Exide Life Insurance
-
14 నెలల్లోనే ఎక్సైడ్ లైఫ్ విలీనం పూర్తి
ముంబై: తమ అనుబంధ సంస్థ ఎౖక్సైడ్ లైఫ్‌ను రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో విలీనం చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో విభా పదల్కర్ తెలిపారు. సకాలంలో అనుమతులు ఇచ్చి తమకు ప్రోత్సాహం, మద్దతుగా నిలిచినందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ)తోపాటు, ఇతర నియంత్రణ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నమోదు చేసినట్టు ప్రకటించారు. ఎక్సైడ్ లైఫ్ విలీనానికి ముందు ఏపీఈ 11% వృద్ధి సాధించినట్టు చెప్పారు. పరిశ్రమకు అనుగుణంగానే తమ పనితీరు ఉందంటూ, లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించామని, మార్కెట్ వాటాను 14.6 శాతంనుంచి 15%పెంచుకున్నట్టు తెలిపారు. -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్
ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ఆవిష్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ సంజయ్ తివారీ తెలిపారు. సాధారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు, ఒకవేళ అప్పటికే రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకున్నా సరిపోకపోవచ్చని, స్థిరంగా మరో ఆదాయం కూడా ఉంటే సహాయకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్‌లో ఎన్హాన్స్డ్ ఇన్‌కం, ఎన్హాన్స్డ్ మెచ్యూరిటీ అని రెండు వేరియంట్స్ ఉంటాయని తివారీ తెలిపారు. ప్రీమియం చెల్లింపు వ్యవధితో పోలిస్తే పాలసీదారు ఆదాయం పొందే వ్యవధి రెట్టింపుగా ఉండటం, జీవిత బీమా కవరేజీ తదితర ప్రయోజనాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి తోడ్పడగలవన్నారు. చదవండి: తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. -
యులిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం పాలసీదారులు తమ ఆర్థిక అవసరాలు, లక్ష్యాల సాధన కోసం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్‌లు), గ్యారంటీ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తాము ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఇటు జీవితాంతం లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు అటు క్రమానుగతంగా ఆదాయం కూడా అందించే సాధనమని వివరించారు. మరోవైపు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పాలసీలంటే మరణానంతరం మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాధనాలుగా ఒక ప్రతికూల అభిప్రాయం ఉండటం వల్ల వీటి గురించి మాట్లాడేందుకు ఎక్కువగా ఎవరూ ఇష్టపడరని అగర్వాల్ చెప్పారు. అయితే, కోవిడ్ రాకతో పరిస్థితులు మారాయని, జీవితంలో అనిశ్చితి గురించి అందరూ గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పరిణామాల అనంతరం తాము కూడా గణనీయంగా డిజిటల్‌కు మళ్లుతున్నామని వివరించారు. -
జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి!
ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో జీవిత బీమా పాలసీలను పోల్చి చూసుకుని, తీసుకోవడం సులభతరంగానే ఉంటున్నప్పటికీ.. పాలసీని ఎంపిక చేసుకునే ముందు పరిశీలించాల్సిన నాలుగు ముఖ్యాంశాలు ఉంటాయి. అవేంటంటే: ఆర్థిక లక్ష్యాలను మదింపు చేసుకోవడం: ప్రతీ ఒక్కరి జీవితాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. బీమా పాలసీ అనేది మీరు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, అలాగే మీపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు తోడ్పడే విధంగా ఉండాలి. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రుణాలు, వైద్య చికిత్సల ఖర్చులు, లేదా రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి పలు రకాల అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజీ ఉండాలని భావించేవారికి టర్మ్ ప్లాన్ ఉత్తమమైనది. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు కావాలంటే యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) లేదా రిటైర్మెంట్ ప్లాన్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. సొంతంగా అధ్యయనం చేయండి: మార్కెట్లో ప్రస్తుతం అనేకానేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు ముందు తగు స్థాయిలో అధ్యయనం చేయండి. పాలసీ రకం, అది అందించే ప్రయోజనాలను పరిశీలించండి. ఉదాహరణకు కొన్ని ప్లాన్లు రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడగలవు. అలాగే చిల్డ్రన్ ఇన్సూరెన్స్ పాలసీలు మీ పిల్లల భవిష్యత్తుకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండగలవు. ఇక ఎండోమెంట్ పాలసీ అనేది ఇటు జీవిత బీమా అటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఏకమొత్తంగా రాబడులు అందించగలదు. కవరేజీ ఎంచుకోవడం: సరైన ప్లాన్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో .. తగినంత కవరేజీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. సమ్ అష్యూర్డ్ అనేది హ్యూమన్ లైఫ్ వేల్యూ (హెచ్ఎల్వీ) లేదా ఆర్థికంగా పాలసీదారు విలువ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, చేయాల్సిన చెల్లింపులు, వివిధ దశల్లో ఆర్థిక లక్ష్యాలు మొదలైన అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కవరేజీ ఎంత తీసుకోవాలన్నదానిపై ఇథమిత్థంగా ఫార్ములా అంటూ ఏమీ లేకపోయినప్పటికీ.. వార్షిక వేతనానికి కనీసం 15 రెట్లు అయినా ఉండాలన్నది బండగుర్తుగా పాటిస్తుంటారు. పాలసీని ల్యాప్స్ కానివ్వకండి: టర్మ్ పూర్తయ్యే వరకూ వార్షిక ప్రీమియంలను చెల్లించడం ఆపకుండా జాగ్రత్తపడండి. బీమా ప్రయోజనాల రూపంలో మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ చిన్న అంశాలు దృష్టిలో ఉంచుకుంటే చాలు.. బీమా పాలసీ ప్రక్రియ అంతా సజావుగా ఉండగలదు. మీకు, మీ మీద ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించగలదు. - సంజయ్ తివారీ, డైరెక్టర్ (స్ట్రాటజీ) ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ -
హెచ్డీఎఫ్సీ లైఫ్ చేతికి ఎక్సైడ్ లైఫ్
ముంబై: ప్రైవేట్ బీమా రంగంలో సరికొత్త డీల్‌కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తెరతీసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి బీమా అనుబంధ సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.6,687 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌కు అటు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇటు ఎక్సైడ్ లైఫ్ కంపెనీల బోర్డులు తాజాగా ఆమోదముద్ర వేశాయి. ఒప్పందంలో భాగంగా ఎక్సైడ్ లైఫ్‌లో 100% వాటాను సొంతం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ వెల్లడించింది. షేరుకి రూ.685 ధరలో 8.7 కోట్లకుపైగా హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లను ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు జారీ చేయనుంది. తద్వారా కొనుగోలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా మరో రూ. 726 కోట్లను నగదు రూపంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. లావాదేవీ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు 4.1% వాటాను పొందనుంది. విలీనంవైపు..: పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఎక్సైడ్ లైఫ్‌ను విలీనం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏతోపాటు, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. వీటితోపాటు రెండు కంపెనీల వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక కొనుగోలు లావాదేవీని పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. దేశీ బీమా రంగంలో ఈ డీల్ ల్యాండ్‌మార్క్ వంటిదని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. దీంతో మరింత మందికి బీమా రక్షణ లభించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్సైడ్ బ్రాండు వినియోగానికి రెండేళ్ల కాలపరిమితి లభించనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో విభా పడల్కర్ వెల్లడించారు. ఎక్సైడ్ లైఫ్ తీరిదీ..: 2001–02లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎక్సైడ్ లైఫ్ 2021 జూన్‌కల్లా రూ.2,711 కోట్ల అసలు విలువను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో మొత్తం రూ. 3,325 కోట్ల విలువైన ప్రీమియంను అందుకుంది. జూన్‌కల్లా రూ. 18,780 కోట్ల విలువైన ఏయూఎంను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం పతనమై రూ. 734 వద్ద ముగిసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ముగిసింది. -
వేగవంతమైన వృద్ధిపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుసగా గత తొమ్మిదేళ్ల నుంచి లాభాల బాటలో ఉన్న ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అత్యంత సంపన్న వ్యక్తులు (హెచ్ఎన్ఐ) సహా వివిధ వర్గాలకు అనువైన పథకాలను రూపొందిస్తోంది. ‘‘2002 నుంచి ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పాలసీదారులకు బోనస్‌లు ఇస్తున్నాం. పాలసీదారులను ఆకర్షించడానికి ఇది ఒక కీలకాంశం కాగలదు. దీంతో పాటు వినూత్న పాలసీలు ప్రవేశపెడుతున్నాం. ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ పేరిట కొత్తగా గ్యారంటీడ్ సేవింగ్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉంటూ మెరుగైన రాబడులు కోరుకునే వారికి ఇది అనువైన పథకం. వివిధ కేటగిరీల్లో పథకాల మేళవింపును మెరుగుపర్చుకుంటున్నాం‘ అని కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ‘మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరిశ్రమలో మెరుగ్గా 98.54 శాతం స్థాయిలో ఉంటోంది. క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. గడిచిన 3–4 సంవత్సరాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, ఈ–సేల్స్ వంటి సాధనాలపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టపర్చుకున్నాం. కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, పాలసీల విక్రయ ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు మా సేల్స్ బృందాలు, భాగస్వాములకు తోడ్పడేలా డేటా, డిజిటైజేషన్ సామర్థ్యాలను పటిష్టం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు. 800 కోవిడ్ క్లెయిములు .. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పట్నుంచి కోవిడ్–19కి సంబంధించి 800 క్లెయిమ్స్ వచ్చాయని, వాటన్నింటిని సాధ్యమైనంత వేగంగా సెటిల్ చేశామని అగర్వాల్ వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 582 వ్యక్తిగత కోవిడ్–19 క్లెయిమ్‌లు, 147 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చాయని, వాటన్నింటిని సెటిల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మే నెల దాకా 38 వ్యక్తిగత క్లెయిమ్‌లు, 6 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చినట్లు తెలిపారు. మార్చి ఆఖరు నాటి దాకా కోవిడ్–19 క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కింద దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లు అగర్వాల్ వివరించారు. మారిన పంపిణీ వ్యవస్థ.. కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని అగర్వాల్ తెలిపారు. సాంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు బీమా సంస్థలు మారుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో తమ సంస్థకు సంబంధించి ఈ–సేల్స్ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫాం తయారు చేసుకున్నామని, ప్రస్తుతం కొత్త ప్రపోజల్స్‌లో 95 శాతం భాగం దీని ద్వారానే లాగిన్ అవుతున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. లాగిన్ దగ్గర్నుంచి పాలసీ జారీ అయ్యే దాకా ఈ విధానంతో పారదర్శకత, సమర్థత పెరిగిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంలో వ్యయాలను నియంత్రించుకోవడానికి కూడా ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్ల ఆదాయాలు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సేల్స్ బృందాలకు డిజిటల్ సాధనాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. సరైన పథకాలను అందించడం ద్వారా జీవిత బీమా రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తుంటారని, ఈ నేపథ్యంలో డిజిటల్ విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నా సాంప్రదాయ పంపిణీ విధానాలు కూడా కొనసాగుతాయని వివరించారు. -
టర్మ్ ప్లాన్లకు డిమాండ్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాహుల్ అగర్వాల్. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు.. మీ వ్యాపారంపై కరోనా వైరస్ ప్రభావమేంటి? కరోనా వైరస్ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్డౌన్లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్‌లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది. మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది? పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్డౌన్ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం. కోవిడ్–19 సంబంధ క్లెయిమ్స్ ఏమైనా వచ్చాయా? జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్సైట్లో ప్రత్యేకంగా కోవిడ్–19 సెక్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం. కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా? సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్ టర్మ్ ప్లాన్, స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్ వీటిలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది? టర్మ్ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే టర్మ్ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత? ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్ పోర్ట్‌ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్షిప్ మేనేజర్లు, సూపర్వైజర్ స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. -
ఎక్సైడ్ లైఫ్ నుంచి స్మార్ట్ టర్మ్ ప్లాన్
హైదరాబాద్: సమగ్రమైన లైఫ్ కవరేజీ అందించేలా ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. టర్మ్ పాలసీ అయినప్పటికీ .. పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను పాలసీ వ్యవధి ముగిశాక తిరిగివ్వడం దీనిలో ప్రత్యేకత. ఇది క్లాసిక్, స్టెప్ అప్, కాంప్రిహెన్సివ్ వేరియంట్లలో లభిస్తుంది. క్లాసిక్ విధానంలో పాలసీ గడువు పూర్తయ్యాక అప్పటిదాకా కట్టిన వార్షిక ప్రీమియంలకు సరిసమానమైన మొత్తాన్ని అందుకోవచ్చు. ఇక స్టెప్అప్ విధానంలో వార్షిక ప్రీమియంల కన్నా 150 శాతం దాకా పొందవచ్చు. కాంప్రహెన్సివ్ వేరియంట్ ఎంచుకుంటే.. మరింత అధిక బీమా కవరేజితో పొందడంతో పాటు, చెల్లించిన ప్రీమియంలలో కొంత మొత్తాన్ని కూడా మెచ్యూరిటీ సమయంలో అందుకోవచ్చని ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ తివారి తెలిపారు. -
ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించనున్నారు. ధోని బ్రాండింగ్ వల్ల సంస్థ విలువ మరింత పెరుగుతుందని ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెరైక్టర్ (మార్కెటింగ్) మోహిత్ గోయెల్ పేర్కొన్నారు. దీర్ఘకాలపు బంధాల వల్ల నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్ సంస్థకు తొలిసారి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉందని ధోని అన్నారు. -
ఎక్సైడ్ లైఫ్ నుంచి ‘వెల్త్ మ్యాక్సిమా’
అందుబాటులోకి 3 బీమా పథకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. అవి మ్యాక్సిమా ఇన్వెస్ట్, మ్యాక్సిమా ఫ్యామిలీ, మ్యాక్సిమా చైల్డ్ ప్లాన్లు. రిస్క్ ధోరణిలకు, అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారేందుకు కూడా ఇందులో వీలుంటుంది. మ్యాక్సిమా ఇన్వెస్ట్ ప్లాన్ అంటే.. లైఫ్ కవర్ మొత్తం లేదా అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూలో రెండిట్లో ఏది ఎక్కువైతే అది అందుతుంది. మ్యాక్సిమా ఫ్యామిలీ అంటే.. లైఫ్ కవర్, అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూ రెండింటినీ కుటుంబం పొందుతుంది. మ్యాక్సిమా చైల్డ్ అంటే.. లైఫ్ కవర్ మొత్తాన్ని కుటుంబం వెంటనే పొందటంతో పాటుగా దీనికి అదనంగా ఈ ప్లాన్ ఆప్షన్ ప్రీమియం బెనిఫిట్‌ను అందిస్తుంది.సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది.