హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుసగా గత తొమ్మిదేళ్ల నుంచి లాభాల బాటలో ఉన్న ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అత్యంత సంపన్న వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ) సహా వివిధ వర్గాలకు అనువైన పథకాలను రూపొందిస్తోంది.
‘‘2002 నుంచి ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పాలసీదారులకు బోనస్‌లు ఇస్తున్నాం. పాలసీదారులను ఆకర్షించడానికి ఇది ఒక కీలకాంశం కాగలదు. దీంతో పాటు వినూత్న పాలసీలు ప్రవేశపెడుతున్నాం. ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ పేరిట కొత్తగా గ్యారంటీడ్ సేవింగ్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉంటూ మెరుగైన రాబడులు కోరుకునే వారికి ఇది అనువైన పథకం. వివిధ కేటగిరీల్లో పథకాల మేళవింపును మెరుగుపర్చుకుంటున్నాం‘ అని కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు.
‘మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరిశ్రమలో మెరుగ్గా 98.54 శాతం స్థాయిలో ఉంటోంది. క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. గడిచిన 3–4 సంవత్సరాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, ఈ–సేల్స్ వంటి సాధనాలపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టపర్చుకున్నాం. కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, పాలసీల విక్రయ ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు మా సేల్స్ బృందాలు, భాగస్వాములకు తోడ్పడేలా డేటా, డిజిటైజేషన్ సామర్థ్యాలను పటిష్టం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు.
800 కోవిడ్ క్లెయిములు ..
కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పట్నుంచి కోవిడ్–19కి సంబంధించి 800 క్లెయిమ్స్ వచ్చాయని, వాటన్నింటిని సాధ్యమైనంత వేగంగా సెటిల్ చేశామని అగర్వాల్ వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 582 వ్యక్తిగత కోవిడ్–19 క్లెయిమ్‌లు, 147 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చాయని, వాటన్నింటిని సెటిల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మే నెల దాకా 38 వ్యక్తిగత క్లెయిమ్‌లు, 6 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చినట్లు తెలిపారు. మార్చి ఆఖరు నాటి దాకా కోవిడ్–19 క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కింద దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లు అగర్వాల్ వివరించారు.
మారిన పంపిణీ వ్యవస్థ..
కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని అగర్వాల్ తెలిపారు. సాంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు బీమా సంస్థలు మారుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో తమ సంస్థకు సంబంధించి ఈ–సేల్స్ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫాం తయారు చేసుకున్నామని, ప్రస్తుతం కొత్త ప్రపోజల్స్‌లో 95 శాతం భాగం దీని ద్వారానే లాగిన్ అవుతున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు.
లాగిన్ దగ్గర్నుంచి పాలసీ జారీ అయ్యే దాకా ఈ విధానంతో పారదర్శకత, సమర్థత పెరిగిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంలో వ్యయాలను నియంత్రించుకోవడానికి కూడా ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్ల ఆదాయాలు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సేల్స్ బృందాలకు డిజిటల్ సాధనాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. సరైన పథకాలను అందించడం ద్వారా జీవిత బీమా రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తుంటారని, ఈ నేపథ్యంలో డిజిటల్ విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నా సాంప్రదాయ పంపిణీ విధానాలు కూడా కొనసాగుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment