala donates part of her liver to save ailing father | Sakshi
Sakshi News home page

Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!

Published Tue, Feb 21 2023 12:25 AM | Last Updated on Tue, Feb 21 2023 12:25 AM

Devananda:17-year-old from Kerala donates part of her liver to save ailing father - Sakshi

తండ్రికే తల్లి అయిన కూతురు దేవనంద

‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి!

కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్‌ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్‌... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్‌ కేన్సర్‌. వైద్యం అంటూ లేదు... లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు.

ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్‌ వారు మీరు డోనర్‌ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్‌ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్‌ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు.

మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్‌ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్‌ యాక్ట్‌ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్‌నెట్‌ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్‌ డొనేట్‌ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్‌ నుంచి ఆర్గాన్‌ డొనేషన్‌ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది.

జడ్జి పూనుకొని
హైకోర్టులో జస్టిస్‌ వి.జి.ఆరుణ్‌ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్‌ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్‌ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్‌ వి.జి.అరుణ్‌ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్‌ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు.

అన్ని విధాలా సిద్ధమయ్యి
ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్‌ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్‌ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్‌ జరిగిన రాజగిరి హాస్పిటల్‌ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్‌ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్‌ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్‌ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement