జిల్లా ప్రజల్లో 2013 భయాన్ని నింపింది. భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని పైసాపైసా పోగు చేసిన అనేక మంది మధ్య తరగతి కుటుంబీకులు నిలువునా మోసపోయారు. ఆర్థిక నేరాలు, చోరీలు పెరిగిపోయాయి. హత్యలు, ప్రతీకార దాడులు పోలీసులకు సవాళ్లు విసిరాయి. అభద్రత నడుమ మహిళలు జీవించాల్సి వచ్చింది.
- న్యూస్‌లైన్, అనంతపురం క్రైం
అనంతపురంలో రౌడీషీటర్లు, కిరాయి హంతక ముఠా సభ్యులు పెట్రేగిపోయారు. కమ్యూనిస్టు నేత హత్యతో ప్రారంభమైన ఏడాది... ప్రతి నెలా ఒకటి, రెండు హత్యలతో కొనసాగింది.
జనవరి 1న అనంతపురంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున కమ్యూనిస్టు నేత, మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు.
మార్చి 4న ఇందిరానగర్‌లోని రైలు పట్టాలపై పెయింటర్ ప్రసాద్‌ను స్నేహితులే దారుణంగా హతమార్చారు. ఏప్రిల్ 2న సాక్షి ఉద్యోగి నరసింహులును పథకం ప్రకారం కిరాయి హంతక ముఠా నరికి చంపింది.
ఏప్రిల్ 7న ఎమ్మార్పీస్ నేత సిద్ధును బంధువులే హతమార్చారు. అక్టోబర్ 23న కేబుల్ ఆపరేటర్ అయూబ్‌ను ప్రత్యర్థులు హత్యచేశారు.
అభద్రత నడుమ అనంత మహిళా లోకం..
నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిలోపే జిల్లాలో పది కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులకు కాఫీ తెచ్చేందుకు హోటల్‌కు వెళ్లి న తొమ్మిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ‘అనంత’ మహిళా లోకాన్ని ఆందోళనకు గురి చేస్తే... మైనర్ బాలికను తల్లిని చేసి అసహజమైన పద్ధతిలో పిండాన్ని తొలగించి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెంచి తప్పించుకోవాలని చూసిన ఓ మానవ మృగాన్ని మహిళా సంఘాల ఒత్తిడితో ఉన్నతాధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
పెచ్చరిల్లిన ఆర్థిక నేరాలు
నవంబరు 19న ‘ది అనంతపురం టౌన్ కోఆపరేటివ్ బ్యాంకు’లో క్యాషియర్‌గా పనిచేసే రమేశ్‌రెడ్డి రాబరీకి తెగబడ్డాడు. రూ.13 లక్షల నగదును అపహరించి పట్టుబడ్డాడు. నవంబరు 30న మణప్పుఱం గోల్డ్‌లోన్ బ్యాంకులో అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసే విక్రమ్‌రావు తాకట్టు నగలను అపహరించినట్లు వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో రూ. 1.50 కోట్ల విలువైన బంగారు నగలు మాయమైనట్లు స్పష్టమైంది. జిల్లాలో నకిలీ నోట్లు చలామణి కూడా విచ్చలవిడిగా కొనసాగింది.
నేరాల చిట్టా ఇదిగో...
జిల్లా వ్యాప్తంగా చోరీల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్ ముఠాలు హల్‌చల్ చేశాయి. ఏడాది మొత్తం (డిసెంబర్ 27 వరకు) 6555 కేసులు నమోదు కాగా వీటిలో కిరాయి హత్యలు తొమ్మిది, దోపిడీలు 5, రాబరీలు 23, పగటి దొంగతనాలు 47, రాత్రి చోరీలు 210, సాధారణ, పశువుల దొంగతనాలు 572 జరిగాయి. ఈ ఏడాది రూ.5,40,25,222 విలువజేసే బంగారం, నగదును చోరులు తస్కరించారు. ఇందులో పోలీసులు రూ.3,31,06,830 విలువజేసే సొత్తును రికవరీ చేశారు. కాగా, 140 దాడులు, 53 కిడ్నాపులు, 105 లైంగికదాడులు, 25 తీవ్ర ఘాతుకాలు, 45 సాధారణ ఘాతుకాలు, 1321 మోసాలు, 147 నమ్మించి ద్రోహం చేసిన ఘటనలు, 6 నకిలీ కరెన్సీ కేసులు, 4 హత్యాయత్నాలు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై నిఘా సారించలేకపోయారు.
అవినీతి చేపలకు వల విసిరిన ఏసీబీ..
ఈ ఏడాదిలో రెండు సార్లు పెనుకొండ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నవంబరు 5న నంబులపూలకుంట మండల కేంద్రానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ జూనియర్ ఇంజినీర్ తులసీప్రసాద్, అక్టోబరు 26న హిందూపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్ అరుణకుమారి ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు. మార్చి 2న వరంగల్‌జిల్లా హన్మకొండ నుంచి కర్ణాటకలోని కోలార్‌కు ఏపీ36టీఏ 3362 వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తీసుకెళ్తుండగా ఆ వాహనం మిడుతూరు వద్ద ఆపిన డీసీటీఓ రమేశ్‌కుమార్‌రెడ్డి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు.
భయం నీడన జనం
Published Sat, Dec 28 2013 3:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement