
బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్,
హరీశ్‌రావు నామినేషన్‌ను మాయం చేశారు
బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్‌రెడ్డి
పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్‌ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్‌లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.
అనంతరం బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్‌తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.
అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తి
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment