Rajiv swagruha houses
-
‘స్వగృహ’ సాఫ్!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇళ్లలో మిగలిపోయిన ఫ్లాట్లను, ఖాళీ స్థలాలన్నింటినీ అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వేగంగా కసరత్తు చేస్తోంది. గతంలో అమ్ముడు పోగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను, మరిన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూములను అమ్మడం ద్వారా కనీసం రూ.3500 కోట్లను సమీకరించుకోనున్నట్టు అంచనా. అసంపూర్తి ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆ ఫ్లాట్లకు ధరలను నిర్ణయించేందుకు గతంలో వేసిన కమిటీ ఆయా ఇళ్ల పరిస్థితి, అక్కడి మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలను సిఫార్సు చేస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అధికారికంగా ధరలను వెల్లడించి లాటరీ పద్ధతిలో ఇళ్లను విక్రయించనుంది. భూములు, ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. ప్రస్తుతం నగరంలోని పోచారం, నాగోలు సమీపంలోని బండ్లగూడ, గాజులరామారం, జవహర్‌నగర్, ఖమ్మం పట్టణ శివారు మున్నేరు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న ఖాళీ భూములు 136 ఎకరాల వరకు ఉన్నాయి. కామారెడ్డి, కవాడిపల్లి, పేట్‌బïÙరాబాద్, పోలేపల్లి, తట్టిఅన్నారం, నల్గొండ, కోకట్ తదితర ప్రాంతాల్లో భూములున్నాయి. ఖాళీ భూములతోపాటు 361 అసంపూర్తి ఇళ్లు కూడా వీటిల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో 1342 ప్లాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం చిన్నచిన్న పనులు, మరమ్మతులు మినహా మిగతా మొత్తం సిద్ధంగా ఉన్న ఇళ్లు నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్ దారిలోని పోచారం, ఖమ్మంలలో మాత్రమే ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు బండ్లగూడలో 105, పోచారంలో 255, 2బీహెచ్‌కే ఇళ్లు బండ్లగూడలో 19, పోచారంలో 340 ఉన్నాయి. 3బీహె చ్‌కే ఫ్లాట్లు బండ్లగూడలో 8, పోచారంలో 4, 3బీహెచ్‌కే డీలక్స్ ఫ్లాట్లు బండ్లగూడలో 3, పోచారంలో 4, సీనియర్ సిటిజన్స్ ఫ్లాట్లు బండ్లగూడ 24 సిద్ధంగా ఉన్నాయి. గాజులరామారంలో 408 అసంపూర్తి ఫ్లాట్లున్నాయి. ఒక్కోటి 8 అంతస్తులుగా ఉన్న 5 టవర్లు ఇక్కడున్నాయి. వీటిల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లవి 3 టవర్లు, 2బీహెచ్‌కే ఫ్లాట్లవి 2 టవర్లు ఉన్నాయి. పోచారంలో పూర్తయిన ఇళ్లకు సంబంధించి జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన 19 టవర్లుంటే, చాలా పనులు చేసుకోవల్సిన అసంపూర్తి ఇళ్ల టవర్లు ఎనిమిది ఉన్నాయి. గతేడాది రెండు టవర్లను అమ్మగా ఇంకా ఆరున్నాయి. వీటిల్లో పైకప్పులు నిర్మించినవి 376 ఉన్నాయి. మిగతా టవర్లలో పైకప్పులు నిర్మిస్తే మొత్తం 694 ఫ్లాట్లు అందుబాటు లోకి వస్తాయి. జవహర్‌నగర్‌లో 9 అంతస్తుల 17 టవర్లు ఉన్నాయి. వీటిల్లో 2856 ఫ్లాట్లున్నాయి. టవర్ల మధ్యలో 19 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఖమ్మం పట్టణం శివారులోని మున్నేరు కాలువ ఒడ్డు ప్రాంతంలో జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన ఎనిమిది టవర్లు నిర్మించారు. వీటిల్లో 3బీహెచ్‌కే సాధారణ ఫ్లాట్లతో కూడినవి నాలుగుంటే, 3బీహెచ్‌కే డీలక్స్ ఇళ్లతో కూడినవి నాలుగున్నాయి. వీటిల్లో 576 ఫ్లాట్లున్నాయి. ఫ్లాట్లలో ప్లాస్టరింగ్ పూర్తయి సిద్ధంగా వున్నాయి. ఇతర ఫిట్టింగ్స్ డ్రైనేజీ, రోడ్లులాంటి వసతులు కల్సించాల్సి ఉంది. మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువే ఆయా ప్రాంతాల్లో భూమి ధర, ఇళ్ల ప్రస్తుత కండిషన్ ఆధారంగా చదరపు అడుగు ధరను నిర్ణయిస్తూ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. అది తేలగానే ఇళ్ల అమ్మకపు ప్రకటన వెలువడనుంది. గతేడాది పోచారంలో చ.అ. ధర రూ.1650 చొప్పున ఖరారు చేశారు. వాటిని కొన్నవారు చ.అ.కు రూ.1050 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. వెరసి ఒక్కో ఫ్లాట్ చ.అ. ధర రూ. 2700గా పలికినట్టయింది. ఆ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణదారులు రూ. 4500 నుంచి రూ.5 వేలు చొప్పున అమ్ముతున్నారు. గాజులరామారంలో గతేడాది చ.అ.కు రూ.1600 చొప్పున కొన్నవారు చ.అ.కు మరో రూ.1150 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో మార్కెట్‌ధర దాదాపు రూ.6500 పలుకుతోంది. ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే ధరలను నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. పాత ధరలకు 5 శాతం వరకు కలిపి కొత్త ధరలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. 35శాతం వరకు తక్కువ ధరలకే..ఇళ్లను కొనుక్కున్నవారు సొంతంగా ఖర్చు చేసి మిగతా పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 35 శాతం వరకు తక్కువ ధరలకే ఇళ్లు సొంతమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఇళ్లను తమకు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన తపాలాశాఖ, ఎఫ్‌సీఐ, ఆదాయపన్ను శాఖ ఉద్యోగులతోపాటు అటవీ శాఖ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకేసారి ఫ్లాట్ల టవర్లను గంపగుత్తగా కొనుగోలు చేసి, ప్రైవేటు సంస్థలతో పనులు చేయించుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని వారు భావిస్తున్నారు. -
విక్రయానికి రాజీవ్ స్వగృహ టవర్లు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏకు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోచారంలో 9 అంతస్తులవి నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ఫ్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈ నెల 30వ తేదీ నాటికి గడువు విధించారు. ఈ గడువు వరకు రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. -
గజం రూ.6 వేలు.. ఈ సారైనా అమ్ముడుపోయేనా..!
నల్లగొండ: రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్లో ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు అధికారులు మూడు విడత వేలం నిర్వహిస్తున్నారు. గతంలో గజం ధర రూ.7 వేలు ఉండగా.. ఈ సారి ధర రూ.6 వేలకు తగ్గించారు. ఇప్పటికే ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. అయితే గత రెండు విడతల్లో ప్లాట్లు పెద్దగా అమ్ముడుపోకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తొలి విడతలో మెరుగు నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదురుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని ఇండ్లు నిర్మించింది. కొన్ని ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తోంది. మార్చి 14 నుంచి 4 రోజులçపాటు మొదటి విడతలో 340 ప్లాట్లను వేలానికి పెట్టింది. అప్పట్లో ఓపెన్ ప్లాట్ ధర గజం రూ.10 వేలుగా నిర్ణయించడం, చుట్టుపక్కల వెంచర్లో రూ.5 వేలకు గజం దొరుకుతుండడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘రాజీవ్ స్వగృహ పాట్ల కొనుగోలుకు స్పందన కరువు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ధర తగ్గించాలని కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపారు. దీంతో గజం ధరను రూ.7 వేలకు కుదించారు. మొదటి విడతలో 165 ప్లాట్లు అమ్ముడుపోగా.. రూ.31.79 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అధికారులపై ఒత్తిడి.. జూన్‌లో 2వ విడత వేలం నిర్వహించారు. ప్లాట్లు అమ్మించేందుకు జిల్లా స్థాయి అధికారులపై రాష్ట్రస్థాయి అధికారుల ఒత్తిడి తెచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలు, మిల్లర్లు, ఇతర ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన యజమానులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టులు చేసే వారితో అధికారులు సమావేశం నిర్వహించి ప్లాట్లు కొనాలని సూచించారు. ఒకొక్కరు 5, 6 ప్లాట్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి కూడా తెచ్చారు. ఈలోపు కలెక్టర్ బదిలీ కావడంతో పెద్దగా స్పందన రాలేదు. కేవలం 20 వరకు ప్లాట్లు కొన్ని గృహాలను మాత్రమే అమ్మగలిగారు. తగ్గిన కనీస ధర శ్రీవల్లీ టౌన్‌షిప్‌కు ప్లాట్ల విక్రయానికి ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు మూడో విడత వేలం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ప్రీ బిడ్ సమావేశం కూడా నిర్వహించారు. ఓపెన్‌ప్లాట్లకు గజం రూ.6 వేలు, పాక్షికంగా నిర్మాణ గృహాల్లో.. నిర్మాణ దశను బట్టి రూ.6 వేల నుంచి రూ.10,500 వరకు ధర నిర్ణయించారు. వేలం పాల్గొన్నవారు రూ.10 వేల డీడీ చెల్లించి దరఖాస్తుతో ఒక్కరోజు ముందు కార్యాలయంలో సమర్పించి టోకెన్ తీసుకొని వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ధర తగ్గించిన నేపథ్యంలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు చర్చించుకుంటున్నారు. -
తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు,రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 3,271 ఫ్లాట్లు హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు. లాటరీ సిస్టమ్‌లో స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే ఓఆర్ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. -
వేలానికి స్వగృహ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: అమ్ముడుపోకుండా ఏళ్లుగా పాడుబడ్డ గూళ్ల తరహాలో ఉండిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వ కార్యదర్శులతో ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీని నియమించింది. గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘ఉన్నవి ఉన్నట్టుగా’బండ్లగూడ, పోచారంలలో ఉన్న గృహ సముదాయాలను వేలం ద్వారా అమ్మేయనున్నారు. ఆ ఇళ్లకు ఏ ధర నిర్ణయించాలో తేల్చేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న సంస్థను కన్సల్టెంటుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. కాగా, ఇప్పటికే కొన్ని ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ ఇళ్లను గుండుగుత్తగా కొనేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. బండ్లగూడ, పోచారంలో దాదాపు నాలుగువేల ఇళ్లతో కూడిన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయి. గాజుల రామారం, జవహర్‌నగర్‌లలో అసంపూర్తి నిర్మాణాలు ఉన్నా, వాటి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
‘స్వగృహా’లపై కేంద్ర సంస్థల కన్ను
సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనేందుకు ఆసక్తి హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన అపార్ట్మెంట్లను టోకున కొనేందుకు కేంద్రప్రభుత్వరంగ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌లలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ మూడు చోట్ల కలిపి 8 వేల అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో కొన్ని బ్లాక్లవద్ద మౌలిక వసతుల కల్పన పూర్తయినా... మిగతా చోట్ల సిద్ధం కాలేదు. దీంతో వాటిని కొనేందుకు సాధారణ ప్రజలు ఉత్సాహం చూపడం లేదు. ఉమ్మడి రాష్ట్రం లో ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపకపోవడం, సరైన పర్యవేక్షణ లేక కార్పొరేషన్ అప్పుల్లో మునిగి దివాళా తీయడంతో సొంత వనరులు లేక పనులు ముందు కు సాగలేదు. దీంతో సీఆర్పీఎఫ్ సహా మరికొన్ని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు అపార్ట్మెంట్లను బల్క్‌గా కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. గతంలో ముందుకొచ్చినా... శివారులోని జవహర్‌నగర్‌లో దాదాపు 2800 అపార్ట్మెంట్లతో భారీ గృహసముదాయం సిద్ధమైంది. మౌలిక వసతుల కల్పించి, తుదిమెరుగులు చేయకపోవడంతో దాదాపు రెండేళ్లుగా వృథాగా ఉంది. దీనికి సమీపంలోని ఆల్వాల్‌లో సీఆర్పీఎఫ్ అనుబంధ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ప్రధాన కేంద్రం ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలంతా ఒకేచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గృహసముదాయాన్ని కొనుగోలు చేసేందుకు సీఆర్పీఎఫ్ ఆసక్తి చూపి నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని సంప్రతించింది. అయితే ఈ గృహసముదాయాన్ని వీలైనంత చవకగా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొంతలాభం చూసుకునే ఆలోచనతో ఓ ఉన్నతాధికారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఆర్పీఎఫ్ అధికారులకు సహకరించకపోగా... సమీపంలోనే డంపింగ్‌యార్డు ఉన్నందున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదరగొట్టారు. దీంతో ఆ బేరం కాస్తా ఎత్తిపోయింది. స్వగృహకు అప్పులిచ్చిన కొన్ని బ్యాంకులు కూడా తమ సిబ్బంది కోసం అపార్ట్మెంట్లు కొనేందుకు యత్నించినా ఆ అధికారి కుదరనివ్వలేదు. బ్యాంకులకు ఇళ్లను అమ్మితే అప్పుకూడా తీరిపోయినట్టవుతుంది. ప్రైవేటు సంస్థలకు ఆ ఇళ్లను అమ్మేసేందుకు అవకాశం కావాలంటూ రాష్ట్రం విడిపోయేందుకు కొద్దిరోజుల ముందు స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు సర్కారు కూడా అంగీకరించింది. ఇదే అదనుగా ఆ ఇళ్లను ప్రైవేటు నిర్మాణ సంస్థలకు ఎంతోకొంతకు అప్పగించే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి సీఆర్పీఎఫ్, బ్యాంకులు వాటిపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎనిమిదివేల వరకు అపార్ట్మెంట్లతో కూడి మూడు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నందున వాటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆరే గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్నందున త్వరలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. కాగా, స్వగృహ కార్పొరేషన్‌ను ఉన్నదున్నట్టుగా కొనసాగించొద్దని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. దాన్ని హౌసింగ్‌బోర్డులో విలీనం చేసే అవకాశం కూడా లేకపోలేదు. -
అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపం
జిల్లాలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జీవితంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆశలు అడియాశలు అవుతున్నాయి. లబ్ధిదారులు మాత్రం అటు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక.. ఇటు వారు నివాసముంటున్న ఇళ్లకు అద్దెలు చెల్లించుకోలేక నలిగిపోతున్నారు. ఇళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. -న్యూస్‌లైన్, రాయచోటి రాయచోటి,న్యూస్‌లైన్: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ మొత్తానికే సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించారు. పథకం కింద జిల్లాలోని రాయచోటిలో 550, రాజంపేటలో 220 ఇళ్లతో రాజీవ్ స్వగృహ కాలనీల నిర్మాణం గత నాలుగేళ్లుగా సాగుతోంది. ఈ పథకం కింద రాయచోటిలో మొత్తం 550 ఇళ్లకు గాను 120 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రమే ప్రారంభించారు. ఈ పనులను ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. రాయచోటి వెంచర్‌లోని 120 గృహాల నిర్మాణానికి కేవలం 20 మంది కూలీలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సంస్థ రాజంపేట పట్టణంలో గృహ నిర్మాణ పనులను సైతం సంవత్సరాల తరబడి సాగిస్త్తుండటం గమనార్హం. ఇక్కడి లబ్ధిదారుల వద్ద వ సూలు చేసిన మొత్తంతో రాజీవ్ స్వగృహ ఎండీ శాలినీమిశ్రా హైదరాబాద్ శివార్లలో కోట్లు విలువచేసే బహుళ అంతస్తులను నిర్మించారు. వాటిని విక్రయించి వచ్చిన మొత్తంతో జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. కానీ వాటిని కొనుగోలు చేసే నాధుడే లేకపోవడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం స్వగృహకు ’.105కోట్ల వడ్డీతో కూడిన రుణాన్ని మంజూరు చేసి సగానికిపైగా పనులు జరిగిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇలా ప్రభుత్వ నిధులతో తిరిగి రాయచోటి, రాజంపేట వెంచర్ల పనులను ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుని మొదలు పెట్టింది. సకాలంలో బిల్లులు రాకపోవడం, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణం పనులు నత్తనడకన సాతున్నాయి. స్వగృహ కాలనీ పనులు నత్తనడకన సాగుతుండటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ గృహాల నిర్మాణం జరిగినంతవరకు అయిన డబ్బులను పట్టుకుని మిగిలిన ఖర్చును తమకు యిచ్చేయండంటూ గత నెలలో స్వగృహ ఎండీ దేవానందంను నిలదీశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ డిసెంబరు లోపు నిర్మాణం పూర్తిచేసి ఇళ్లను అప్ప చెబుతామన్నారు. లేనిపక్షంలో మీకు కేటాయించిన గృహాల నిర్మాణానికి ఖర్చుచేసిన మొత్తాన్ని పట్టుకుని మిగిలినది వెనక్కు యిచ్చేస్తాం మీరే ఇళ్లను నిర్మించుకోండని చెప్పారని లబ్ధిదారులు చెబుతున్నారు. 10 రోజుల్లో ఖర్చును లెక్కగట్టి ఇళ్లను అప్పగిస్తామని లబ్ధిదారుల నుంచి సమ్మతి పత్రాలను తీసుకెళ్లిన అధికారులు ఇంతవరకు వారి ఇళ్లకు అయిన ఖర్చును లెక్కగట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇళ్లనిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లక్షల్లో తీసుకున్న రుణానికి కంతులు చెల్లించలేకపోగా ఈ రుణానికి తిరిగి ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా స్వగృహ అధికారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తమ కేటాయించిన గృహాలను సమంజసమైన రేట్లకే తమకు అప్పజెప్పాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రూ.1.60 లక్షలు వడ్డీచెల్లించా స్వగృహలో క్లాసిక్ మోడల్ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రూ.15లక్షలు అప్పు తీసుకున్నాం. ఈ అప్పుకు ఇప్పటివరకు రూ.1.60లక్షల వడ్డీ చెల్లించాను. ఒకవైపు వడ్డీ, మరోవైపు బాడుగ ఇంటికి అద్దె చెల్లించలేక అల్లాడుతున్నాం. వెంటనే మాకు కేటాయించిన గృహాన్ని పూర్తిచేసి అప్పజెప్పాలి. -రామానుజం, లబ్ధిదారు మీచేత కాకపోతే మేమే నిర్మించుకుంటాం మాకు కేటాయించిన ఇళ్లను పూర్తిచేయడం రాజీవ్ స్వగృహ అధికారులకు చేతకాకపోతే వెంటనే మాకు అప్పజెప్పాలి. నిర్మించినంతవరకు ఇంటి విలువను లెక్కగట్టి మేము చెల్లించిన మొత్తంలో పట్టుకుని మిగిలిన సొమ్మును, గృహాన్ని మాకు అప్పజెపితే మేమే నిర్మించుకుంటాం. రవీంద్రనాథబాబు, లబ్ధిదారు ఆర్థికంగా చితికిపోయాం స్వగృహలో ఇంటినిర్మాణం కోసం అవసరమైన డిపాజిట్టు చెల్లింపునకు అవసరమైన డబ్బుకోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాం. ఇదే సమయంలో గృహనిర్మాణాల కోసం బ్యాంకు మంజూరు చేసిన రుణాలకు వడ్డీలు, ఇళ్ల అద్దెలు కట్టలేక సతమతమవుతున్నాం. మృత్యుంజయరాజు, లబ్ధిదారు .