కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు | Felicitation to Actress Vanisri | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు

Published Fri, Oct 14 2016 10:35 PM | Last Updated on Tue, Oct 2 2018 2:48 PM

కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు - Sakshi

కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు

విజయవాడ కల్చరల్‌:  ‘బెజవాడ కృష్ణమ్మ నా కళా జీవితానికి పునాది’ అని అలనాటి ప్రముఖ నటీమణి, కళాభినేత్రి వాణిశ్రీ అన్నారు. మహానటి సావిత్రి సాహిత్య, సాంస్కృతిక  కళాపీఠం నిర్వహణలో గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం సాయంత్రం వాణిశ్రీకి ఘనంగా పౌరసత్కారం జరిగింది. వాణిశ్రీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాతో  నా అనుబంధం ఈ నాటిది కాదని, నా కళాజీవితంలో అనేక సంఘటనలు ఇక్కడే ముడివేసుకున్నాయని వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికగా విజయవాడ నగరం నిలిచిపోయింది, విజయవాడ ప్రేక్షకుల ఆదరణ మరువలేమని వివరించారు. మహానటి సావిత్రి నటజీవితం తనకు ఆదర్శమని ఆమె ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. కృష్ణవేణి చిత్రంలో నటించటం తన నట జీవితంలో మరచిపోలేని సంఘటనగా ఆమె పేర్కొన్నారు. కళాపీఠం నిర్వాహకురాలు పరచూరి విజయలక్ష్మి సావిత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని అభినందించారు.
వాణిశ్రీ తెలుగు నవలా నాయకి
 డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు సినిమా ఆణిముత్యం వాణిశ్రీ,  అమె నట జీవితం భావి నటులకు ఆదర్శమని అన్నారు. ఆమె నట జీవితం స్వర్ణయుగంతో ప్రారంభమైందన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ వాణిశ్రీ తెలుగు నవలా నాయకియని అభినందించారు. ఆమె సంభాషణలో చురుకుదనం, నటలో పరిపక్వత తెలుగు ప్రేక్షులు మరచిపోలేరన్నారు.  పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ మహానటి సావిత్రికి వారసురాలు వాణిశ్రీ అని అభివర్ణించారు.
 2016 సంవత్సరానికి గానూ హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి గుర్రం లాలినిధికి మహానటి సావిత్రి అమరావతి పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు  ప్రబల శ్రీనివాస్‌ , న్యాయవాది అక్కిపెద్ది వెంకటరమణ, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఘంటసాల పవన్‌కుమార్‌ బృందం పలు నృత్యాంశాలను ప్రదర్శించింది. నేరెళ్ళ సురేష్‌కుమార్‌ బృందం సంగీత విభావరి ఆకట్టుకుంది. పెద్దసంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement