జిల్లాలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జీవితంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆశలు అడియాశలు అవుతున్నాయి. లబ్ధిదారులు మాత్రం అటు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక.. ఇటు వారు నివాసముంటున్న ఇళ్లకు అద్దెలు చెల్లించుకోలేక నలిగిపోతున్నారు. ఇళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు.
-న్యూస్‌లైన్, రాయచోటి
రాయచోటి,న్యూస్‌లైన్:
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ మొత్తానికే సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించారు. పథకం కింద జిల్లాలోని రాయచోటిలో 550, రాజంపేటలో 220 ఇళ్లతో రాజీవ్ స్వగృహ కాలనీల నిర్మాణం గత నాలుగేళ్లుగా సాగుతోంది. ఈ పథకం కింద రాయచోటిలో మొత్తం 550 ఇళ్లకు గాను 120 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రమే ప్రారంభించారు.
ఈ పనులను ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. రాయచోటి వెంచర్‌లోని 120 గృహాల నిర్మాణానికి కేవలం 20 మంది కూలీలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సంస్థ రాజంపేట పట్టణంలో గృహ నిర్మాణ పనులను సైతం సంవత్సరాల తరబడి సాగిస్త్తుండటం గమనార్హం. ఇక్కడి లబ్ధిదారుల వద్ద వ సూలు చేసిన మొత్తంతో రాజీవ్ స్వగృహ ఎండీ శాలినీమిశ్రా హైదరాబాద్ శివార్లలో కోట్లు విలువచేసే బహుళ అంతస్తులను నిర్మించారు.
వాటిని విక్రయించి వచ్చిన మొత్తంతో జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. కానీ వాటిని కొనుగోలు చేసే నాధుడే లేకపోవడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం స్వగృహకు ’.105కోట్ల వడ్డీతో కూడిన రుణాన్ని మంజూరు చేసి సగానికిపైగా పనులు జరిగిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇలా ప్రభుత్వ నిధులతో తిరిగి రాయచోటి, రాజంపేట వెంచర్‌ల పనులను ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుని మొదలు పెట్టింది. సకాలంలో బిల్లులు రాకపోవడం, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణం పనులు నత్తనడకన సాతున్నాయి.
స్వగృహ కాలనీ పనులు నత్తనడకన సాగుతుండటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ గృహాల నిర్మాణం జరిగినంతవరకు అయిన డబ్బులను పట్టుకుని మిగిలిన ఖర్చును తమకు యిచ్చేయండంటూ గత నెలలో స్వగృహ ఎండీ దేవానందంను నిలదీశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ డిసెంబరు లోపు నిర్మాణం పూర్తిచేసి ఇళ్లను అప్ప చెబుతామన్నారు. లేనిపక్షంలో మీకు కేటాయించిన గృహాల నిర్మాణానికి ఖర్చుచేసిన మొత్తాన్ని పట్టుకుని మిగిలినది వెనక్కు యిచ్చేస్తాం మీరే ఇళ్లను నిర్మించుకోండని చెప్పారని లబ్ధిదారులు చెబుతున్నారు.
10 రోజుల్లో ఖర్చును లెక్కగట్టి ఇళ్లను అప్పగిస్తామని లబ్ధిదారుల నుంచి సమ్మతి పత్రాలను తీసుకెళ్లిన అధికారులు ఇంతవరకు వారి ఇళ్లకు అయిన ఖర్చును లెక్కగట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇళ్లనిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లక్షల్లో తీసుకున్న రుణానికి కంతులు చెల్లించలేకపోగా ఈ రుణానికి తిరిగి ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా స్వగృహ అధికారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తమ కేటాయించిన గృహాలను సమంజసమైన రేట్లకే తమకు అప్పజెప్పాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రూ.1.60 లక్షలు వడ్డీచెల్లించా
స్వగృహలో క్లాసిక్ మోడల్ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రూ.15లక్షలు అప్పు తీసుకున్నాం. ఈ అప్పుకు ఇప్పటివరకు రూ.1.60లక్షల వడ్డీ చెల్లించాను. ఒకవైపు వడ్డీ, మరోవైపు బాడుగ ఇంటికి అద్దె చెల్లించలేక అల్లాడుతున్నాం. వెంటనే మాకు కేటాయించిన గృహాన్ని పూర్తిచేసి అప్పజెప్పాలి.
-రామానుజం, లబ్ధిదారు
మీచేత కాకపోతే మేమే నిర్మించుకుంటాం మాకు కేటాయించిన ఇళ్లను పూర్తిచేయడం రాజీవ్ స్వగృహ అధికారులకు చేతకాకపోతే వెంటనే మాకు అప్పజెప్పాలి. నిర్మించినంతవరకు ఇంటి విలువను లెక్కగట్టి మేము చెల్లించిన మొత్తంలో పట్టుకుని మిగిలిన సొమ్మును, గృహాన్ని మాకు అప్పజెపితే మేమే నిర్మించుకుంటాం.
రవీంద్రనాథబాబు, లబ్ధిదారు
ఆర్థికంగా చితికిపోయాం
స్వగృహలో ఇంటినిర్మాణం కోసం అవసరమైన డిపాజిట్టు చెల్లింపునకు అవసరమైన డబ్బుకోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాం. ఇదే సమయంలో గృహనిర్మాణాల కోసం బ్యాంకు మంజూరు చేసిన రుణాలకు వడ్డీలు, ఇళ్ల అద్దెలు కట్టలేక సతమతమవుతున్నాం.
మృత్యుంజయరాజు, లబ్ధిదారు .