![harish rao on Health Insurance Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/9/harishr.jpg.webp?itok=0_zAogvj)
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆరోగ్య బీమా పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వైపు దేశమంతా చూసేలా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పని చేస్తోందని కితాబిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ‘వెల్‌నెస్ సెంటర్’ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు.
కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ‘ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు’కార్యక్రమం ద్వారా.. అందరి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తామన్నారు. రోగి పూర్వ స్థితి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి ఆరోపించారు.
రూ.3,324 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంతాన సాఫల్యత కోసం పేద, మధ్య తరగతి వర్గాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బ్రీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సఖి కేంద్రం ప్రారంభం
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ‘సఖి’కేంద్రాన్ని మంత్రి హరీశ్ ప్రారంభించారు. అనంతరం కందుల కొనుగోలు తీరుపై సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment