‘స్వగృహా’లపై కేంద్ర సంస్థల కన్ను
సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనేందుకు ఆసక్తి
హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన అపార్ట్‌మెంట్లను టోకున కొనేందుకు కేంద్రప్రభుత్వరంగ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌లలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ మూడు చోట్ల కలిపి 8 వేల అపార్ట్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో కొన్ని బ్లాక్‌లవద్ద మౌలిక వసతుల కల్పన పూర్తయినా... మిగతా చోట్ల సిద్ధం కాలేదు. దీంతో వాటిని కొనేందుకు సాధారణ ప్రజలు ఉత్సాహం చూపడం లేదు. ఉమ్మడి రాష్ట్రం లో ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపకపోవడం, సరైన పర్యవేక్షణ లేక కార్పొరేషన్ అప్పుల్లో మునిగి దివాళా తీయడంతో సొంత వనరులు లేక పనులు ముందు కు సాగలేదు. దీంతో సీఆర్‌పీఎఫ్ సహా మరికొన్ని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు అపార్ట్‌మెంట్లను బల్క్‌గా కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
గతంలో ముందుకొచ్చినా...
శివారులోని జవహర్‌నగర్‌లో దాదాపు 2800 అపార్ట్‌మెంట్లతో భారీ గృహసముదాయం సిద్ధమైంది. మౌలిక వసతుల కల్పించి, తుదిమెరుగులు చేయకపోవడంతో దాదాపు రెండేళ్లుగా వృథాగా ఉంది. దీనికి సమీపంలోని ఆల్వాల్‌లో సీఆర్‌పీఎఫ్ అనుబంధ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ప్రధాన కేంద్రం ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలంతా ఒకేచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గృహసముదాయాన్ని కొనుగోలు చేసేందుకు సీఆర్‌పీఎఫ్ ఆసక్తి చూపి నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని సంప్రతించింది. అయితే ఈ గృహసముదాయాన్ని వీలైనంత చవకగా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొంతలాభం చూసుకునే ఆలోచనతో ఓ ఉన్నతాధికారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఆర్‌పీఎఫ్ అధికారులకు సహకరించకపోగా... సమీపంలోనే డంపింగ్‌యార్డు ఉన్నందున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదరగొట్టారు. దీంతో ఆ బేరం కాస్తా ఎత్తిపోయింది. స్వగృహకు అప్పులిచ్చిన కొన్ని బ్యాంకులు కూడా తమ సిబ్బంది కోసం అపార్ట్‌మెంట్లు కొనేందుకు యత్నించినా ఆ అధికారి కుదరనివ్వలేదు. బ్యాంకులకు ఇళ్లను అమ్మితే అప్పుకూడా తీరిపోయినట్టవుతుంది. ప్రైవేటు సంస్థలకు ఆ ఇళ్లను అమ్మేసేందుకు అవకాశం కావాలంటూ రాష్ట్రం విడిపోయేందుకు కొద్దిరోజుల ముందు స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు సర్కారు కూడా అంగీకరించింది.
ఇదే అదనుగా ఆ ఇళ్లను ప్రైవేటు నిర్మాణ సంస్థలకు ఎంతోకొంతకు అప్పగించే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి సీఆర్‌పీఎఫ్, బ్యాంకులు వాటిపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎనిమిదివేల వరకు అపార్ట్‌మెంట్లతో కూడి మూడు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నందున వాటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆరే గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్నందున త్వరలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. కాగా, స్వగృహ కార్పొరేషన్‌ను ఉన్నదున్నట్టుగా కొనసాగించొద్దని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. దాన్ని హౌసింగ్‌బోర్డులో విలీనం చేసే అవకాశం కూడా లేకపోలేదు.