best teacher award
-
ఊరంతా మా కుటుంబమే!
విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు. ‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్వాడీ టీచర్‌గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను. అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్వాడీ హోమ్ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఇంటింటి ప్రోగ్రామ్.. గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్ స్టోరీలు కూడా నోట్ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు. ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. అందరూ మా వాళ్లే.. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది. కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. బెస్ట్ అవార్డీగా... మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్ అంగన్వాడీ టీచర్‌గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్‌తో ఐటమ్స్ తయారుచేసి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. మా అంగన్వాడీ టీచర్స్‌కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ. – నిర్మలా రెడ్డి -
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
రేపు రాష్ట్రంలో 95 మంది టీచర్లకు అవార్డుల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 95 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 57 మందిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్-2013 కింద ఉత్తమ ఉపాధ్యాయులుగా 38 మంది టీచర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం జరుగుతుంది. అవార్డు కింద ఒక్కో టీచర్‌కు రూ. 3 వేల నగదుతోపాటు గోల్డ్ మెడల్‌ను అందజేస్తారు. సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు.