‘స్వగృహ’ సాఫ్‌! | Telangana Govt Decision to sell all remaining Rajiv Homes vacant land | Sakshi
Sakshi News home page

‘స్వగృహ’ సాఫ్‌!

Published Mon, Sep 2 2024 5:26 AM | Last Updated on Mon, Sep 2 2024 5:26 AM

Telangana Govt Decision to sell all remaining Rajiv Homes vacant land

మిగిలిపోయిన ఇళ్లు,ఖాళీ భూములన్నింటినీ అమ్మాలని నిర్ణయం 

ఆ రూపంలో రూ.3500 కోట్లు కూడగట్టుకునే ప్రయత్నం 

వేగంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం  

కొత్త ధరలను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి కమిటీ నివేదిక 

త్వరలో అధికారికంగా వెల్లడించి అమ్మకపు ప్రకటన విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ స్వగృహ ఇళ్లలో మిగలిపోయిన ఫ్లాట్లను, ఖాళీ స్థలాలన్నింటినీ అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వేగంగా కసరత్తు చేస్తోంది. గతంలో అమ్ముడు పోగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను, మరిన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూములను అమ్మడం ద్వారా కనీసం రూ.3500 కోట్లను సమీకరించుకోనున్నట్టు అంచనా. అసంపూర్తి ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించింది. 

ఇందుకోసం ఆ ఫ్లాట్లకు ధరలను నిర్ణయించేందుకు గతంలో వేసిన కమిటీ ఆయా ఇళ్ల పరిస్థితి, అక్కడి మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా ధరలను సిఫార్సు చేస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అధికారికంగా ధరలను వెల్లడించి లాటరీ పద్ధతిలో ఇళ్లను విక్రయించనుంది. 

భూములు, ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. 
ప్రస్తుతం నగరంలోని పోచారం, నాగోలు సమీపంలోని బండ్లగూడ, గాజులరామారం, జవహర్‌నగర్, ఖమ్మం పట్టణ శివారు మున్నేరు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న ఖాళీ భూములు 136 ఎకరాల వరకు ఉన్నాయి. కామారెడ్డి, కవాడిపల్లి, పేట్‌బïÙరాబాద్, పోలేపల్లి, తట్టిఅన్నారం, నల్గొండ, కోకట్‌ తదితర ప్రాంతాల్లో భూములున్నాయి. ఖాళీ భూములతోపాటు 361 అసంపూర్తి ఇళ్లు కూడా వీటిల్లో ఉన్నాయి. 

రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో 1342 ప్లాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం చిన్నచిన్న పనులు, మరమ్మతులు మినహా మిగతా మొత్తం సిద్ధంగా ఉన్న ఇళ్లు నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్‌ దారిలోని పోచారం, ఖమ్మంలలో మాత్రమే ఉన్నాయి. సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు బండ్లగూడలో 105, పోచారంలో 255, 2బీహెచ్‌కే ఇళ్లు బండ్లగూడలో 19, పోచారంలో 340 ఉన్నాయి. 3బీహె చ్‌కే ఫ్లాట్లు బండ్లగూడలో 8, పోచారంలో 4, 3బీహెచ్‌కే డీలక్స్‌ ఫ్లాట్లు బండ్లగూడలో 3, పోచారంలో 4, సీనియర్‌ సిటిజన్స్‌ ఫ్లాట్లు బండ్లగూడ 24 సిద్ధంగా ఉన్నాయి. 

గాజులరామారంలో 408 అసంపూర్తి ఫ్లాట్లున్నాయి. ఒక్కోటి 8 అంతస్తులుగా ఉన్న 5 టవర్లు ఇక్కడున్నాయి. వీటిల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లవి 3 టవర్లు, 2బీహెచ్‌కే ఫ్లాట్లవి 2 టవర్లు ఉన్నాయి. పోచారంలో పూర్తయిన ఇళ్లకు సంబంధించి జీ ప్లస్‌ 9 అంతస్తులతో కూడిన 19 టవర్లుంటే, చాలా పనులు చేసుకోవల్సిన అసంపూర్తి ఇళ్ల టవర్లు ఎనిమిది ఉన్నాయి. గతేడాది రెండు టవర్లను అమ్మగా ఇంకా ఆరున్నాయి. వీటిల్లో పైకప్పులు నిర్మించినవి 376 ఉన్నాయి. 

మిగతా టవర్లలో పైకప్పులు నిర్మిస్తే మొత్తం 694 ఫ్లాట్లు అందుబాటు లోకి వస్తాయి. జవహర్‌నగర్‌లో 9 అంతస్తుల 17 టవర్లు ఉన్నాయి. వీటిల్లో 2856 ఫ్లాట్లున్నాయి. టవర్ల మధ్యలో 19 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఖమ్మం పట్టణం శివారులోని మున్నేరు కాలువ ఒడ్డు ప్రాంతంలో జీ ప్లస్‌ 9 అంతస్తులతో కూడిన ఎనిమిది టవర్లు నిర్మించారు. వీటిల్లో 3బీహెచ్‌కే సాధారణ ఫ్లాట్లతో కూడినవి నాలుగుంటే, 3బీహెచ్‌కే డీలక్స్‌ ఇళ్లతో కూడినవి నాలుగున్నాయి. వీటిల్లో 576 ఫ్లాట్లున్నాయి. ఫ్లాట్లలో ప్లాస్టరింగ్‌ పూర్తయి సిద్ధంగా వున్నాయి. ఇతర ఫిట్టింగ్స్‌ డ్రైనేజీ, రోడ్లులాంటి వసతులు కల్సించాల్సి ఉంది. 

మార్కెట్‌ ధరతో పోలిస్తే చాలా తక్కువే 
ఆయా ప్రాంతాల్లో భూమి ధర, ఇళ్ల ప్రస్తుత కండిషన్‌ ఆధారంగా చదరపు అడుగు ధరను నిర్ణయిస్తూ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. అది తేలగానే ఇళ్ల అమ్మకపు ప్రకటన వెలువడనుంది. గతేడాది పోచారంలో చ.అ. ధర రూ.1650 చొప్పున ఖరారు చేశారు. వాటిని కొన్నవారు చ.అ.కు రూ.1050 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. వెరసి ఒక్కో ఫ్లాట్‌ చ.అ. ధర రూ. 2700గా పలికినట్టయింది. 

ఆ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణదారులు రూ. 4500 నుంచి రూ.5 వేలు చొప్పున అమ్ముతున్నారు. గాజులరామారంలో గతేడాది చ.అ.కు రూ.1600 చొప్పున కొన్నవారు చ.అ.కు మరో రూ.1150 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో మార్కెట్‌ధర దాదాపు రూ.6500 పలుకుతోంది. ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే ధరలను నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. పాత ధరలకు 5 శాతం వరకు కలిపి కొత్త ధరలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. 
 
35శాతం వరకు తక్కువ ధరలకే..
ఇళ్లను కొనుక్కున్నవారు సొంతంగా ఖర్చు చేసి మిగతా పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని మార్కెట్‌ ధరలతో పోలిస్తే దాదాపు 35 శాతం వరకు తక్కువ ధరలకే ఇళ్లు సొంతమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఇళ్లను తమకు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన తపాలాశాఖ, ఎఫ్‌సీఐ, ఆదాయపన్ను శాఖ ఉద్యోగులతోపాటు అటవీ శాఖ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకేసారి ఫ్లాట్ల టవర్లను గంపగుత్తగా కొనుగోలు చేసి, ప్రైవేటు సంస్థలతో పనులు చేయించుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని వారు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement