ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది.
‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది...
తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు.
ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్‌మెంట్‌ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు.
కట్ చేస్తే...
2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది.
నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్‌లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్‌టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది.
కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది.
పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్‌లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్‌లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి.
గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్‌లు, రిటైలర్‌లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది.
‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment