మిడిల్‌ క్లాస్‌.. ఐపీఎస్‌ | Center Has Allotted 11 IPS Officers To Telangana. | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌.. ఐపీఎస్‌

Published Sun, Sep 6 2020 1:25 AM | Last Updated on Sun, Sep 6 2020 10:12 AM

Center Has Allotted 11 IPS Officers To Telangana. - Sakshi

‘కానిస్టేబుల్‌ కొడుకు ఐపీఎస్‌ అవుతాడా..! అంటూ ఎగతాళి’ ‘ఆటో డ్రైవర్‌ కొడుకుకు సివిల్స్‌ కోచింగ్‌ అవసరమా? అంటూ గేలి’ ‘వ్యవసాయదారుడి కుమారుడు పోలీసా?’ అంటూ ఆశ్చర్యం..’ ..వారి లక్ష్యం కోసం శ్రమిస్తున్న సమయంలో సమాజంలో చాలా మంది ఇలా వెనుక నుంచి వెక్కిరించినవారున్నారు. అలాంటి వారి అంచనాలు తప్పు అంటూ.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలంతా నేడు ఐపీఎస్‌ అధికారులయ్యారు. కల సాకారం చేసుకున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారులే మంచి ఉదాహరణ. సివిల్స్‌ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్‌నెట్‌ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్‌ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్‌ మహాజన్,బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్‌ చెన్నూరి.. అంతా లోకల్‌ బ్యాచ్‌. వీరిలో అఖిల్‌ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్‌. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్‌ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్‌ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది.

నాన్నే నాకు స్ఫూర్తి...
నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. నాన్న అప్పట్లో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌. కిట్స్‌లో ఇంజనీరింగ్‌ చేశా. నాన్నను చూసి చాలా స్ఫూర్తి పొందాను. అందుకే ఐపీఎస్‌ ఎంచుకున్నా. 2013లో డిగ్రీ అయ్యాక ఐపీఎస్‌ సాధించాలన్న కసి పెరిగింది. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకున్నా. ఎట్టకేలకు సాధించా. చాలా మంది కానిస్టేబుల్‌ కొడుకు ఐపీఎస్‌ అవ్వడమేంటి? అనుకున్నారు. కానీ నా కలముందు ఆ మాటలు చిన్నవైపోయాయి. లక్ష్యానికి పేదరికం అడ్డుకాదు. కల నెరవేరే దాకా వెనకడుగు వేయకండి. – రోహిత్‌రాజు

దూరవిద్యతో నెరవేరిన కల.. 
చిన్నప్పటి నుంచి ఐపీఎస్‌ నా కల. మాది మహబూబ్‌నగర్‌లో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌లోనే జాబ్‌ రావడంతో చేరాను. అయినా కల మీద మమ కారంతో దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. తరువాత ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. నిజాం కాలేజీలోనూ పాఠాలు బోధించా. ఏడోసారి సివిల్స్‌ రాసి ఎట్టకేలకు ఎంపికయ్యా.    – బాలస్వామి

లక్ష్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు..
మాది వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి. నాన్న ఆటోడ్రైవర్, హసన్‌పర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌లో చదివాను. 2013లో వరంగల్‌ కిట్స్‌లో ఇంజనీరింగ్‌ చేశా. తరువాత ఒక సంస్థలో ఉద్యోగం చేశాను. కానీ, ఏనాడూ నా లక్ష్యాన్ని మర్చి పోలేదు. ఆటోడ్రైవర్‌ కొడుకు ఐపీఎస్‌ చదవడమేంటని ఎంత మంది అనుకున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. – రూపేశ్‌ చెన్నూరి

ఎన్నడూ రాజీపడవద్దు...
మాది జమ్మూ. కుటుంబ నేపథ్యం వ్యాపారం. 2011లో హైదరాబాద్‌ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్‌  పూర్తిచేశా. తరువాత మైక్రోసాఫ్ట్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి ఐపీఎస్‌ నా కల. అందుకే  ఉద్యోగం వదిలేశా. 2013లో సివిల్స్‌ కోసం ప్రిపరేషన్‌  ప్రారంభించా. 2017లో సివిల్స్‌కు సెలక్టయ్యా. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏనాడూ రాజీపడవద్దు. – అఖిల్‌ మహాజన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement