ఎల్‌ఐసీ 1956లో ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే ఉన్నత లక్ష్యాలతో ప్రజల, పాలసీదారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. కానీ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2 లక్షల 10 వేల కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఎల్‌ఐసీలో 25 శాతం వాటాలను అమ్ముకోవడానికి సిద్ధమవుతోందని వార్తలు. 1956లో ఎల్‌ఐసీలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టడం మినహా, ఇప్పటివరకు సంస్థ విస్తరణ, అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా అందించలేదు. మరి 40 కోట్ల పాలసీదారుల అచంచల విశ్వాసం కలిగిన ఎల్‌ఐసీ సంస్థ వాటాలను, వారి అనుమతి లేకుండా విక్రయించడం ఏమేరకు సమర్థనీయం!
కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో తన వాటాను కొంత భాగం అమ్మాలని, స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చెయ్యాలని తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎల్‌ఐసీలో వాటాల అమ్మకం సహేతుకమా, కాదా అని విశ్లేషించే ముందు ఎల్‌ఐసీ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను గురించి తెలుసుకుందాం. 1956కు పూర్వం దేశంలో విదేశీ, ప్రైవేటు బీమా కంపెనీలు ప్రజల సొమ్మును స్వాహా చేస్తుండేవి. దీనితో 25 జీవిత బీమా కంపెనీలు మూతపడి, మరొక 25 కంపెనీలను ఇతర కంపెనీలకు బదలాయించారు. దాల్మియా నేతృత్వంలోని భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ 2 కోట్లు దగా చేసింది. వేలాదిమంది పాలసీదారులు రోడ్డున పడ్డారు.
జీవిత బీమా వ్యాపారం కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుచేతనే, బీమారంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 1945లోనే తన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ గ్రంథంలో పేర్కొన్నారు. 1951 నుండీ 1956 వరకు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం జరిపిన సమరశీల ఉద్యమాల కారణంగా అప్పటి నెహ్రూ ప్రభుత్వం జనవరి 19,1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది. 1.9.1956న 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను మిళితం చేసి 5 కోట్ల ప్రభుత్వ మూలధనంతో ఎల్‌ఐసీని ఏర్పరిచారు. ‘యోగక్షేమం వహామ్యహం’ (భగవద్గీతలోని ముఖ్య శ్లోకం–దీని అర్థం మీ యోగ క్షేమాలకు నాదే బాధ్యత) అనే నినాదంతో జాతీయ బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రస్థానం మొదలైంది. ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే ఉన్నత లక్ష్యాలతో ఎల్‌ఐసీ పనిచేయబట్టే, నేడు ప్రజల, పాలసీదారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది.
ఎల్‌ఐసీని లిస్టింగ్ చేయడం ఎవరి మేలు కోసం?
ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ 2,10,000 కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే ఎల్‌ఐసీలో కొంత మేర వాటాలు అమ్మి ఆ సొమ్ముతో ద్రవ్యలోటు పూడ్చుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని విశ్లేషకుల వ్యాఖ్య. ఫిబ్రవరిలో 5 నుండి 10% వాటాలు మాత్రమే అమ్ముతారని ప్రచారం జరిగినా, నేడు 25% పైబడి అమ్మే అవకాశం ఉందని, ప్రభుత్వం ఈ దిశగా క్యాబినెట్ నోట్‌ను తయారు చేసి ఐఆర్‌డీఏ, సెబీకి పంపిందని పత్రికలలో వార్తలు వస్తున్నాయి. 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 40 కోట్ల పాలసీదారులు, 13 లక్షల మంది మానవ వనరులను కలిగిన, దేశ వ్యాప్తంగా బ్రాండ్ విలువ ఉన్న ఎల్‌ఐసీ లిస్టింగ్‌వల్ల దాని నిజవిలువ అవిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎల్‌ఐసీ 31 డిసెంబర్, 2019 నాటికి రూ. 30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ. 24.10 లక్షల కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌ఐసీ కేటాయించింది. 2019–20లో ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ. 6 లక్షల కోట్లు.
2018 –19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఎల్‌ఐసీ రూ 2.23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు (65 పైసల వడ్డీతో) అందించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1.4.2012 నుండి 31.03.2017 వరకు) రూ. 14,23,055 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక రెండు సంవత్సరాలలోనే రూ. 7,01,483 కోట్లను ఎల్‌ఐసీ అందించింది. ఏడాదికి రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగల రిజర్వ్ నిధులు కలిగిన ఎల్‌ఐసీ సంస్థకు స్టాక్ మార్కెట్ నుండి నిధుల అవసరం ఉందా! ఎల్‌ఐసీ లిస్టింగ్ వలన 130 కోట్ల ప్రజల, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలకు బదులు 3%గా ఉన్న సంస్థాగత మదుపుదారుల హవా పెరుగుతుంది. ఇది ఎల్‌ఐసీ సంస్థకు, పాలసీదారులకు ఏమేరకు ప్రయోజనం? అదే సమయంలో లిస్టింగ్ అయిన ప్రైవేటు బీమా కంపెనీలు దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం పెట్టిన పెట్టుబడులు నామమాత్రమే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి అతిపెద్ద బీమా కంపెనీని అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. సెప్టెంబర్11, 2001న అమెరికాలో ట్విన్ టవర్లు ఉగ్రవాద ఘటనలో కూలిపోతే, ప్రభుత్వ సాయం ఉంటేనే క్లయిములు చెల్లిస్తామని అక్కడి బీమా కంపెనీలు తెగేసి చెప్పాయి.
దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు(వరదలు, సునామీలు, భూకంపాలు) సంభవించినా అన్ని నిబంధనలు సడలించి ఎల్‌ఐసీ క్లెయిములు పరిష్కరిస్తోంది. దేశీయ రైల్వే అభివృద్ధికి ఎల్‌ఐసీ లక్షా యాభైవేల కోట్ల రూపాయలు, జాతీయ రహదారుల అభివృద్ధికి మరో లక్షా పాతిక వేల కోట్లు అందించనుంది. ఒకసారి ఎల్‌ఐసీను లిస్టింగ్ చేస్తే, దేశ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ ఇంత పెద్ద మొత్తంలో దేశ సంక్షేమం కోసం నిధులను కేటాయించడానికి, ఎల్‌ఐసీ బోర్డ్‌లోకి ప్రవేశించే ప్రైవేటు మదుపుదారులు అంగీకరిస్తారా? ఎల్‌ఐసీ అత్యంత పారదర్శకమైన ఆర్థిక సంస్థ. ప్రతి నెలా బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ)కు ఎల్‌ఐసీ నివేదికలు సమర్పిస్తుంది. ఎల్‌ఐసీ ఆర్థిక లావాదేవీలను ప్రతీ ఏటా పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సంస్థ నిర్వహించిన ట్రాన్స్ప రెన్సీ ఆడిట్లో ఎల్‌ఐసీ ‘గ్రేడ్–ఏ’ (97%)గా నిలిచింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు అయిన ప్రతి సందర్భంలోనూ ఎల్‌ఐసీనే మార్కెట్లను ఆదుకుంది.
‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్’, ‘బెస్ట్ బ్రాండ్ అవార్డ్’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు ‘బంగారు నెమలి’ని పొందింది. అత్యుత్తమ సేవా బ్రాండ్‌గా మార్గ్ లాంటి సంస్థలచే అవార్డులు పొందింది. ప్రతిష్టాత్మక రీడర్స్ డైజెస్ట్ వారిచే ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్ 20 ఏళ్లుగా ఎల్‌ఐసీ అందుకుంటోంది. దాదాపు 98.27% క్లెయిమ్‌లను పరిష్కరించడం ద్వారా ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 2.15 కోట్ల సంఖ్యలో క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరుపొందింది. 2018–19 ఐఆర్‌డీఏ నివేదిక ప్రకారం ఎల్‌ఐసీ నిర్వహణా ఖర్చులు 3.19% తగ్గగా, ప్రైవేటు బీమా కంపెనీలలో అవి 17.5% పెరిగాయి. ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన 100 కోట్ల ఈక్విటీ పెట్టుబడిపై 1956 నుండి ఇప్పటివరకు డివిడెండ్ రూపంలో రూ. 26,005 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ అందించింది. ఒక్క 2018–19లలోనే రూ. 2,611 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ఎల్‌ఐసీ అందించింది. ఇదిగాక ఇన్‌కంట్యాక్స్, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను రూపంలో ప్రభుత్వానికి ఏటా పది వేల కోట్ల రూపాయల పైబడి చెల్లిస్తోంది.
లిస్టింగ్ వల్ల కంపెనీలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందనేది అసంబద్దం. డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్‌ఎఫ్–ఎస్, ఆర్‌కామ్, రిలయన్స్ డిఫెన్స్, ఎస్సార్, తాజాగా యస్ బ్యాంక్ వంటి కంపెనీల నిర్వాకం వల్ల లక్షల్లో చిన్న మదుపుదారులు నష్టపోయారు. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీలే. మరి వేలకోట్ల రూపాయలు అప్పులిచ్చిన బ్యాంకులు మార్కెట్‌లలో లిస్ట్ కాలేదా? అప్పులు తీసుకుని ఎగ్గొడుతున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కాలేదా ? యస్ బ్యాంకు బాగోతం సంగతి ఏమిటి? కనుక, లిస్టింగ్ వల్ల ఎల్‌ఐసీ పనితీరు మెరుగుపడుతుందనే ప్రచారం హాస్యాస్పదం! గతంలోనే ఎల్‌ఐసీని 5 ముక్కలు చేయాలని, ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాను 50% అమ్మివేయాలని జరి గిన ప్రయత్నాలను ఎల్‌ఐసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లు, పాలసీదారుల సహకారంతో తిప్పికొట్టారు. 1956లో ఎల్‌ఐసీ సంస్థలో రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టడం మినహా, ఇప్పటివరకు సంస్థ విస్తరణ, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా అందించలేదు. మరి 40 కోట్ల పాలసీదారుల అచంచల విశ్వాసం కలిగిన ఎల్‌ఐసీ సంస్థ వాటాలను, వారి అనుమతి లేకుండా విక్రయించడం ఏమేరకు సమర్థనీయం!
కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ ప్రీమియంపై విధిస్తున్న జీఎస్టీని తొలగించి, బీమా పాలసీలకు ప్రత్యేక ఆదాయపు పన్ను రాయితీ, ఎల్‌ఐసీ బోర్డ్‌కు మరింత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినపక్షంలో ఎల్‌ఐసీ మరిం తగా దేశ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేయగలదు. ప్రస్తుత ప్రభుత్వ ‘ఆత్మ నిర్భర్ భారత్’ లక్ష్యం సాకారం కావాలంటే ఎల్‌ఐసీ పాత్ర కీలకం. కనుక, ప్రభుత్వం ఎల్‌ఐసీని లిస్టింగ్ చేసే ఆలోచన విరమించుకోవాలి. గత 19 ఏళ్లుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ 71 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో ఎల్‌ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. కనుక 40 కోట్ల పాలసీదారులకు, కోట్లాది ప్రజలకు సేవలు అందిస్తున్న ఎల్‌ఐసీకి ప్రజల నమ్మకమే శ్రీరామరక్ష.
పి సతీష్
వ్యాసకర్త ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు
మొబైల్ : 94417 97900
Comments
Please login to add a commentAdd a comment