
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏకు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోచారంలో 9 అంతస్తులవి నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్‌లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ఫ్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది.
ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈ నెల 30వ తేదీ నాటికి గడువు విధించారు. ఈ గడువు వరకు రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment