జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా: సీఎం
డిసెంబర్ 24న స్వస్త విద్యావాహిని ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే జనవరి 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీనికి ముందే స్వస్త విద్యావాహిని పేరుతో మరో కార్యక్రమాన్ని డిసెంబర్ 24 వ తేదీన రాష్ట్రంలోని 222 ప్రదేశాల నుంచి ప్రారంభించనున్నట్టు చెప్పారు. మంగళవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ రెండు పథకాలను కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలని నిర్ణరుుంచినట్లు చంద్రబాబు చెప్పారు.
ఆరోగ్య బీమా కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. స్వస్త విద్యావాహిని పథకం విద్యార్థులకు ఉద్దేశించినది. బాలబాలికలకు సరైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించడం, వారిలో రోగనిరోధక శక్తి పెంచడం ఈ పథకం లక్ష్యాలు. క్లినికల్ స్పెషలిస్టుల కోసం ఉద్దేశించిన ఇన్‌సోర్సింగ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 25 హెల్త్ ఏటీఎంలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.